యువ మేధతో ప్రపంచశక్తిగా భారత్‌

స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్‌ ప్రపంచశక్తిగా ఎదిగేలా విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించాలని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు.

Updated : 06 Dec 2022 07:36 IST

అందుకోసం వచ్చే 25 ఏళ్లకు విజన్‌ డాక్యుమెంట్‌ తయారుచేయాలి

2047 తర్వాత వయోభారం సమస్య

డెమోగ్రఫిక్‌ మేనేజ్‌మెంట్‌తో ఎదుర్కోవాలి: చంద్రబాబు

ఈనాడు, దిల్లీ: స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్‌ ప్రపంచశక్తిగా ఎదిగేలా విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించాలని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. భారత్‌ నాలెడ్జ్‌ ఎకానమీని సరైన సమయంలో అందుకున్నందున తిరుగుండదన్నారు. అయితే 2047 నాటికి భారతీయుల సగటు వయస్సు పెరిగే అవకాశం ఉన్నందున దాన్ని అధిగమించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. భారత్‌ జి-20 నాయకత్వ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే శిఖరాగ్ర సదస్సు నాటికి ఏయే అంశాలపై చర్చించాలి, దేశం ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై సూచనలు, సలహాలు స్వీకరించడానికి ప్రధాని మోదీ నేతృత్వంలో సోమవారం దిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ ‘జి-20 నాయకత్వ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, అందరి అభిప్రాయాలు తీసుకోవడం సంతోషకరం. ఇటీవలే 75వ స్వాతంత్య్ర ఉత్సవాలను ఘనంగా నిర్వహించి దేశ శక్తిసామర్థ్యాలను చాటిచెప్పారు. ఇప్పుడు భారత్‌ ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందుతోంది. మనం సరైన సమయంలో ఐటీ, డిజిటల్‌ వ్యవస్థను అందుకోగలిగాం. మేధోసంపన్నమైన ఆర్థిక వ్యవస్థకు ఐటీ వెన్నెముక. దీన్ని అందిపుచ్చుకొని ప్రపంచవ్యాప్తంగా భారతీయులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇందుకు కారణం మన యువశక్తి సామర్థ్యాలే. ఈ పైచేయి మరో పాతికేళ్లు నిరాటంకంగా కొనసాగుతుంది. యువశక్తిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకొనేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తే 2047 నాటికి మన దేశం నంబర్‌ వన్‌గా ఎదగడం ఖాయం. దానివల్ల భారతీయులు ఉద్యోగ, సంపద సృష్టికర్తలుగా మారి.. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ, రాజకీయ, కార్పొరేట్‌ వ్యవస్థలను శాసించగలిగే స్థాయికి చేరొచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీ నాయకత్వంలో ‘ఇండియా ఎట్‌ హండ్రెడ్‌ ఇయర్స్‌- గ్లోబల్‌ లీడర్‌’ పేరుతో విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించాలి. అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు. భవిష్యత్తులో మన జనాభా సగటు వయస్సు పెరిగే అవకాశం ఉంది.. దాన్ని మన శక్తిగా మార్చుకొనేలా డెమోగ్రఫిక్‌ మేనేజ్‌మెంట్‌ చేయగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చని చంద్రబాబు చెప్పారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దాన్ని ఇప్పుడు మొదలుపెడితే మనం ఈ విషయంలో ప్రపంచం కంటే ముందుంటామన్నారు. లేదంటే ఇప్పుడు చైనా, జపాన్‌, ఐరోపా దేశాలు ఎదుర్కొంటున్న వయోభార సమస్యను భారత్‌ కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.  ఇప్పటి నుంచే మేనేజ్‌మెంట్‌ మొదలుపెడితే సమస్యను శాశ్వతంగా అధిగమించగలుగుతామని,  2047 తర్వాత దీన్ని ఎదుర్కోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. మన మేధస్సును, డిజిటల్‌ వ్యవస్థతో సమ్మిళితం చేసి ఉపయోగించుకోగలిగితే నాయకత్వ స్థానంలో నిలవడం ఖాయమన్నారు. వినూత్నంగా ఆలోచించి ప్రతి సమస్యకూ పరిష్కారం కనుగొనే శక్తి భారతీయ యువతకు ఉందని.. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఎదురయ్యే వైద్య, పర్యావరణ, ఇంధన సమస్యలకు మనం పరిష్కారం చూపగలుగుతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఉపన్యాసం ప్రారంభించే ముందు చంద్రబాబు, మమతా బెనర్జీల సూచనలను ప్రస్తావించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని