పింఛను అందక.. ఆగిన గుండె!

ఆపేసిన పింఛను పునరుద్ధరించాలని కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఓ ఒంటరి మహిళ..తీవ్ర భావోద్వేగానికి గురై మృతిచెందిన విషాద ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గంలో చోటుచేసుకుంది.

Published : 08 Feb 2023 04:35 IST

రాయదుర్గం పట్టణం, న్యూస్‌టుడే: ఆపేసిన పింఛను పునరుద్ధరించాలని కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఓ ఒంటరి మహిళ..తీవ్ర భావోద్వేగానికి గురై మృతిచెందిన విషాద ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గంలో చోటుచేసుకుంది. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని రాజీవ్‌గాంధీకాలనీ ఇండేన్‌ గ్యాస్‌ గోదాము వెనుక నాగరాజు, పాలమ్మ(43) దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. వారికి సంతానం లేరు. నాగరాజు నాలుగేళ్ల కిందట మృతి చెందారు. పాలమ్మకు వితంతు పింఛను అందుతుండేది. ఏడు నెలలుగా దాన్ని ఆపేశారు. రేషన్‌కార్డులో భర్తపేరు తొలగించని కారణంగా నిలిపేశామని అధికారులు చెప్పడంతో పలుసార్లు కార్యాలయాల చుట్టూ ఆమె తిరిగారు. సరైన సమాధానం ఇవ్వకపోవడంతో బావ సిద్ధప్పతో కలిసి సోమవారం అనంతపురం కలెక్టరేట్‌లో ‘స్పందన’లోనూ ఫిర్యాదు చేశారు. మున్సిపల్‌ కార్యాలయంలో సంప్రదించాలని జిల్లా ఉన్నతాధికారులు సూచించడంతో మంగళవారం ఉదయం అక్కడికి వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలో ఇప్పుడైనా పని అవుతుందో లేదోనని బంధువులు, ఇరుగుపొరుగు వారితో చర్చిస్తూ విచారం వ్యక్తంచేసిన పాలమ్మ హఠాత్తుగా కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పింఛను సకాలంలో పునరుద్ధరించి ఉంటే ప్రాణాలు దక్కేవని మృతురాలి అక్క సరస్వతి, బావ సిద్ధప్ప ఆవేదన వ్యక్తం చేశారు. భర్త మరణ ధ్రువీకరణపత్రం ఇవ్వకపోవడంతోనే పాలమ్మ పింఛను పునరుద్ధరించలేదని రాయదుర్గం మున్సిపల్‌ కమిషనర్‌ దివాకర్‌రెడ్డి తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని