వినియోగదారులకు మరో షాక్
విద్యుత్ వినియోగదారులపై మరో ఇంధన సర్దుబాటు (ట్రూఅప్) పిడుగు పడింది. యూనిట్‌కు 40 పైసల వంతున మే నెల బిల్లుతో కలిపి డిస్కంలు వసూలు చేస్తున్నాయి.
ఏప్రిల్‌లో విద్యుత్ కొనుగోలు ఖర్చుల సర్దుపోటు
ప్రతి యూనిట్‌కు 40 పైసల వంతున భారం
మే బిల్లులో కలిపి వసూలు చేస్తున్న డిస్కంలు
ఈనాడు, అమరావతి: విద్యుత్ వినియోగదారులపై మరో ఇంధన సర్దుబాటు (ట్రూఅప్) పిడుగు పడింది. యూనిట్‌కు 40 పైసల వంతున మే నెల బిల్లుతో కలిపి డిస్కంలు వసూలు చేస్తున్నాయి. దీంతో బిల్లు పట్టుకుంటేనే వినియోగదారులకు షాక్ తగిలే పరిస్థితి ఏర్పడుతుంది. ఏప్రిల్‌లో బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొనడానికి చేసిన ఖర్చును ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద డిస్కంలు వసూలు చేస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి నెలా ఈ ఛార్జీలను వసూలు చేసుకునే వెసులుబాటును రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) డిస్కంలకు కల్పించింది. ఏపీఈఆర్‌సీ అనుమతి లేకుండా గరిష్ఠంగా యూనిట్‌కు 40 పైసలు వసూలు చేసే అధికారం డిస్కంలకు ఉంది. ఇలా వసూలు చేసిన మొత్తాన్ని ఏడాది చివరలో సర్దుబాటు చేస్తాయి. ఇప్పటికే ప్రతి నెలా వచ్చే బిల్లులో రూ.2,910.74 కోట్లు, రూ.3,082.99 కోట్లకు సంబంధించిన ట్రూఅప్ మొత్తాన్ని డిస్కంలు కలిపి వసూలు చేస్తున్నాయి. దీనికి తోడు మూడో ట్రూఅప్ మొత్తం ప్రజలకు మరింత భారం కానుంది. ఎంత మొత్తం భారం పడుతుందన్న లెక్కలను మాత్రం అధికారులు బయటపెట్టడం లేదు.
ఏ నెల విద్యుత్ కొన్నా సర్దుపోటే ...!?
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు గడిచింది కేవలం 2 నెలలు మాత్రమే. ఈ రెండు నెలల్లో చేసిన విద్యుత్ కొనుగోళ్లతో డిస్కంలకు తట్టుకోలేని నష్టాలు వచ్చాయని లెక్కలు తేల్చాయి. వేసవిలో డిమాండ్ మేరకు సరఫరా చేయడానికి బహిరంగ మార్కెట్ నుంచి కొనడానికి డిస్కంలు రూ.కోట్లు ఖర్చు చేశాయి. ఏపీఈఆర్‌సీ నిర్దేశించిన టారిఫ్ ప్రకారం వినియోగదారుని నుంచి బిల్లులు వసూలు చేసినా.. అధిక ధరకు మార్కెట్‌లో కొన్న విద్యుత్ వల్ల ఇంకా యూనిట్‌కు రూ.1.20 వంతున నష్టం వస్తుందని డిస్కంలు లెక్క తేల్చాయి. ఈ నష్టాన్ని భర్తీ చేసుకోడానికి ట్రూఅప్ కింద యూనిట్‌కు 40 పైసల వంతున మే నెల బిల్లులో వసూలు చేసి.. మిగిలిన నష్టాలకు సంబంధించి ఏడాది చివరలో ఏపీఈఆర్‌సీకి లెక్కలు చూపి వసూలు చేసుకోడానికి వీలుగా అనుమతి తీసుకోవాల్సి ఉంది. అంటే.. యూనిట్‌కు 40 పైసలతో ఏప్రిల్‌కు సంబంధించిన ట్రూఅప్ భారం వదిలిపోయిందని వినియోగదారులు ఊపిరి పీల్చుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే డిస్కంలు చూపుతున్న లెక్కల ప్రకారం ఇంకా యూనిట్‌కు 80 పైసల వంతున ట్రూఅప్ ప్రతిపాదనలను ఏడాది చివర్లో డిస్కంలు దాఖలు చేస్తాయి. వాటిని పరిశీలించి.. ఎంత మొత్తాన్ని వసూలుకు అనుమతించాలనే దానిపై ఏపీఈఆర్‌సీ నిర్ణయిస్తుంది. మే నెల బిల్లులో డిస్కంలు వసూలు చేసిన మొత్తానికి మరో రెండు రెట్ల భారాన్ని ఏడాది చివరలో భరించడానికి వినియోగదారులు ఇప్పటి నుంచే మానసికంగా సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితిని డిస్కంలు కల్పిస్తున్నాయి. ఇప్పటికే మేలో కూడా భారీ మొత్తం ఖర్చు చేసి డిస్కంలు విద్యుత్ కొన్నాయి. నిబంధన ప్రకారం వచ్చే నెల కూడా యూనిట్‌కు మరో 40 పైసలు వడ్డించడానికి డిస్కంలు సిద్ధంగా ఉన్నాయి. ఏ నెలకు ఆ నెల విద్యుత్ కొనుగోలు చేస్తే దానికనుగుణంగా సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు బాదుడు బాధ భరించడం వినియోగదారులకు తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Team India: భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్..
-
Vijay Deverakonda: ఆ బ్రాండ్‌కు విజయ్ దేవరకొండ బై.. ఈసారి అంతకుమించి!
-
Mohajer-10: 2 వేల కి.మీల దూరం.. 24 గంటలు గాల్లోనే.. సరికొత్త డ్రోన్లు ప్రదర్శించిన ఇరాన్
-
Vande Bharat Express: 9 రైళ్లు ఒకేసారి ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల నుంచి 2.. ఆగే స్టేషన్లు ఇవే..!
-
10 Downing Street: బ్రిటన్ ప్రధాని నివాసంలో.. శునకం-పిల్లి కొట్లాట!
-
Chiru 157: చిరంజీవిని అలా చూపించాలనుకుంటున్నా: దర్శకుడు వశిష్ఠ