సంక్షిప్త వార్తలు (11)

కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యా సంస్థ సొసైటీ(ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) అప్పటి కార్యదర్శి, కల్నల్‌ వి.రాములు(ఐపీఓఎస్‌)కు హైకోర్టు నాలుగు వారాల సాధారణ జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధించింది.

Updated : 03 Feb 2023 06:10 IST

కోర్టుధిక్కరణ కేసులో.. కల్నల్‌ రాములుకు జైలుశిక్ష
తీర్పు అమలు రెండు వారాలు నిలుపుదల

ఈనాడు, అమరావతి: కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యా సంస్థ సొసైటీ(ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) అప్పటి కార్యదర్శి, కల్నల్‌ వి.రాములు(ఐపీఓఎస్‌)కు హైకోర్టు నాలుగు వారాల సాధారణ జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధించింది. జరిమానా చెల్లింపులో విఫలమైతే మరో వారం రోజులు జైలు శిక్ష అనుభవించాలని స్పష్టంచేసింది. అయితే రాములు తరఫు న్యాయవాది అభ్యర్థన మేరకు తీర్పు అమలును రెండు వారాలు నిలుపుదల చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ గురువారం ఈ మేరకు తీర్పు ఇచ్చారు. తన పేరును ‘ప్రిన్సిపల్‌ గ్రేడ్‌-2’ పోస్టుకు పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ కడప జిల్లాకు చెందిన ట్రైన్డ్‌ గ్యాడ్యుయేట్‌ టీచర్‌ బి.రాజశేఖర్‌ 2020లో హైకోర్టును ఆశ్రయించారు.


15 వరకు శివ మాలధారులకు ఉచిత స్పర్శ దర్శనం

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 11 నుంచి 21వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో ఎస్‌.లవన్న తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఈనెల 11 నుంచి 15 వరకు నిర్దిష్ట రోజుల్లో జ్యోతిర్ముడి ధరించిన శివ మాలధారులకు ఉచితంగా మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం కల్పిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం వేళల్లో ఇతర భక్తులతో పాటు శివ దీక్షలో ఉన్న భక్తులకు ఉచిత స్పర్శ దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు.


ముఖ గుర్తింపు హాజరు రద్దు చేయాలి
ఏపీ మున్సిపల్‌ కార్మికులు, ఉద్యోగుల సమాఖ్య డిమాండ్‌

ఈనాడు, అమరావతి: పుర, నగరపాలక సంస్థల్లోని పారిశుద్ధ్య, ఇంజినీరింగ్‌ విభాగాల కార్మికులకు ముఖ గుర్తింపు ఆధారిత హాజరు విధానాన్ని రద్దు చేయాలని ఏపీ మున్సిపల్‌ కార్మికులు, ఉద్యోగుల సమాఖ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.నాగభూషణం, కె.ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం గురువారం రాష్ట్ర పురపాలకశాఖ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందించింది. ‘కార్మికుల్లో అత్యధికుల వద్ద స్మార్ట్‌ ఫోన్లు లేవు. అయినప్పటికీ హాజరుకు సంబంధించిన యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. లేదంటే జీతాలు నిలిచిపోవడంతోపాటు ఉద్యోగాలు కోల్పోతారని అధికారులు బెదిరించడంతో కార్మికులు భయాందోళనలకు గురవుతున్నారు. అని వినతిపత్రంలో సమాఖ్య నేతలు పేర్కొన్నారు.


కర్ణాటక-ఏపీ ఆర్టీసీల ఒప్పందం

ఈనాడు, అమరావతి: ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు కర్ణాటకలో నిత్యం 2.34 లక్షల కి.మీ. తిరిగేలా ఒప్పందం కుదిరింది. కర్ణాటక బస్సులు మన రాష్ట్రంలో నిత్యం 2.26 లక్షల కి.మీ. తిరగనున్నాయి. ఈ మేరకు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ సీహెచ్‌.ద్వారకా తిరుమలరావు, కేఎస్‌ఆర్టీసీ ఎండీ వి.అంబుకుమార్‌ గురువారం విజయవాడలో ఒప్పందంపై సంతకాలు చేశారు.


ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ విగ్రహం ప్రారంభిస్తాం
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి

విజయవాడ(సూర్యారావుపేట), న్యూస్‌టుడే: విజయవాడ స్వరాజ్య మైదానంలో చేపట్టిన అంబేడ్కర్‌ స్మృతివనం నిర్మాణ పనులను ఏప్రిల్‌ 14కు పూర్తి చేసి, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి తెలిపారు. అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణ పనులను గురువారం ఆమె పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, కింది భాగంలో ఏర్పాటు చేసే దిమ్మెతో కలిపి 206 అడుగులు అవుతుందని తెలిపారు. దీని కోసం రూ.268 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. ఈ నెల 15వ తేదీ కల్లా విగ్రహ భాగాలు వస్తాయని, రాజస్థాన్‌ నుంచి గులాబీ రంగు రాయిని తీసుకొస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ వైస్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.సృజన, విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌, ఇతర ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.


మద్యం దుకాణాల్లో డిజిటల్‌ చెల్లింపులకు అవకాశం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఇకపై డిజిటల్‌ చెల్లింపులకూ అవకాశం కల్పిస్తున్నట్లు ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత ఎంపిక చేసిన దుకాణాల్లో దీన్ని ప్రారంభిస్తామన్నారు. మద్యం కొన్నవారు.. ఫోన్‌ పే, గూగుల్‌ పే, యూపీఐ, క్యూఆర్‌ కోడ్‌ ద్వారానూ చెల్లింపులు చేయొచ్చని వివరించారు.


విద్యార్థినుల అస్వస్థతపై పూర్తిస్థాయి విచారణ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయ బాలికలు అస్వస్థతకు గురైన ఘటనపై కలెక్టర్‌ నేతృత్వంలో పూర్తిస్థాయి విచారణ జరుగుతోందని గురుకులాల కార్యదర్శి పవనమూర్తి తెలిపారు. ‘ఈనాడు’లో ఈనెల 1న ‘మురుగు నీటి వల్లే విద్యార్థినులకు అస్వస్థత’ శీర్షికన ప్రచురితమైన వార్తపై వివరణ ఇచ్చారు. ‘53 మంది విద్యార్థినులు జ్వరం, వాంతులతో బాధపడుతున్నట్లు సమాచారం అందింది. వారికి చికిత్సను అందించడంతో కోలుకున్నారు. గురుకులంలో ఆర్వో ప్లాంటు మంచి కండిషన్‌లో ఉంది. విచారణ ప్రాథమిక నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకున్నాం’ అని పేర్కొన్నారు.


వివరణ

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. దీనిపై ‘ఈనాడు’లో ‘ట్యాపింగ్‌ నిజం’ శీర్షికతో గురువారం వార్త ప్రచురితమైంది. అందులో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ సీతారామాంజనేయులు తనకు ఆడియో క్లిప్‌ పంపిన నంబరు ఇది అంటూ చెప్పింది పొరపాటున తప్పుగా ప్రచురితమైంది. 98499 66000కి బదులు.. 98499 96600 ప్రచురితమైంది. ముందు నంబరును పరిగణనలోకి తీసుకోగలరు.


‘ఫ్యామిలీ ఫిజిషియన్‌ కాన్సెప్ట్‌’ అమలుకు చర్యలు తీసుకోవాలి
మంత్రి విడదల రజిని

ఈనాడు, అమరావతి: ఫ్యామిలీ ఫిజిషియన్‌ కాన్సెప్ట్‌ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అధికారులను ఆదేశించారు. ఈ పథకం అమలుపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పథకం అమలుకు తగ్గట్లు ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణాలు త్వరలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాటిలో ఉద్యోగ ఖాళీలను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలన్నారు. అదనంగా కొన్న అంబులెన్సుల్లో మందులు, పరికరాలు సమకూర్చాలని సూచించారు. ఈ పథకంతో అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలకూ పరీక్షలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ నివాస్‌, ఆరోగ్యశ్రీ సీఈఓ హరేంధిరప్రసాద్‌, రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీ మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు.


ముస్లింలకు ప్రత్యేకంగా ఒక్క పథకమైనా అమలు చేశారా?
మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్‌ షిబ్లీ మండిపాటు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ముస్లింలందరూ వైకాపా వెంటే ఉన్నారని ప్రజల్లో భ్రమలు కలిగించే ఎత్తుగడకు ఆ పార్టీ నేతలు తెరలేపారని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్‌ షిబ్లీ మండిపడ్డారు. ముస్లింలకు ఉన్న పథకాలన్నీ రద్దు చేసి, తమ వెంటే ఉన్నారని అధికారపార్టీ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. విజయవాడలో గురువారం ఫారూఖ్‌ షిబ్లీ విలేకరులతో మాట్లాడారు. ‘ముస్లింలు ఎందుకు వైకాపా వెంట నడవాలి? అధికారం చేపట్టి మూడున్నరేళ్లు దాటినా వారికి ప్రత్యేకంగా ఒక్క పథకాన్నీ అమలు చేయనందుకా? ఉన్న పథకాల్ని రద్దు చేసినందుకా? పేద ముస్లింలకు ఆదరువుగా ఉన్న దుల్హన్‌ పథకాన్ని తీసేశారు. ఉన్నత విద్య చదవకుండా విదేశీ విద్యా పథకాన్ని నిలిపేశారు. రంజాన్‌ తోఫాను ఆపేశారు. వక్ఫ్‌ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోవడం లేదు. ఇస్లామిక్‌ బ్యాంకు ఏర్పాటు చేసి రుణాలిస్తామని చెప్పి మాట తప్పారు. మైనారిటీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారు. ముస్లింల ఆత్మగౌరవాన్ని తుంగలో తొక్కారు’ అని ధ్వజమెత్తారు.


వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పించాలని సర్పంచుల వినతి

ఈనాడు, అమరావతి: ఏడాదికోసారి కుటుంబసభ్యులతో తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పించాలని సర్పంచులు ప్రభుత్వానికి విన్నవించారు. తమ సమస్యలపై ప్రభుత్వ పెద్దలకు ఇచ్చిన వినతుల్లోని మొత్తం 13 డిమాండ్లలో దర్శనం అంశాన్ని కూడా చేర్చడం విశేషం. వైకాపా మద్దతుదారులైన పలువురు సర్పంచులతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో తమకు గ్రామాల్లో గౌరవం లేకుండా పోతోందని, ఆర్థిక సంఘం నిధులు పంచాయతీల ఖాతాలకు జమ చేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని, చేసిన పనులకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో సమస్యలను ఎదుర్కొంటున్నామని పలువురు సర్పంచులు ప్రస్తావించారని తెలిసింది. ‘15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీల పేరుతో తెరిచిన బ్యాంకు ఖాతాల్లో వేయాలి. పంచాయతీల్లోని గ్రీన్‌ అంబాసిడర్లకు ప్రభుత్వమే జీతాలు చెల్లించాలి.తాగునీటి సరఫరా, వీధి దీపాలకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేయాలి. విధి నిర్వహణలో మృతి చెందే సర్పంచి కుటుంబాలకు రూ.20 లక్షల వరకు ప్రమాద బీమా సదుపాయం ప్రభుత్వమే కల్పించాలి. గడప గడపకు మన ప్రభుత్వంలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున కేటాయించాలి’ వంటి డిమాండ్లను సర్పంచులు ప్రభుత్వం ముందుంచారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు