మూడేళ్లలో 1,987 ఉద్యోగ విరమణలు... 106 నియామకాలు

విశాఖ ఉక్కు కర్మాగారంలో గత మూడేళ్లలో 1,987 మంది ఉద్యోగ విరమణ చేయగా 106 మందిని కొత్తగా నియమించినట్లు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్‌సింగ్‌ కులస్థే తెలిపారు.

Updated : 07 Feb 2023 06:00 IST

విశాఖ ఉక్కులో కొత్త నియామకాలపై హేతుబద్ధీకరణ

ఈనాడు, దిల్లీ: విశాఖ ఉక్కు కర్మాగారంలో గత మూడేళ్లలో 1,987 మంది ఉద్యోగ విరమణ చేయగా 106 మందిని కొత్తగా నియమించినట్లు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్‌సింగ్‌ కులస్థే తెలిపారు. ఈ సంస్థలో ఉద్యోగాల భర్తీపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని, కంపెనీ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నియామకాలను హేతుబద్ధీకరించామన్నారు. రెండేళ్లలో 237 మంది రాజీనామా చేశారన్నారు. సోమవారం రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఈ ఏడాది జనవరి నాటికి ఈ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌ (4,875), నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ (10,005) కలిపి 14,880 మంది పని చేస్తున్నారని చెప్పారు. రానున్న మూడేళ్లలో ఎగ్జిక్యూటివ్‌ (1,170), నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ (2,039) కలిపి 3,209 మంది (21.56%) ఉద్యోగ విరమణ చేస్తారని వెల్లడించారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌ కొన్ని అప్రధాన్య (నాన్‌కోర్‌) కార్యకలాపాలను ఔట్‌సోర్స్‌ చేసిందని, కంపెనీ నిర్వహణ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్య కార్యకలాపాల్లో ఉన్న ఉద్యోగులను వివిధచోట్లకు సర్దుబాటు చేసిందన్నారు.

ఐపీఓ ద్వారా నిధుల సమీకరణ ఉద్దేశం లేదు: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని స్టీల్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియాలోనో, జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థలోనో విలీనం చేయాలని కోరుతూ రాజకీయపార్టీలు, వివిధ వర్గాల నుంచి తమకు వినతులు అందాయని కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి ఫగన్‌సింగ్‌ తెలిపారు. సోమవారం రాజ్యసభలో వైకాపా సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఈ సంస్థకు నిధుల సమీకరణ కోసం ఐపీఓకు వెళ్లే ఉద్దేశమేమీ లేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని