తిరుమలలో ప్రయోగాత్మక బ్రేక్‌దర్శనం ప్రారంభం

తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రేక్‌ దర్శన సమయంలో మార్పు గురువారం నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. సుప్రభాత, తోమాల, అర్చన సేవల అనంతరం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో 16 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులకు ఉదయం 6 నుంచి 7.30 గంటల వరకు దాదాపు 8వేల మందికి సర్వదర్శనం కల్పించారు.

Published : 02 Dec 2022 02:53 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రేక్‌ దర్శన సమయంలో మార్పు గురువారం నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. సుప్రభాత, తోమాల, అర్చన సేవల అనంతరం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో 16 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులకు ఉదయం 6 నుంచి 7.30 గంటల వరకు దాదాపు 8వేల మందికి సర్వదర్శనం కల్పించారు. అనంతరం ఉదయం 8 గంటల నుంచి బ్రేక్‌ దర్శనం టికెట్లు కలిగిన భక్తులను అనుమతించారు.

శ్రీవాణి ట్రస్టు భక్తులకు దర్శనం ఆలస్యం

ఉదయం 10 గంటల సమయంలో స్వామివారికి రెండో గంట నైవేద్యం సమర్పించి తిరిగి 10.30 గంటల సమయంలో ప్రొటోకాల్‌ పరిధిలోని ప్రముఖులను దర్శనానికి పంపించారు. అనంతరం శ్రీవాణి ట్రస్టు టికెట్లు పొందిన భక్తులను బ్రేక్‌ దర్శనానికి అనుమతించారు. దీంతో శ్రీవాణి ట్రస్టు టికెట్లు కలిగిన భక్తుల్లో కొందరికి గంటన్నర పాటు దర్శనం ఆలస్యమైంది. ఆలస్యంగా దర్శనానికి అనుమతించడంతో తిరుగు ప్రయాణ ఏర్పాట్లకు ఇబ్బంది ఏర్పడిందని వారు వాపోయారు. వైకుంఠం కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులకు ఉదయం త్వరగా స్వామివారి దర్శనం కల్పించేందుకు బ్రేక్‌ దర్శన సమయాన్ని మార్చినట్లు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రారంభంలో చిన్నచిన్న సమస్యలు ఏర్పడినా ఒకటి, రెండు రోజుల్లో సర్దుకుంటాయని అన్నారు.


శ్రీవారి సేవలో జాన్వీ

తిరుమల, న్యూస్‌టుడే: ప్రముఖ సినీనటి, దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ గురువారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందజేయగా, తితిదే అధికారులు తీర్థప్రసాదాలు ఇచ్చారు. ఆలయం వెలుపల అభిమానులు ఆమె చుట్టూ చేరి సెల్ఫీలు తీసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని