ChandraBabu: దారిలో విడిపోయిన భద్రతా సిబ్బంది వాహనం.. చంద్రబాబుకు భద్రత ఇలాగా?

వారంతా వీవీఐపీలు.. ఒకరు జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు.. మరొకరు తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌.. ఇంకొకరు హీరో నందమూరి బాలకృష్ణ.. ఈ ముగ్గురు ప్రముఖులు ప్రయాణిస్తున్న వాహనాలను విజయవాడ ట్రాఫిక్‌ పోలీసులు గాలికి వదిలేశారు.

Updated : 29 Apr 2023 12:14 IST

ఆయన కాన్వాయ్‌కు తప్పని ట్రాఫిక్‌ కష్టాలు
వాహనంలో ఆయనతోపాటు రజనీకాంత్‌, బాలకృష్ణ  

ఈనాడు, అమరావతి: వారంతా వీవీఐపీలు.. ఒకరు జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు.. మరొకరు తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌.. ఇంకొకరు హీరో నందమూరి బాలకృష్ణ.. ఈ ముగ్గురు ప్రముఖులు ప్రయాణిస్తున్న వాహనాలను విజయవాడ ట్రాఫిక్‌ పోలీసులు గాలికి వదిలేశారు. కాన్వాయ్‌ వెళ్లే వరకూ మిగతా వాహనాలను నియంత్రించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. విజయవాడ శివారు కానూరులో శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల కోసం వచ్చిన చంద్రబాబుకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పలేదు. ఆయన వాహనంలోనే రజనీకాంత్‌, బాలకృష్ణ కూడా ఉన్నారు. జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న చంద్రబాబు ప్రయాణించే మార్గంలో నిబంధనల ప్రకారం జంక్షన్‌ క్లియరెన్స్‌ ఇవ్వాలి. కానీ అదేమీ అంత పక్కాగా జరగడంలేదు.

ఉండవల్లిలోని చంద్రబాబు తన నివాసం నుంచి శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరారు. ప్రకాశం బ్యారేజి పైకి రాగానే ఎదురుగా పెద్ద సంఖ్యలో వాహనాలు వచ్చేశాయి. కెనాల్‌ రోడ్డు వంతెన పైనా ఇదే పరిస్థితి. విశాలంగా ఉండే బందరు రోడ్డులో యూటర్న్‌ల నుంచి చాలా వాహనాలు చంద్రబాబు కాన్వాయ్‌లోకి వచ్చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు. ఆటోలు, సిటీ బస్సులు పక్కనే వెళ్లాయి. బాబు వాహనశ్రేణిలోని ఒక వాహనం బందరు రోడ్డులో తప్పిపోయింది. అందులో సాయుధ పోలీసు బృందం ఉంది. ఆ వాహనం బెంజి సర్కిల్‌ దాటాక కాన్వాయ్‌ నుంచి విడిపోయింది. ట్రాఫిక్‌ పోలీసులు ఆపడంతో ఆగిపోవాల్సి వచ్చింది. మళ్లీ దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలోని తాడిగడప కూడలి వద్ద కానీ అది వాహనశ్రేణిలో కలవడం కుదరలేదు. చంద్రబాబుకు మూడంచెల భద్రత ఉంటుంది. ఇంటలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ (ఐఎస్‌డబ్ల్యూ), నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ (ఎన్‌ఎస్‌జీ) విభాగంతో పాటు మూడో అంచెలో సాయుధ రిజర్వ్‌ పోలీసు బృందం (ఏఆర్‌ పార్టీ) రక్షణ బాధ్యతలను పర్యవేక్షిస్తారు. బాబు వెన్నంటి ఉండాల్సిన ఈ బృందం వాహనానికి ఆటంకాలు ఎదురవడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని