విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఎంవీఎస్‌ ప్రసాద్‌ కన్నుమూత

విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, ఉమ్మడి రాష్ట్రంలో వివిధ శాఖల ఉన్నతాధికారిగా సేవలందించిన ఎంవీఎస్‌ ప్రసాద్‌ కన్నుమూశారు.

Updated : 26 May 2023 06:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, ఉమ్మడి రాష్ట్రంలో వివిధ శాఖల ఉన్నతాధికారిగా సేవలందించిన ఎంవీఎస్‌ ప్రసాద్‌ కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 3 లోని నివాసంలో ఆయన గుండెపోటుతో మరణించారు. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని పెరవలి గ్రామానికి చెందిన ఆయన 1942 జులై 27న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ (పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌) పట్టా తీసుకున్నారు. 1977లో సివిల్స్‌ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి, విజయనగరం జిల్లాల కలెక్టర్‌గా సేవలందించారు. సమాచార, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్‌, తితిదే ఈవో, సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ- పొలిటికల్‌) ముఖ్య కార్యదర్శి హోదాల్లో పనిచేశారు. ఏపీఐఐసీ ఎండీగా 2003లో పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ అనంతరం భూకబ్జా నిరోధక కోర్టు పరిపాలన సభ్యునిగా పనిచేశారు. తన కుటుంబానికి చెందిన మేళ్లచెరువు ఫౌండేషన్‌ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నిరుపేద చిన్నారుల ఉన్నత విద్యకు ఆర్థిక సాయం అందించారు. శంషాబాద్‌లోని శృంగేరీ శంకర్‌మఠం ధర్మాధికారిగా సేవలందించారు. శనివారం జూబ్లీహిల్స్‌ మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు