వివాదాస్పద వ్యక్తికి తుపాకీ లైసెన్సా?
పులివెందుల్లో కాల్పులకు తెగబడ్డ గొర్లె భరత్‌కుమార్ యాదవ్ అత్యంత వివాదాస్పదుడు. వివేకా హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఆ తుపాకీతో ఏం చేసినా పట్టించుకోరా
భరత్‌కుమార్ యాదవ్ వ్యవహారంలో విమర్శలు
పోలీసుల తీరుపై అనేక ప్రశ్నలు
ఈనాడు-అమరావతి, ఈనాడు డిజిటల్-కడప: పులివెందుల్లో కాల్పులకు తెగబడ్డ గొర్లె భరత్‌కుమార్ యాదవ్ అత్యంత వివాదాస్పదుడు. వివేకా హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వ్యక్తికి తుపాకీ లైసెన్సు ఎవరి సిఫార్సుతో ఇచ్చారు? ఆ లైసెన్సుడు తుపాకీతో అతను సెటిల్‌మెంట్లు, దందాలకు పాల్పడుతుంటే పోలీసుల నిఘా ఏమైంది? ఎందుకు లైసెన్సు రద్దుచేయలేదు? ఇవన్నీ ఇప్పుడు చర్చనీయాంశాలయ్యాయి. అధికారపార్టీ ముఖ్యనాయకుడి ఒత్తిడితోనే పోలీసులు అతనికి లైసెన్సు ఇచ్చారన్న ఆరోపణలు వస్తున్నాయి.
అప్పుడే రద్దుచేస్తే..
ఇటీవల రెండు, మూడుసార్లు భరత్‌యాదవ్ తుపాకీతో కాల్చేందుకు యత్నించినా, అక్కడివారు అడ్డుకోవటంతో తీవ్ర ఘటనలు జరగలేదు. ఇది పులివెందుల్లో అందరికీ తెలిసినా.. తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. భరత్‌కుమార్ యాదవ్‌కు తుపాకీ లైసెన్సు ఇవ్వటంపైనే అభ్యంతరాలున్నాయి. మొదటిఘటన జరిగినప్పుడే లైసెన్సు రద్దుచేసుంటే.. తాజా ఘోరం జరిగేది కాదని, ఇది పోలీసుల వైఫల్యమేనని స్థానికులు విమర్శిస్తున్నారు.
ఎందుకు చర్యలు తీసుకోలేదు?
వివేకా హత్యకేసులో సాక్షిగా ఉన్న తనకు ప్రాణహాని ఉందని భరత్‌కుమార్ యాదవ్ విన్నవించటంతో సాక్షుల రక్షణ పథకం-2018లోని క్లాజ్ 7(ఓ) ప్రకారం అతనికి తుపాకీ లైసెన్సు మంజూరు చేయాలని రెవెన్యూ అధికారులకు సిఫార్సు చేశామని వైయస్‌ఆర్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే.. లైసెన్సుడు తుపాకీతో బెదిరింపులకు, హత్యలకు తెగబడొచ్చా? ఇంత జరుగుతున్నా పోలీసులు ఎందుకు అతనిపై చర్యలు తీసుకోలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
భరత్‌యాదవ్ ద్వారా ప్రలోభపెట్టారు: దస్తగిరి
వివేకా హత్యకేసులో వాస్తవాలు వెల్లడించకుండా ఉండేందుకు, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వై.ఎస్.అవినాష్‌రెడ్డి పేర్లు బయటపెట్టకుండా ఉండేందుకు వారు.. భరత్‌కుమార్ యాదవ్ ద్వారా తనను ప్రలోభాలకు గురిచేశారని ఈ కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి గతేడాది ఫిబ్రవరిలో పులివెందుల మేజిస్ట్రేట్ కోర్టులో ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. సీబీఐకి తాను వాస్తవాలన్నీ చెప్పేశానని వారికి తెలిసిన తర్వాత.. ‘‘నువ్వు వాళ్ల మీద చెప్పి చాలా పెద్ద తప్పు చేశావు. వాళ్లు నిన్ను వదిలిపెట్టరు. చంపుతారు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ప్రెస్‌మీట్ పెట్టి ఇప్పటివరకూ చెప్పిందంతా అబద్ధమని చెప్పు. నీకు డబ్బులు ఇప్పిస్తాను, ఇంకేమైనా సాయం కావాలన్నా చేయిస్తాను’’ అంటూ భరత్‌కుమార్ తనను హెచ్చరించాడని దస్తగిరి ఆ వాంగ్మూలంలో పేర్కొన్నారు.
* దిల్లీలో సీబీఐ విచారణకు వెళ్లినప్పుడు నాలుగైదు రోజుల పాటు భరత్‌యాదవ్ నాతోపాటు అక్కడే ఉన్నాడు. తర్వాత సీబీఐ అధికారులకు సందేహం వస్తుందేమోనని పులివెందులకు వచ్చేశాడు. నేను దిల్లీలో సీబీఐ అధికారులకు నిజం చెప్పలేదు. పులివెందులకు తిరిగి వచ్చాక భరత్‌యాదవ్, భయపురెడ్డి నన్ను కలిసి దిల్లీలో సీబీఐ అధికారులతో ఏం చెప్పావని ఆరాతీశారు.
* తర్వాత కడపలో సీబీఐ అధికారులు విచారించినప్పుడు వారితో అసలు నిజం చెప్పాను. ప్రొద్దుటూరు న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చాను. ఆ తర్వాత భరత్‌యాదవ్, శివశంకర్‌రెడ్డి నన్ను కలిశారు. వాంగ్మూలంలో ఏం చెప్పానని అడిగారు. ప్రాణభయంతో వారికి ఏమీ చెప్పలేదు.
* కడప ఎంపీ వై.ఎస్.అవినాష్‌రెడ్డి.. తోట దగ్గరకు రమ్మంటున్నారని ఓ రోజు భరత్‌యాదవ్ నన్ను పిలిచాడు. నేను వెళ్లలేదు. తర్వాత భరత్‌యాదవ్, పులివెందులకు చెందిన న్యాయవాది ఓబుల్‌రెడ్డి నన్ను హెలిప్యాడ్ వద్దకు పిలిచారు. ‘‘నువ్వు నాకు నిజం చెప్పావో.. అబద్ధం చెప్పావో తెలియదు. జాగ్రత్తగా మసలుకో. అనవసరపు మాటలు మాట్లాడకు’’ అన్నారు. తర్వాత పులివెందుల్లో సునీల్‌యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి తరఫు న్యాయవాదులు నా వాంగ్మూలాన్ని బహిర్గతం చేశారు.
తుపాకీ లైసెన్సు ఎలా ఇచ్చారు: భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, తెదేపా ఎమ్మెల్సీ
అనేక అరాచకాలకు కేంద్రబిందువుగా ఉన్న భరత్‌కుమార్ యాదవ్‌కు తుపాకీ లైసెన్సు ఎలా ఇచ్చారు? ఎందుకిచ్చారు? లైసెన్సు ఇవ్వొద్దని జిల్లా యంత్రాంగానికి స్పెషల్ బ్రాంచ్ అధికారులు నివేదించినా ఎందుకు పట్టించుకోలేదు? దీనిపై దర్యాప్తు జరగాలి. ఈ వ్యవహారంలో పులివెందుల సీఐ రాజు పాత్రపై విచారణ జరపాలి. భరత్‌యాదవ్ ఇటీవల ఈ తుపాకీతో హత్యాయత్నానికి తెగబడినా ఎందుకు లైసెన్సు రద్దుచేయలేదు? ఎమ్మెల్సీగా ఎన్నికైన నాకు అధికారపక్షం నుంచి ముప్పు ఉన్నా.. భద్రత కల్పించలేదు.
సాక్షుల రక్షణ పథకం ప్రకారమే లైసెన్సు: ఎస్పీ అన్బురాజన్
వివేకా హత్య కేసులో భరత్‌కుమార్ యాదవ్ సాక్షి. తన ప్రాణాలకు హాని ఉందంటూ ఆయన 2021 నవంబరులో సీబీఐ అధికారులకు, మాకు లేఖ రాశారు. దీంతో సాక్షుల రక్షణ పథకం కింద తుపాకీ లైసెన్సు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు సిఫార్సు చేశాం. భరత్‌కుమార్ యాదవ్ ఒక్కరికే కాదు.... ఈ కేసులో కీలకమైన సాక్షులందరికీ రక్షణ కల్పించేలా చర్యలు తీసుకున్నాం. లైసెన్సుడు తుపాకీతో సెటిల్‌మెంట్లు, బెదిరింపులకు పాల్పడినట్లు మాకు ఫిర్యాదులేవీ అందలేదు. అతని బాధితులు ఉంటే మాకు ఫిర్యాదు చేయొచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గత నెల 26నే అతని వద్దనున్న తుపాకీని స్వాధీనం చేసుకున్నాం. ఎన్నికలు ముగియటంతో ఈ నెల 24న మళ్లీ దాన్ని తిరిగి ఇచ్చాం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
PM Modi: నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం.. ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
-
Crime News
పెళ్లింట మహావిషాదం.. ముగ్గురు తోబుట్టువుల సజీవదహనం
-
Ap-top-news News
YSRCP: పాతపట్నం ఎమ్మెల్యేకు గిరిజనుల నిరసన సెగ
-
India News
Maharashtra: ఆడపిల్ల పుట్టిందని ఏనుగుపై ఊరేగింపు
-
India News
పాఠశాల భోజనంలో పాము.. 25 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Politics News
Balakrishna-Jr NTR: ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్