కిట్లు కొన్నారు.. కోట్లు తిన్నారు!
విద్యా కానుక కిట్ల కొనుగోళ్లలో అనేక అవకతవకలు బయటపడుతున్నాయి. ఇప్పటికే బ్యాగ్‌లు, బూట్ల నాణ్యత సరిగా లేదని విజిలెన్స్, ఎన్‌ఫోర్సుమెంట్ తనిఖీల్లో బయటపడగా.. ఇప్పుడు కొనుగోళ్లలోనూ లోపాలు వెలుగు చూస్తున్నాయి.
విద్యాకానుకలో రూ.162 కోట్లు వృథా!
విద్యార్థుల సంఖ్య కంటే అధికంగా కొనుగోళ్లు
రెండేళ్లల్లో నిరుపయోగంగా 8.50 లక్షల కిట్లు
ఇప్పుడున్న విద్యార్థులు 40 లక్షలు
వచ్చే ఏడాదికి 43 లక్షల కొనుగోళ్లు
ఈనాడు, అమరావతి: విద్యా కానుక కిట్ల కొనుగోళ్లలో అనేక అవకతవకలు బయటపడుతున్నాయి. ఇప్పటికే బ్యాగ్‌లు, బూట్ల నాణ్యత సరిగా లేదని విజిలెన్స్, ఎన్‌ఫోర్సుమెంట్ తనిఖీల్లో బయటపడగా.. ఇప్పుడు కొనుగోళ్లలోనూ లోపాలు వెలుగు చూస్తున్నాయి. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ఏటా ఎక్కువ మొత్తం కొని వాటిని మూలనపడేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరుగుతుందంటూ ఐదు శాతం అధికంగా కిట్లు కొనుగోలు చేస్తుండగా.. మరోపక్క ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య దారుణంగా పడిపోతోంది. దీంతో కిట్లు భారీగా మిగిలిపోతున్నాయి. విద్యార్థులకు సరఫరా చేసిన తర్వాత కనీసం ఎన్ని కిట్లు మిగిలాయి? వాటిని వచ్చే ఏడాది పిల్లలకు ఇవ్వాలా? లేదంటే గుత్తేదారుకు వెనక్కి ఇచ్చేయాలా? అనేదాన్ని పట్టించుకోవడం లేదు. గుత్తేదార్లు సరఫరా చేసినట్లు ధ్రువపత్రాలు ఇవ్వగానే బిల్లులు చెలించేస్తున్నారే తప్ప మిగిలిపోయిన వాటి గురించి ఆలోచించడం లేదు. గుత్తేదార్ల నుంచి మామూళ్ల కోసమే కొందరు అధికారులు ఇలా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమగ్ర శిక్ష అభియాన్‌లో విద్యాకానుక టెండర్లు, సరఫరా అంటేనే కాసులు కురిపించే విభాగంగా మారిపోయింది. గతేడాది కొన్న కిట్లు జిల్లాల్లో ఏడు లక్షలకు పైగా ఉండగా.. ఇప్పుడు మళ్లీ మూడు లక్షలు ఎక్కువ కొనడానికి టెండర్లు నిర్వహిస్తున్నారు.
విద్యార్థుల సంఖ్య పెరుగుతుందనే అంచనాతో కొంటున్న అధికారులు.. మిగిలిన వాటిని ఆ తర్వాత ఏడాది వినియోగిస్తే ప్రజాధనం ఆదా అవుతుంది. కానీ, మళ్లీ కొత్త అంచనాలతో కొనేస్తున్నారు. గత రెండేళ్లల్లో ఇలా 8.50 లక్షల కిట్లు మిగిలిపోయాయి. ఈ ఏడాది మరో మూడు లక్షలు పెంచి కొనడానికి టెండర్లు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బూట్లు, బెల్టుల టెండర్లు పూర్తికాగా.. యూనిఫామ్, బ్యాగ్‌ల టెండర్లు ప్రాసెస్‌లో ఉన్నాయి. గతేడాది ఒక్కో కిట్‌కు రూ. 1,726 వ్యయం చేయగా.. ఈ ఏడాది కిట్‌కు రూ. 1,960 ఖర్చు చేశారు. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా మిగిలిపోయిన కిట్ల విలువ రూ. 162 కోట్లకు పైగా ఉంది. ఈ ఏడాది 47.40 లక్షల కిట్లు కొనుగోలు చేయగా.. ప్రభుత్వ బడుల్లో అనూహ్యంగా 3.98 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. జిల్లాల్లో మిగిలిపోయిన వాటిని రాష్ట్ర స్థాయిలో పరిగణనలోకి తీసుకోవడం లేదు. పాఠశాలల పునఃప్రారంభ సమయంలో పంపిణీపై ఉన్నతాధికారులు హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత వస్తువులు మిగిలిపోయినా.. చెడిపోయినట్లు ఫిర్యాదు చేసినా స్పందన ఉండడం లేదు. గుత్తేదార్లకు బిల్లులు చెల్లించడం, ఆ తర్వాత ఏడాది కొనుగోలుకు టెండర్లు నిర్వహణ ప్రక్రియపైనే దృష్టిపెడుతున్నారు.
ఏం చేయాలి?
ఈ ఏడాది అందించిన బ్యాగ్‌లు నాణ్యత లోపంతో ఉన్నాయి. పిల్లలకు ఇచ్చిన 15 రోజులకే చినిగిపోయాయి. బ్యాగ్‌ల సైజులు చిన్నగా ఉన్నాయి. మరోపక్క బూట్లు పాడైపోతున్నాయి. చాలాచోట్ల చినిగిపోయిన బ్యాగ్‌లు, బూట్లను పిల్లలకు వెనక్కి ఇచ్చారు. వీటి స్థానంలో కొత్తవి ఇవ్వలేదు. మూడు జతల కింద విద్యార్థులకు ఇచ్చిన యూనిఫామ్ వస్త్రం కుట్టించుకుంటే రెండు జతలకే సరిపోయింది. వస్త్రం తక్కువగా ఇచ్చారు. డిసెంబరు 30న విజిలెన్స్, ఎన్‌ఫోర్సుమెంట్ విభాగం తనిఖీల్లోనూ ఇవి బహిర్గతమయ్యాయి. వచ్చే ఏడాది సిలబస్‌ను మారుస్తున్నందున పాత పాఠ్యపుస్తకాలు వినియోగించుకోలేని దుస్థితి. ఇలాంటి కిట్లు 7.09 లక్షలు మిగిలాయి. కనీసం వీటిని ఏం చేయాలనే దానిపైనా అధికారులకు స్పష్టత లేకుండాపోయింది. ఏడాది పాటు మూలనపడేసి, వచ్చే సంవత్సరం పిల్లలకు ఇస్తే బ్యాగ్‌లు, బూట్లు మరింత తొందరగా చినిగిపోయే అవకాశం ఉంటుంది. 2021లో ఇచ్చిన వాటిల్లో 1.41 లక్షల కిట్లు వృథాగా ఉన్నాయి. రెండేళ్ల తర్వాత వీటిని పంపిణీ చేస్తే ఉపయోగపడతాయా? అనేదానిపైనా అనుమానాలున్నాయి.
కిట్‌లో ఇచ్చే వస్తువులు
జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూల్ బ్యాగ్, మూడు జతల యూనిఫామ్ క్లాత్, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్‌లు, ఆంగ్ల నిఘంటువు..
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Ukraine: రష్యాలో జిన్‌పింగ్.. ఉక్రెయిన్‌లో ప్రత్యక్షమైన జపాన్ ప్రధాని
-
India News
Earthquake: దిల్లీలో పాటు పలు రాష్ట్రాల్లో భూప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన ప్రజలు
-
Sports News
UPW vs DCW: యూపీని చిత్తు చేసి ఫైనల్స్‌కు దూసుకెళ్లిన దిల్లీ క్యాపిటల్స్
-
India News
Supreme Court: రద్దైన నోట్లపై కేంద్రాన్ని సంప్రదించండి.. పిటిషనర్లకు సుప్రీం సూచన
-
World News
Russia: ఐఫోన్లను పడేయండి.. అధికారులకు రష్యా అధ్యక్ష భవనం ఆదేశాలు
-
World News
Evergreen: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. బోనస్‌గా ఐదేళ్ల జీతం!