పేదలంటే ఎందుకంత కక్ష?

ప్రతి చిన్న విషయానికి ప్రజలు న్యాయస్థానాన్ని ఆశ్రయించే పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వమే కల్పిస్తోందని హైకోర్టు ఘాటుగా స్పందించింది.

Updated : 31 Jan 2023 10:06 IST

రూ.58 వేల బిల్లుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాలా?
రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు

ఈనాడు, అమరావతి: ప్రతి చిన్న విషయానికి ప్రజలు న్యాయస్థానాన్ని ఆశ్రయించే పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వమే కల్పిస్తోందని హైకోర్టు ఘాటుగా స్పందించింది. వైఎస్సార్‌ గ్రామీణ హౌజింగ్‌ పథకం కింద ఇళ్లు నిర్మించుకున్న వారికి బిల్లులు చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. రూ.58 వేల బిల్లుల కోసం లబ్ధిదారులైన పేద మహిళలను హైకోర్టును ఆశ్రయించే పరిస్థితి తీసుకొస్తారా అంటూ నిలదీసింది. పేదలంటే ప్రభుత్వానికి ఎందుకంత కక్ష అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఉద్యోగుల భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్న జీపీఎఫ్‌ సొమ్మును ఇతర అవసరాలకు మళ్లించడం ఏమిటని, ఈ విషయాన్ని పత్రికల్లో చూశానంది. ఉద్యోగుల జీపీఎఫ్‌ సొమ్ముపై ప్రభుత్వానికి హక్కు ఎక్కడిదని నిలదీసింది. విచారణను ఫిబ్రవరి 1కి వాయిదా వేసింది. పిటిషనర్లకు సకాలంలో బిల్లులు ఎందుకు చెల్లించలేదో వివరాలతో అఫిడవిట్‌ వేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించింది. వివరాలు సంతృప్తిగా లేకపోతే అధికారుల హాజరుకు ఆదేశిస్తామని హెచ్చరించింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ సోమవారం ఆదేశాలిచ్చారు. వైఎస్సార్‌ గ్రామీణ హౌజింగ్‌ పథకం కింద ఇళ్లు నిర్మించుకున్న తమకు కొంత సొమ్ము చెల్లించగా... మిగిలిన రూ.58 వేలను అధికారులు చెల్లించలేదని పేర్కొంటూ ఏలూరుకు చెందిన ఆర్‌.శాంతిసుధాదేవి, మరొకరు హైకోర్టులో వ్యాజ్యంవేశారు. సోమవారం జరిగిన విచారణలో రూ.58 వేల కోసం పేద మహిళలు హైకోర్టును ఆశ్రయించే పరిస్థితిని ప్రభుత్వం కల్పించడంపై న్యాయమూర్తి ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్టీఆర్‌ హౌజింగ్‌ పథకం పేరును వైఎస్సార్‌ హౌజింగ్‌ పథకంగా మార్చిన ప్రభుత్వం... పేదలకు సకాలంలో ఎందుకు బిల్లులు చెల్లించడం లేదని ప్రశ్నించారు.

విచారణకు రాయలసీమ వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌ హాజరు

కోర్టు ధిక్కరణ కేసులో కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆనందరావు, రిజిస్ట్రార్‌ మధుసూదనవర్మ సోమవారం హైకోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. పిటిషనర్లకు పీజీలో ప్రవేశం కల్పించినట్లు కోర్టుకు విన్నవించారు. దీంతో ధిక్కరణ పిటిషన్‌పై విచారణను మూసి వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ప్రకటించారు. పీజీలో పిటిషనర్లకు ప్రవేశం కల్పించాలని గతేడాది అక్టోబరులో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సకాలంలో అమలు చేయలేదని పేర్కొంటూ కర్నూలు జిల్లాకు చెందిన బి.శ్రీరాములు మరొకరు కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. గత ఆదేశాల మేరకు వీసీ, రిజిస్ట్రార్‌ ఇద్దరూ సోమవారం కోర్టుకు వచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని