ISRO: అక్కడే చదివి.. శాస్త్రవేత్తగా ఎదిగి..ఎన్‌వీఎస్‌-01 ప్రాజెక్టు డైరెక్టర్‌ స్ఫూర్తిగాథ

ఎన్‌వీఎస్‌-01 ఉపగ్రహ ప్రాజెక్టు డైరెక్టర్‌ కేవీఎస్‌ భాస్కర్‌.. శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రీయ పాఠశాల పూర్వ విద్యార్థి కావడం విశేషం.

Updated : 30 May 2023 09:00 IST

శ్రీహరికోట, న్యూస్‌టుడే: ఎన్‌వీఎస్‌-01 ఉపగ్రహ ప్రాజెక్టు డైరెక్టర్‌ కేవీఎస్‌ భాస్కర్‌.. శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రీయ పాఠశాల పూర్వ విద్యార్థి కావడం విశేషం. ఆయన ఆధ్వర్యంలోనే సోమవారం జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 వాహకనౌక ద్వారా ఎన్‌వీఎస్‌-01 ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా కక్ష్యలోకి పంపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన గణపతిరావు, సుబ్బులక్ష్మి దంపతుల కుమారుడు కేవీఎస్‌ భాస్కర్‌. గణపతిరావు సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌గా పని చేశారు.

ఆ సమయంలో భాస్కర్‌ శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రీయ పాఠశాలలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివారు. అనంతరం కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో 11, 12 తరగతులు, దుర్గాపూర్‌ ఆర్‌ఈసీ(ఎన్‌ఐటీ)లో ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ చదివారు. అనంతరం బిట్స్‌ పిలానీలో ఎంటెక్‌ (ఎలక్ట్రానిక్స్‌ అండర్‌ కంట్రోల్‌ సిస్టమ్‌) పూర్తి చేశారు. ఆపై 1990లో బెంగళూరులోని యూఆర్‌రావు శాటిలైట్‌ సెంటర్‌లో ఉద్యోగంలో చేరారు. అంచెలంచెలుగా ఉపగ్రహ ప్రాజెక్టు డైరెక్టర్‌ స్థాయికి ఎదిగారు. తాజాగా ఎన్‌వీఎస్‌-01 ఉపగ్రహ ప్రాజెక్టు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎన్‌వీఎస్‌ సిరీస్‌లో జరగనున్న నాలుగు ప్రయోగాలూ భాస్కర్‌ సారథ్యంలోనే జరగనున్నాయి.

 


అందరి భాగస్వామ్యంతో మూడేళ్లు: భాస్కర్‌

నావిగేషన్‌ ఉపగ్రహం ఎన్‌వీఎస్‌-01 తయారు చేయడానికి మూడేళ్లు పట్టింది. ఇందులో యూఆర్‌రావు శాటిలైట్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు భాగస్వాములయ్యారు. అటామిక్‌ క్లాక్‌ తయారీకి ఎక్కువ సమయం పట్టింది. ఇక నుంచి ప్రతి ఆరు నెలలకోసారి నావిగేషన్‌ ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని