పాలకులే ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతుంటే..!

అభివృద్ధి చేయాల్సిన పాలకులే.. రోడ్డెక్కి సీమలో ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతూ ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారని పౌరసంఘాల నేతలు విరుచుకుపడ్డారు.

Published : 08 Dec 2022 05:15 IST

సీమకు గర్జనలు కాదు... అభివృద్ధి కావాలి
‘ఈటీవీ ప్రతిధ్వని’ చర్చలో వక్తలు

ఈటీవీ, అమరావతి: అభివృద్ధి చేయాల్సిన పాలకులే.. రోడ్డెక్కి సీమలో ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతూ ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారని పౌరసంఘాల నేతలు విరుచుకుపడ్డారు. అధికారంలోకి వస్తే మూతపడిన పరిశ్రమలకు పూర్వవైభవం కల్పిస్తామని హామీ ఇచ్చిన నేతలు.. దానిని నెరవేర్చకపోగా, ఉన్నవాటినీ తరిమేస్తున్నారని విమర్శించారు. రాయలసీమకు ఒక్కటైనా ప్రాజెక్టు తెచ్చామని గుండెల మీద చేయివేసుకుని చెప్పండి అని నిలదీశారు. పులివెందులలో బస్టాండ్‌ను కూడా పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు.  ప్రజలు కోరుకునేది గర్జనలు కాదు... అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారని పేర్కొన్నారు. రాయలసీమలో పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, ఉపాధి అవకాశాల కల్పనపై ‘సీమకు గర్జన కాదు, అభివృద్ధి కావాలి’ అనే అంశంపై ‘ఈటీవీ - ప్రతిధ్వని’ బుధవారం నిర్వహించిన చర్చలో పలువురు వక్తలు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.


సీమ యువత కంట కన్నీరు
- నవీన్‌కుమార్‌ రెడ్డి, కన్వీనర్‌, రాయలసీమ పోరాట సమితి, తిరుపతి

రాయలసీమ గర్జన అనేది ఓ నాటకం. అత్యంత వెనకబడిన చిత్తూరు జిల్లాలో కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా.. ఉన్న పరిశ్రమలను ఎంపీలు, ఎమ్మెల్యేలు పోటీ పడి మరీ తరిమేస్తున్నారు. అవి తమిళనాడు, తెలంగాణకు వెళ్లిపోతుంటే ఆ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువత కంట కన్నీరు కారుస్తోంది. చిత్తూరు జిల్లా మన్నవరం దగ్గర భెల్‌ ఫ్యాక్టరీకీ శంకుస్థాపన చేసినా ఎందుకు తీసుకు రాలేకపోయారు. ఈ ప్రాంతంపై ప్రేమతో పరిశ్రమ ఏర్పాటు చేసిన అమరరాజా యజమానులు ఇప్పుడు మరో రాష్ట్రంలో పరిశ్రమ పెడుతున్నారు. రూ.9,300 కోట్లతో ఇక్కడ పెట్టాల్సిన పరిశ్రమకు తెలంగాణలో భూమి పూజ చేస్తుంటే మా కడుపు తరుక్కుపోయింది. హంద్రీనీవా గాలేరు నగరి ప్రాజెక్టుకు తట్టెడు మట్టి వేయలేదు.


చేతగానితనాన్ని కప్పిపుచ్చునేందుకే రెచ్చగొట్టే ధోరణి
- ఐ పుల్లారెడ్డి, పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ, కర్నూలు

చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. రాయలసీమకు అన్యాయం జరిగి ఉంటే అభివృద్ధి చేయాలి. పక్కదారి పట్టించడమంటే ప్రజలకు అన్యాయం చేయడమే. ఓర్వకల్లు సమీపంలో 32 వేల ఎకరాల భూములు సేకరించారు.  ఇదిగో అదిగో అని చెప్పడమే తప్ప అక్కడ ఎలాంటి పరిశ్రమను ఏర్పాటు చేయలేదు. జిల్లాలో టమాటా రైతులు పంటను రోడ్లపై పారబోస్తున్నారు. జ్యూస్‌ ఫ్యాక్టరీ పెట్టేందుకూ చర్యలు తీసుకోవడం లేదు. కర్నూలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు గంపెడు మట్టి వేయలేదు. లక్షల మంది వలసలు వెళ్తున్నారు. కర్నూలు జిల్లాలోనే రైతులు ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి.


కడపలో కేటాయింపులే.. నిధుల్లేవు
- జీ ఓబులేశు, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,  కడప

మూడున్నరేళ్లలో కడప జిల్లాకు రూ.13 వేల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు ప్రకటించిన సీఎం... ఇప్పటికీ రూ.1,000 నుంచి రూ.1,500 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. గాలేరు నగరి రెండో దశ పనుల్లో ఏ ఒక్క దానికీ నిధులు వ్యయం చేయలేదు. ఇసుక తవ్వకాలతో అన్నమయ్య ప్రాజెక్టు వరదల్లో కొట్టుకుపోయింది. బాధితులకూ న్యాయం చేయలేదు. ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ, మెగా టెక్స్‌ టైల్‌ హబ్‌ అతీ గతీ లేదు. మూడు వేల మందికి ఉపాధి కోసం రూ.12వేల కోట్లతో ప్రతిపాదించిన డిక్షన్‌ కంపెనీ క్లస్టర్‌ యూనిట్‌లోనూ అంతా శూన్యమే. కడప పట్టణంలో భూగర్భ డ్రైనేజీ స్కీం నత్తనడకన సాగుతోంది. కడప ఉక్కు.... రాయలసీమ హక్కు అన్నా... ఏమీ చేయలేదు. రాయలసీమలో పారిశ్రామిక, వ్యవసాయ, చేనేత రంగాలను అభివృద్ధి చేయాలి.


సాగునీరు వృథా, పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదు
- డా. ఏ.చంద్రశేఖర్‌, మానవహక్కుల వేదిక, అనంతపురం

కియా లాంటి అంతర్జాతీయ సంస్థ ఏర్పాటైనా అనుబంధ పరిశ్రమలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. బెదిరింపులు, కమీషన్లతో పరిశ్రమలన్నీ వెళ్లి పోయే పరిస్థితి వస్తోంది. రాప్తాడులో జాకీ పరిశ్రమ కోసం 2018లో భూములు కేటాయించి ప్రారంభ కార్యక్రమాలు చేసినా.. ఉన్నట్టుండి అది వెళ్లిపోయింది. లేపాక్షి హబ్‌ కోసం 9 వేల ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నా ఒక్క పరిశ్రమ రాకపోవడంతో అవి బీడుపడ్డాయి. హెచ్‌ఎల్‌సీ కెనాల్‌కు లైనింగ్‌ చేయక ఎన్నో ఏళ్లుగా గండి పడి వచ్చిన నీరంతా వృథా అవుతోంది. హైకోర్టును అమరావతి నుంచి మార్చే ఉద్దేశం లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో చెప్పినా... రాయలసీమలో హైకోర్టు అంటూ గర్జనలు చేయడమేంటి? మరో మారు రాయలసీమను మోసం చేసే ప్రయత్నం జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని