దేవుడి భూమికి మోక్షం

గుంటూరు నగరంలోని పాతగుంటూరులో ఉన్న శ్రీకంచి కామాక్షి- ఏకాంబరేశ్వరస్వామి ఆలయానికి చెందిన రూ.10 కోట్ల విలువైన భూమికి హైకోర్టు ఉత్తర్వులతో మోక్షం లభించింది.

Published : 31 Mar 2023 02:51 IST

హైకోర్టు ఉత్తర్వులతో రూ.10 కోట్ల విలువైన ఆస్తి తిరిగి దక్కిన వైనం  

ఈనాడు, అమరావతి: గుంటూరు నగరంలోని పాతగుంటూరులో ఉన్న శ్రీకంచి కామాక్షి- ఏకాంబరేశ్వరస్వామి ఆలయానికి చెందిన రూ.10 కోట్ల విలువైన భూమికి హైకోర్టు ఉత్తర్వులతో మోక్షం లభించింది. దేవాదాయశాఖ కమిషనర్‌ ఆ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు జారీ చేసిన ఉత్తర్వులను న్యాయస్థానం రద్దు చేసింది. దేవుడి ఆస్తుల్ని కాపాడాల్సింది పోయి దోచేస్తున్నారంటూ మండిపడింది. దీంతో ఆ భూమిని కాపాడటానికి భక్తులు చేసిన పోరాటం ఫలించింది. ఆలయభూమి ప్రైవేటు వ్యక్తుల పరం కావడంపై గతేడాది ఏప్రిల్‌ 4న ‘ఆలయ భూమి అన్యాక్రాంతం’ శీర్షికన ‘ఈనాడు’ వెలుగులోకి తెచ్చింది. పాతగుంటూరులోని శ్రీకంచి కామాక్షి-ఏకాంబరేశ్వరస్వామి ఆలయానికి సుద్దపల్లి డొంకలో రెండెకరాల భూమిని 1914లో యలవర్తి కుటుంబాచార్యులు అనే భక్తుడు దానమిచ్చారు. అప్పటి నుంచి ఈ భూమి దాతలు, ఆలయ అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్నట్లు ఆలయ రికార్డుల్లో నమోదైంది. 2016లో ప్రభుత్వం రూపొందించిన నిషేధిత భూముల జాబితా (22ఏ)లో ఈ భూమి కూడా చేరింది. నగరం విస్తరించడంతో ప్రస్తుతం ఇక్కడ ఎకరం రూ.5 కోట్ల చొప్పున రెండెకరాల విలువ రూ.10 కోట్లకు పైగా ఉంది. దేవాదాయశాఖ అధికారులు ఆలయ భూమిని గతంలో ప్రైవేటు వ్యక్తికి లీజుకు ఇచ్చారు. లీజుదారు భూమిని చదును చేసే క్రమంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు సదరు భూమి తమదని రావడంతో లీజుదారు మిన్నకుండిపోయారు. ఈ భూమి తమకు పూర్వీకుల నుంచి, ఇందులో కొంత భాగాన్ని 2016కు ముందే ఇతరులకు విక్రయించానని 2018లో మరో వ్యక్తి తెరపైకి వచ్చారు. సంబంధిత పత్రాలు చూపుతూ దేవాదాయశాఖ కార్యాలయాల చుట్టూ నాలుగేళ్లు తిరిగారు. 2022లో దేవాదాయశాఖ కమిషనర్‌ సదరు భూమి ప్రైవేటు వ్యక్తులదేనని నిరభ్యంతర పత్రం జారీ చేశారు. ఆలయానికి చెందిన రెండెకరాల భూమి మరో సర్వే నంబరులో ఉందని, దానిని రక్షించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. స్థానిక దేవాదాయ శాఖ అధికారులు సదరు సర్వే నంబరులో ఉన్న ఆలయ భూమికి హద్దులు గుర్తించాలని గుంటూరు తూర్పు తహసీల్దారు కార్యాలయాన్ని సంప్రదించారు. ఆ సర్వే నంబరులో మీరు చెబుతున్న భూమి లేదంటూ తహసీల్దార్‌ కార్యాలయం ఆ దరఖాస్తును తిరస్కరించింది. ఈ నేపథ్యంలో శ్రీ కంచి కామాక్షి ఏకాంబరేశ్వరస్వామి భక్తులు ఆలయ భూమిని రక్షించుకోవడానికి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాజాగా కోర్టు ఉత్తర్వులతో రూ.కోట్ల విలువైన భూమి తిరిగి దేవుడికే దక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని