‘మార్గదర్శి’ కేసులో మేనేజర్లకు బెయిల్‌

మార్గదర్శి శాఖలకు చెందిన విజయవాడ, ఒంగోలు, చీరాల మేనేజర్లకు సోమవారం బెయిల్‌ మంజూరైంది.

Updated : 21 Mar 2023 06:52 IST

ఈనాడు, అమరావతి: మార్గదర్శి శాఖలకు చెందిన విజయవాడ, ఒంగోలు, చీరాల మేనేజర్లకు సోమవారం బెయిల్‌ మంజూరైంది. రాజమహేంద్రవరం, విశాఖలో విచారణ మంగళవారానికి వాయిదా పడింది. విజయవాడ లబ్బీపేట మార్గదర్శి బ్రాంచి మేనేజర్‌ బండారు శ్రీనివాసరావుకు బెయిల్‌ మంజూరు చేస్తూ విజయవాడ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి (ఎంఎస్‌జే) న్యాయస్థానం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అభియోగపత్రం దాఖలు చేసేంత వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 లోపు ఏదో ఒక సమయంలో ఎస్‌హెచ్‌వో ముందు ప్రతిరోజు హాజరు కావాలని షరతు విధించింది. న్యాయాధికారి ఆంజనేయమూర్తి ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. మేనేజరు తరఫున న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. ‘ప్రాథమిక ఆధారాలు లేకపోయినా తప్పుడు కేసు నమోదు చేసి సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మార్గదర్శి సొమ్ము చెల్లించలేదని ఏ ఒక్క సబ్‌స్క్రైబర్‌ నుంచి ఫిర్యాదు లేదు. ఈ నేపథ్యంలో చిట్‌ రిజిస్ట్రార్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చెల్లదు. మార్గదర్శిపై బలవంతపు చర్యలు వద్దని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు ఉల్లంఘించారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారి(ఐవో) ఇప్పటికే రిజిస్ట్రర్లు, దస్త్రాలను సీజ్‌ చేశారు. పిటిషనర్‌ను రిమాండ్‌లో ఉంచాల్సిన అవసరం లేదు. బెయిలు మంజూరు చేయాలి...’ అని కోరారు.

సాక్ష్యాలు తారుమారు ప్రశ్నే ఉత్పన్నం కాదు: న్యాయాధికారి ఆంజనేయమూర్తి

సీడీ ఫైల్‌ను పరిశీలిస్తే ఐవో.. దస్త్రాలను సీజ్‌ చేసినట్లు స్పష్టమవుతోందని, మేనేజరు స్టేట్‌మెంట్‌ను ఐవో రికార్డు చేశారని న్యాయాధికారి ఆంజనేయమూర్తి పేర్కొన్నారు. మార్గదర్శి బ్యాంకు ఖాతాల పరిశీలనకు ఐజీ స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ.. ఇప్పటికే ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ను నియమించిందని గుర్తు చేశారు. ‘దస్త్రాలను దర్యాప్తు సంస్థ సీజ్‌ చేసింది. బెయిలు మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్షులను ప్రభావితం చేసే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎందుకంటే సాక్ష్యాధారాలన్నీ దస్త్రాల రూపంలో చిట్‌ రిజిస్ట్రార్‌ వద్ద ఉన్నాయి...’ అని పేర్కొన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని బెయిలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడ అసిస్టెంట్‌ చిట్‌ రిజిస్ట్రార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 12న సీఐడీ పోలీసులు బ్రాంచి మేనేజరు శ్రీనివాసరావును అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. 

ఒంగోలు, చీరాలలో మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు

మార్గదర్శి కేసులో ఒంగోలు బ్రాంచి మేనేజర్‌ కరణం నాగేశ్వరరావు, పేయబుల్‌ మేనేజర్‌ అరెకొండ సాంబ శ్రీను, చీరాల బ్రాంచి మేనేజరు జి.సురేంద్ర, అకౌంటెంట్లు మద్దినేని కోటేశ్వరరావు, బుడితి శ్రీనివాసులుకు మధ్యంతర ముందస్తు బెయిల్‌ను ఒంగోలు ప్రిన్సిపల్‌ జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి ఎ.భారతి సోమవారం మంజూరు చేశారు. పిటిషనర్లను అరెస్ట్‌ చేయవద్దని సీఐడీని నిర్దేశించారు. పిటిషనర్లు దర్యాప్తునకు సహకరించడంతో పాటు విచారణకు పిలిచినప్పుడు హాజరు కావాలని, లేనిపక్షంలో బెయిల్‌ రద్దవుతుందని పేర్కొన్నారు. ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసు నమోదు చేస్తే సీఆర్‌పీసీ 41ఎ నోటీసు ఇచ్చి చట్టప్రకారం వ్యవహరించాలని తీర్పులో పేర్కొన్నారు.

విచారణ నేటికి వాయిదా

విశాఖపట్నంలోని మార్గదర్శి సీతంపేట శాఖ మేనేజర్‌ కె.రామకృష్ణ పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం విశాఖ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ న్యాయస్థానంలో ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలు ముగిశాయి. సీఐడీ స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎస్‌.రామమూర్తినాయుడు వాదిస్తూ విచారణ ఇంకా పూర్తి కాలేదని, ఈ పరిస్థితుల్లో బెయిల్‌ ఇస్తే తదుపరి విచారణకు విఘాతం కలుగుతుందన్నారు. రామకృష్ణ తరఫున న్యాయవాదులు ఎం.రవి, టి.సత్యశ్రీకాంత్‌ వాదనలు వినిపిస్తూ నిరాధార ఆరోపణలపై కేసు నమోదు చేసిన సీఐడీ కేవలం రాజకీయ కక్షతోనే మార్గదర్శి శాఖల్లో సోదాలు ప్రారంభించిందని, అన్ని దర్యాప్తులు ముగిసినా ఇంకా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఎం.తిరుమలరావు బెయిల్‌ పిటిషన్‌పై తదుపరి ఆదేశాల కోసం కేసును మంగళవారానికి వాయిదా వేశారు.

* తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని మార్గదర్శి కార్యాలయం మేనేజర్‌ రవిశంకర్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను జిల్లా ఇన్‌ఛార్జి ప్రధాన న్యాయమూర్తి సునీత మంగళవారానికి వాయిదా వేశారు. దీనిపై సోమవారం వాదనలు విన్నారు. అలాగే రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న మార్గదర్శి మేనేజర్‌ను కస్టడీకి కోరుతూ సీఐడీ అధికారులు పిటిషన్‌ వేయగా ఈ విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు