గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియాపై బదిలీ వేటు

రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రామ్‌ ప్రకాష్‌ సిసోడియాపై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.

Published : 04 Feb 2023 04:16 IST

ఉద్యోగులకు అపాయింట్‌మెంట్‌ ఇప్పించడమే కారణం?
ఆయన స్థానంలో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ నియామకం

ఈనాడు, అమరావతి: రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రామ్‌ ప్రకాష్‌ సిసోడియాపై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయనకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వకుండా, సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. ఆయన స్థానంలో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను నియమించింది. ప్రతి నెలా వేతనాలు చెల్లించడంలో జాప్యం జరుగుతుండటంతో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఆ సంఘ ప్రతినిధులు ఇటీవల గవర్నర్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. సకాలంలో జీతభత్యాలు, ఆర్థిక ప్రయోజనాలు చెల్లించేలా ప్రత్యేక చట్టం తేవాలని విజ్ఞప్తి చేశారు. జీతాల కోసం ఉద్యోగ సంఘం నేతలు గవర్నర్‌ను కలవడం చర్చనీయాంశమైంది. ఆ పరిణామంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సూర్యనారాయణకు షోకాజ్‌ నోటీసు ఇచ్చింది. వారు గవర్నర్‌ను కలిసేందుకు దోహదపడ్డారన్న కారణంతో సిసోడియా పైనా గుర్రుగా ఉన్న ప్రభుత్వం ఆయనపై బదిలీ వేటు వేసింది. పోస్టింగ్‌ కూడా ఇవ్వకపోవడానికి అదే కారణమని అధికారవర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను బదిలీ చేయడంతో.. దేవాదాయశాఖ కమిషనర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌కు ఆ శాఖ ముఖ్యకార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని