శ్రీవారిని దర్శించుకున్న లోకేశ్‌

తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తన యువగళం పాదయాత్రకు ముందు శ్రీవారి ఆశీస్సులు అందుకున్నారు.

Published : 27 Jan 2023 04:16 IST

తరలివచ్చిన తెదేపా నాయకులు, కార్యకర్తలు

తిరుమల, న్యూస్‌టుడే: తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తన యువగళం పాదయాత్రకు ముందు శ్రీవారి ఆశీస్సులు అందుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో తెదేపా నాయకులతో కలిసి స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించగా తితిదే అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల ఆయనను కలిసేందుకు నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకుని పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలు కప్పి, శ్రీవారి జ్ఞాపికలు, చిత్రపటాలను అందజేశారు. సెల్ఫీలు, ఫొటోలు తీసుకున్నారు. దీంతో ఆలయం నుంచి కారువద్దకు చేరుకునేందుకు 20 నిమిషాలకుపైగా సమయం పట్టింది. ఆయనతోపాటు తెదేపా సీనియర్‌ నాయకులు చినరాజప్ప, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఏలూరి సాంబశివరావు, బీద రవిచంద్ర యాదవ్‌, అనగాని సత్యప్రసాద్‌, చినబాబు, ఎం.ఎస్‌.రాజు, నరేంద్ర, అనిత, చల్లా బాబు, శంకర్‌ యాదవ్‌, దొరబాబు, కాలవ శ్రీనివాసులు, బ్రహ్మం చౌదరి, సుగుణమ్మ, నరసింహ యాదవ్‌ తదితరులున్నారు.

తప్పని నిరీక్షణ

శ్రీవారి దర్శనార్థం వచ్చిన లోకేశ్‌.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, గ్యాలరీల్లో గంటకుపైగా నిరీక్షించాల్సి వచ్చింది. వీవీఐపీలకు కేటాయించే ప్రొటోకాల్‌ దర్శనాన్ని తితిదే లోకేశ్‌కు కేటాయించింది. అయితే అదే కేటగిరీలో వచ్చిన వైకాపా నేత బైౖరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి, ఇతరులు ముందుగానే శ్రీవారిని దర్శించుకున్నారు. మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్సీ హోదాలో ఉన్న లోకేశ్‌.. శ్రీవారి దర్శనానికి నిరీక్షించాల్సి రావడంపై తెదేపా నాయకులు మండిపడ్డారు. ‘లోకేశ్‌కు ఉదయం 6.45 గంటలకు దర్శన సమయాన్ని కేటాయించిన తితిదే.. గంటకుపైగా గ్యాలరీల్లో, క్యూలైన్లలో ఆపేసింది. అనంతరం శ్రీవారిని దర్శించుకుని 8.45కి ఆయన ఆలయం వెలుపలకు వచ్చారు. ఎవరెన్ని చేసినా లోకేశ్‌ పాదయాత్ర విజయవంతంగా కొనసాగి రాష్ట్రంలో తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది’ అని ఎమ్మెల్సీ బీటెక్‌ రవి పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు