ప్రత్యేక హోదా సాధించే వరకూ పోరాటమే

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేరే వరకు తమ పోరాటం కొనసాగుతుందని.. ఇది అంతం కాదు ఆరంభమని ‘యువజన, విద్యార్థి సంఘాల సమర యాత్ర’ సారథి చలసాని శ్రీనివాస్‌ అన్నారు.

Published : 05 Feb 2023 04:54 IST

చలసాని శ్రీనివాస్‌ స్పష్టీకరణ
ఇచ్ఛాపురంలో ముగిసిన ‘సమర యాత్ర’

ఇచ్ఛాపురం, శ్రీకాకుళం(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేరే వరకు తమ పోరాటం కొనసాగుతుందని.. ఇది అంతం కాదు ఆరంభమని ‘యువజన, విద్యార్థి సంఘాల సమర యాత్ర’ సారథి చలసాని శ్రీనివాస్‌ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో శనివారం ఈ యాత్రను ముగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూపురంలో గతనెల 23న ప్రారంభించిన ఈ బస్సు యాత్ర రాష్ట్రంలోని అన్ని జిల్లాల మీదుగా సాగించామని, యువజన సంఘాలు, విద్యార్థులు, విపక్ష పార్టీలు, మేధావి వర్గాలు, మహిళలు ఎంతో ఆదరించారని, వారి ప్రోత్సాహంతో ఉద్యమానికి మరింత ఉత్సాహం వచ్చిందని చెప్పారు. ప్రజా డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆగదన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు, యువతతో కలిసి పాదయాత్ర చేశారు. సీపీఐ, సీపీఎం, సీఐటీయూ, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు సమర యాత్ర బహిరంగ సభను శ్రీకాకుళం నగరంలోని అంబేడ్కర్‌ ఆడిటోరియం సమీపంలో నిర్వహించేందుకు నేతలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కనీసం స్టేజీ, మైక్‌లు, షామియానాలు వేయనీయకపోవడంతో నేతలంతా మండిపడ్డారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు హైకోర్టు అనుమతితో యాత్ర నిర్వహిస్తున్నా అడ్డుకోవడం సరికాదంటూ నిరసన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని