మధ్యాహ్నం 1.25 గంటలకు సభకొచ్చిన సీఎం

సీఎం జగన్‌ శనివారం ఉదయం 9.45 గంటలకు శాసనసభకు వచ్చినా.. మధ్యాహ్నం వరకు సభ లోపలకు రాలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని కలుస్తూ... తన ఛాంబర్‌లోనే గడిపారు.

Published : 19 Mar 2023 03:46 IST

ఈనాడు, అమరావతి: సీఎం జగన్‌ శనివారం ఉదయం 9.45 గంటలకు శాసనసభకు వచ్చినా.. మధ్యాహ్నం వరకు సభ లోపలకు రాలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని కలుస్తూ... తన ఛాంబర్‌లోనే గడిపారు. పెట్టుబడుల సదస్సుపై మరో పది నిమిషాల్లో లఘు చర్చ ప్రారంభమవుతుందనగా.. మధ్యాహ్నం 1.25 గంటలకు సభలోకి అడుగుపెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేల ప్రసంగాల తర్వాత చివరిగా జగన్‌ మాట్లాడతారని భావించారు. ఆయన ప్రసంగించకుండానే సభ వాయిదా పడింది. ఆదివారమూ పెట్టుబడుల సదస్సుపై చర్చ కొనసాగుతుందని సభాపతి తమ్మినేని సీతారాం ప్రకటించారు.


తెదేపా ఇచ్చిన కోత తీర్మానాల తిరస్కరణ

ఈనాడు, అమరావతి: రహదారులు, భవనాల శాఖ, జలవనరుల శాఖ పద్దులకు కేటాయింపులు తగ్గించాలని కోరుతూ తెదేపా సభ్యులు శనివారం ఇచ్చిన కోత తీర్మానాలను శాసనసభ తిరస్కరించింది. ఈ శాఖలకు సంబంధించిన పద్దుల్లో రూ.100 చొప్పున తగ్గించాలని తెదేపా ఎమ్మెల్యేలు తీర్మానాల్లో పేర్కొన్నారు. సంబంధిత ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడాన్ని నిరసిస్తూ కోత తీర్మానాలు అందించారు. రహదారులు, భవనాల శాఖకు కేటాయించిన బడ్జెట్‌ నుంచి... భీమవరం ప్రధాన రహదారికి మరమ్మతులు చేయనందుకు నిరసనగా రూ.100 తగ్గించాలని ఎమ్మెల్యే మంతెన రామరాజు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయనందుకు నిరసనగా నిధులు తగ్గించాలని నిమ్మకాయల చినరాజప్ప, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయనందుకు నిరసనగా నిధులు తగ్గించాలని గొట్టిపాటి రవికుమార్‌, వంశధార ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయనందుకు నిరసనగా నిధుల్లో కోత పెట్టాలని కె.అచ్చెన్నాయుడు, చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయనందుకు నిరసనగా కేటాయింపు తగ్గించాలని గద్దె రామ్మోహన్‌ కోత తీర్మానాలు ఇచ్చారు. వీటిని సభ తిరస్కరించినట్లు సభాపతి తమ్మినేని సీతారాం ప్రకటించారు.


పారా వెటర్నరీ, అనుబంధ కౌన్సిల్‌ బిల్లుకు సభ ఆమోదం

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పారా వెటర్నరీ, అనుబంధ కౌన్సిల్‌ ఏర్పాటుకు సంబంధించిన బిల్లుకు శాసనసభ శనివారం ఆమోదం తెలిపింది. పశుసంవర్థక, పాడి, మత్స్య పరిశ్రమల్లో డిప్లొమా కోర్సులకు సంబంధించిన శిక్షణ సంస్థల రిజిస్ట్రేషన్‌ కోసం ఈ బిల్లును రూపొందించినట్లు ఆ శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడించారు.

* మంగళూరు రిఫైనరీ, పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్‌ను చమురు సంస్థగా మార్చడానికి ఉద్దేశించిన బిల్లును శాసనసభ ఆమోదించింది.

* ఆంధ్రప్రదేశ్‌(ఆంధ్రప్రాంత) ఇనాముల(రద్దు, రైత్వారీలోని మార్పిడి) చట్టం-1956, ఆంధ్రప్రదేశ్‌ చుక్కల భూముల (పునర్‌ నిర్ధారణ రిజిస్టరు తేదీ వరకు సవరించుట) చట్టం-2017, ఆంధ్రప్రదేశ్‌ భూమి హక్కుల, పట్టాదారు పాసుపుస్తకాల చట్టం-1971 సవరణ బిల్లులను రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు శనివారం సభలో ప్రవేశ పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని