ఈ చేత్తో నిధులిచ్చి ఆ చేత్తో వెనక్కి..!
ఏపీ జెన్‌కో గ్రాట్యుటీ ట్రస్టు, ఏపీ జెన్‌కో పీఎఫ్ ట్రస్టు తమ భవిష్యనిధి సొమ్ములను ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌కు మళ్లిస్తున్నట్లు ఆ సంస్థల ఉద్యోగులు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్తు ఉద్యోగుల భవిష్య నిధులతో ఆట
పవర్ ఫైనాన్సు కార్పొరేషన్ నుంచి ఇచ్చి.. బేవరేజెస్ కార్పొరేషన్‌లోకి మళ్లించే యత్నం
విద్యుత్తు సంస్థల ఉద్యోగుల ఆందోళన
ఈనాడు, అమరావతి: ఏపీ జెన్‌కో గ్రాట్యుటీ ట్రస్టు, ఏపీ జెన్‌కో పీఎఫ్ ట్రస్టు తమ భవిష్యనిధి సొమ్ములను ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌కు మళ్లిస్తున్నట్లు ఆ సంస్థల ఉద్యోగులు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏపీ పవర్ ఫైనాన్సు కార్పొరేషన్‌లో గతంలో ఆ సొమ్ములను పెట్టుబడిగా పెట్టగా అవి తాజాగా ‘మెచ్యూర్’ అయ్యాయని, ఆ సొమ్ములను ఇప్పుడు మళ్లీ ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌లో తక్కువ వడ్డీకే మళ్లించబోతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు బేవరేజెస్ కార్పొరేషన్ వ్యవహారంపై ఇప్పటికే కేంద్రం తప్పుపట్టగా మళ్లీ అక్కడే నిధులు పెట్టుబడి పెట్టడం వివాదమవుతోంది. ఆ సమాచారం ప్రకారం... ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో మునిగిన రాష్ట్రప్రభుత్వం.. ఏజీ జెన్‌కో, ట్రాన్స్‌కో, మూడు డిస్కంల ఉద్యోగులు దాచుకున్న నిధులను పీఎఫ్ సొమ్ములనూ ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో తీసుకుంటోందని విద్యుత్తుసంస్థల ఉద్యోగులు సూత్రీకరిస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి...
ఈ విద్యుత్తు సంస్థలు తమ ఉద్యోగుల నుంచి వసూలు చేసిన పీఎఫ్, గ్రాట్యుటీ సొమ్ములను ఏపీ జెన్‌కో గ్రాట్యుటీ ట్రస్టు, ఏపీ జెన్‌కో పీఎఫ్ ట్రస్టుల్లో ఉంచుతారు. ఆ సంస్థలు వాటిని వివిధ చోట్ల పెట్టుబడిగా పెట్టి వడ్డీలు పొందుతుంటాయి. ఇలాగే.. ఆ సొమ్ములను ఏపీ పవర్‌ఫైనాన్సు కార్పొరేషన్ వద్ద ఆ సంస్థలు 9.6% వడ్డీకి పెట్టుబడిగా పెట్టాయి. 2022 నవంబరు నుంచి వివిధ తేదీల్లో ఆ పెట్టుబడుల గడువు ముగియడంతో ఏపీ పవర్‌ఫైనాన్సు కార్పొరేషన్ ఆ నిధులను తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పేరుకు ఏపీ పవర్ ఫైనాన్సు కార్పొరేషన్ వద్ద ఆ నిధులున్నా, వాస్తవంగా వినియోగించుకున్నది రాష్ట్రప్రభుత్వమే. గత కొద్ది నెలలుగా ఇవ్వాల్సిన సొమ్ము దాదాపు రూ.3,600 కోట్లు గడిచిన రెండు మూడు రోజుల్లో ఆ పీఎఫ్, గ్రాట్యుటీ సంస్థలకు చెల్లించినట్లు తెలిసింది. ఇప్పుడు ఆ సొమ్ములను తిరిగి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌లో బాండ్ల రూపంలో పెట్టుబడిగా పెట్టాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఇటు నిధులు ఇచ్చినట్లూ ఉంటుంది. మళ్లీ తన అవసరం కోసం తీసుకునేలా ఈ ఏర్పాటు సాగుతున్నట్లు సమాచారం.
బేవరేజెస్ కార్పొరేషన్‌పై ఇప్పటికే కేంద్ర ఆర్థికశాఖ గుర్రు: ఇప్పటికే ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం నిధులిచ్చి బయటి నుంచి బాండ్ల రూపంలో తీసుకోవడంపై కేంద్ర ఆర్థికశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి టి.వి.సోమనాథన్ 2022 ఆగస్టులోనే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్రం తన ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు, నికర రుణ పరిమితిని మాయచేసేందుకు ఈ ప్రయత్నం చేస్తోందని ఆయన ఆ లేఖలో తప్పుపట్టారు. ఈ క్రమంలో జెన్‌కో పీఎఫ్, గ్రాట్యుటీ ట్రస్టులు బేవరేజెస్ కార్పొరేషన్‌లో లిస్టెడ్ బాండ్లు కొనాలంటే అయ్యేపని కాదనే రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులూ భావిస్తూ, నాన్ లిస్టెడ్ బాండ్లు కొనేలా ఒత్తిడి చేస్తున్నారని విద్యుత్తు ఉద్యోగవర్గాల సమాచారం. లిస్టెడ్ బాండ్ల రూపంలో తీసుకునేందుకు రేటింగు సంస్థలు బేవరేజెస్ కార్పొరేషన్ బాండ్లకు సానుకూల రేటింగు ఇచ్చే అవకాశాలు అంతంత మాత్రమేనని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే నాన్ లిస్టెడ్ బాండ్ల రూపంలో పెట్టుబడి పెట్టించి, ఆ నిధులు వినియోగించుకునే ఎత్తుగడతో గట్టెక్కే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. బయట ఎక్కువ వడ్డీ వచ్చే అవకాశం ఉన్నా ఇక్కడ 8.5% వడ్డీకే బేవరేజెస్ కార్పొరేషన్‌లో పెట్టుబడి పెట్టించే ప్రయత్నాలు సాగుతున్నాయన్నది ఉద్యోగవర్గాల ఆందోళన.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
USA: మీరు దిల్లీ వెళ్లి చూడండి.. భారత్ చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: అమెరికా
-
General News
JEE Advanced: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్
-
India News
Navy: భారత నేవీ మరో ఘనత.. నీటిలోని లక్ష్యాన్ని ఛేదించిన స్వదేశీ టార్పిడో
-
Movies News
Virupaksha: ‘విరూపాక్ష’ మీమ్స్.. ఈ వైరల్ వీడియోలు చూస్తే నవ్వాగదు!
-
Ts-top-news News
Guntur: మృతుని పేరు మీద 12 ఏళ్లుగా పింఛను
-
Movies News
Prabhas: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్, ‘ఆదిపురుష్’ టీమ్