Amaravati: అమరావతిపై కుట్రలు మానుకోవాలి

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతేనని పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసినా వైకాపా ప్రభుత్వం పదేపదే వక్రభాష్యాలు చెబుతోందని న్యాయవాదులు, నిపుణులు, రైతులు మండిపడ్డారు.

Updated : 09 Feb 2023 08:38 IST

సుప్రీం కోర్టులో విచారణలో ఉండగా.. ముఖ్యమంత్రి ఎలా ప్రకటన చేస్తారు?
కేరళ అనుభవం.. పాఠం కావాలి
ఈటీవీ-ప్రతిధ్వని’ చర్చలో వక్తలు
ఈనాడు - అమరావతి

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతేనని పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసినా వైకాపా ప్రభుత్వం పదేపదే వక్రభాష్యాలు చెబుతోందని న్యాయవాదులు, నిపుణులు, రైతులు మండిపడ్డారు. ‘రాజధానుల విషయంలో కేరళలో ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా పరిశీలిస్తే రాజధానుల విభజన గురించి అధికార పార్టీ ఆలోచన చేయదు. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉంటే హైకోర్టు ఎర్నాకుళంలో ఉంది. ఇప్పుడు దాన్ని తిరువనంతపురానికి మార్చాలని ప్రయత్నిస్తున్నా ప్రైవేటు బిల్లుల కారణంగా ఇప్పటికీ సాధ్యం కావడం లేదు. పరిపాలన ఒకచోట, న్యాయవ్యవస్థ మరోచోట ఉన్నందున తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’ అని ఉదాహరించారు. అమరావతిని బలహీనపరిచే కుట్రలను రాష్ట్ర ప్రభుత్వం ఆపడం మంచిదని హితవు పలికారు. సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పటికీ సీఎం జగన్‌ రాష్ట్ర రాజధానిని విశాఖకు తరలిస్తున్నట్లు దిల్లీలో ప్రకటన చేసి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ‘ఒక్క అమరావతి.. అనేక కుట్రలు’ అనే అంశంపై బుధవారం ఈటీవీ-ఆంధ్రప్రదేశ్‌ నిర్వహించిన ప్రతిధ్వని చర్చలో పాల్గొన్న వక్తల అభిప్రాయాలివి..


అమరావతిని కాదంటే అందరికీ నష్టం

విభజన తర్వాత రాజధాని లేని పరిస్థితుల్లో రాష్ట్రాభివృద్ధిని కాంక్షించి, భావితరాల కోసం రైతులు త్యాగాలు చేశారు. అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చాం. అన్ని ప్రాంతాలకు సమదూరమైన ప్రదేశంలో రాజధాని ఉంటే మేలని విశ్వసించాం. మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నందున రైతులు, కూలీలపై 200కు పైగా కేసులు పెట్టారు. ఐదు వేల మందిని అనేక రోజులుగా కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. ఈ కేసులకు వీఆర్‌వోలు, పోలీసులే ఫిర్యాదుదారులు. వారికి ఇష్టమైన పేర్లు రాసుకుని కేసులు పెడుతున్నారు. అమరావతి ప్రాంతంలో ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. హైకోర్టుకు సమీపంలోనే రోడ్లను తవ్వేసినా, విలువైన సామగ్రిని కాజేస్తున్నా పట్టించుకోవడంలేదు. రాష్ట్ర ప్రజల ఆస్తిని దోచుకెళ్తుంటే నిర్లిప్తంగా ఉన్న అధికారుల తీరుపై కోర్టును ఆశ్రయిస్తాం. రాజధానిని రాజకీయంగా చూడడం ఘోరం. అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న అధికారపక్ష నేతలు తమ వ్యవహారాలను హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరుల్లో చక్కబెట్టుకుంటున్నారు. సుప్రీంకోర్టు నిర్ణయం లేకుండా అమరావతిని కదలించలేరని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసినా ప్రజల దృష్టి మళ్లించడానికే ప్రయత్నిస్తోంది.

 కిరణ్‌కుమార్‌, రాజధాని రైతు ఐకాస నాయకులు


సమర్థించిన వాళ్లే.. మాటా మార్చారు
- కందుల రమేశ్‌, ‘అమరావతి వాస్తవాలు- వివాదాలు’ రచయిత

విదేశాల్లో ఏ రాజకీయ నాయకుడైనా ఓ మాట చెప్పి దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఆ పదవిలో కొనసాగడానికి అర్హుడు కాదు. కానీ, ఏపీలో పచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలో కొనసాగుతున్న పరిస్థితులను చూస్తున్నాం. వైకాపా నాయకులు ఏ కారణంతో నాడు రాజధానిగా అమరావతిని సమర్థించారు, నేడు ఎందుకు వద్దంటున్నారో ప్రజలకు వివరణ ఇవ్వడం లేదు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌, నిర్మాణానికి అనువు కాదు, అసైన్‌మెంట్‌ భూముల్లో అక్రమాలంటూ అనేక ఆరోపణలు చేసినా దేన్నీ నిరూపించలేకపోయారు. అభివృద్ధి ఆలోచన లేకుండా రాజకీయ కోణంలో మూడు రాజధానులంటూ ప్రకటన చేశారు. రాజధానిని మారిస్తే కలిగే నష్టాన్ని ప్రజలెందుకు భరించాలి అనే ప్రశ్నకు సీఎం సహా ఎవరి వద్దా సమాధానం లేదు. అమరావతిపై ఈ ప్రభుత్వం చెప్పిన అబద్ధాలు పేర్చుకుంటే వెళ్తే ఒక గ్రంథమే అవుతుంది. పేరుకు మూడు రాజధానులంటున్నా వారి దృష్టి అంతా విశాఖపైనే. కర్నూలు గురించి ఒక్కమాటా మాట్లాడడం లేదు. దిల్లీలో ఇటీవల సీఎం మాట్లాడుతూ తాను విశాఖ వెళ్తున్నా, అదే రాజధాని అని అన్నారే తప్ప కార్యనిర్వాహక రాజధాని అనే మాట వాడలేదు. వికేంద్రీకరణ సిద్ధాంతం ప్రకారం మూడు రాజధానుల ప్రతిపాదన ఓ అబద్ధమే. దీనికి చట్టపరమైన పరిమితులున్నాయి. అయినా అదే చెబుతూ ప్రజలను ప్రాంతాల వారీగా విభజించాలని చూస్తున్నారు. అమరావతిపై హైకోర్టు డివిజన్‌ బెంచి ఇప్పటికే స్పష్టంగా తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉన్నప్పుడు విశాఖకు వెళ్తున్నామని సీఎం మాట్లాడడం కోర్టు ధిక్కరణే. కోర్టు పరిధిలోని అంశంపై తీర్పు వచ్చే వరకు రాజ్యాంగ పదవుల్లోని మంత్రులు బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు ఎలా చేస్తారు?


కేరళ కష్టాలు చూడండి
- సుంకర రాజేంద్రప్రసాద్‌, సీనియర్‌ న్యాయవాది

అధికారపక్ష నేతలు పదేపదే మూడు రాజధానుల గురించి మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అమరావతే రాజధానిగా హైకోర్టు తీర్పు అమల్లో ఉన్నందున ఇక్కడి నుంచి చీపురుపుల్లను కూడా కదిలించలేరు. రాజధాని మార్పు పేరుతో ఏం చేసినా అది కోర్టు ధిక్కరణే అవుతుంది. ప్రజల మధ్య వైషమ్యాలు, ప్రాంతాల మధ్య ఘర్షణలు పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. న్యాయస్థానాల తీర్పులను బేఖాతరు చేయడమే కాకుండా వాటికి దురుద్దేశాలు ఆపాదించడం రాజ్యాంగ వ్యవస్థకు మచ్చతెస్తుంది. రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వేసిన ప్రశ్నలు చూస్తే వారి మనస్తత్వం తెలుస్తుంది. ‘జుడీషియల్‌ ఓవర్‌రీచ్‌’ అనే పదం వాడితే రాజ్యసభ ఛైర్మన్‌ మందలించారు. తమకు అనుకూలంగా కేంద్రం నుంచి సమాధానం వస్తుందనుకుని భావించి వాళ్లు తీసిన గోతిలో వారే పడ్డారు. తొలి నుంచి న్యాయవ్యవస్థపై రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు. పౌరులను న్యాయస్థానం కాపాడకపోతే ఇప్పటికే రాష్ట్రంలో నియంతృత్వమే రాజ్యమేలేది. రాష్ట్రంలో అధికారులపై 11వేల కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయి. మూడు రాజధానుల ప్రకటన సాకారమై, విశాఖ నుంచి కర్నూలుకు అధికారులు తిరుగుతూ ఉంటే ప్రజల సొమ్ము ఎంత ఖర్చు అవుతుంది? చట్టప్రకారం రాజధానిని ఓసారి నిర్ణయించాక పదేపదే మార్చే వీల్లేదు. కేంద్రం స్పందన హైకోర్టు తీర్పును బలపరిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని