సంక్షిప్త వార్తలు (5)

ఒడిశాలో రైలు ప్రమాదంపై రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘ప్రమాదంలో 200 మందికి పైగా మృతి చెందడం, 900 మందికి పైగా గాయపడటం బాధాకరం.

Updated : 04 Jun 2023 05:18 IST

గవర్నర్‌ తీవ్ర విచారం

ఈనాడు, అమరావతి: ఒడిశాలో రైలు ప్రమాదంపై రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘ప్రమాదంలో 200 మందికి పైగా మృతి చెందడం, 900 మందికి పైగా గాయపడటం బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు కోలుకోవాలి’ అని ట్వీట్‌ చేశారు.


6న అంబేడ్కర్‌ వర్సిటీ బీఈడీ ప్రవేశపరీక్ష

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఈడీ, బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌)లో ప్రవేశాల కోసం ఈ నెల 6న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ అభ్యాసక సహాయ సేవా విభాగం డైరెక్టర్‌ డా.ఎల్‌ విజయకృష్ణారెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 నుంచి 12:30 గంటల వరకు బీఈడీ, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) పరీక్ష జరుగుతుందని..అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందుగా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. హాల్‌టికెట్లను సంబంధిత యూనివర్సిటీ పోర్టల్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పేర్కొన్నారు.


ఖాళీలు బ్లాక్‌ చేస్తే ఇక బదిలీలెందుకు?
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాష్ట్రోపాధ్యాయ సంఘం ప్రతినిధులు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియలో ప్రస్తుతమున్న అన్ని కేడర్ల ఖాళీలు మూసివేస్తే(బ్లాక్‌ చేస్తే) ఇక బదిలీలు ఎవరి కోసమని రాష్ట్రోపాధ్యాయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సాయిశ్రీనివాస్‌, తిమ్మన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బదిలీల జీవో విడుదలైన నాటి నుంచి రోజుకో మార్పుతో ఉపాధ్యాయుల్లో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయంలో సంయుక్త సంచాలకులు మువ్వా రామలింగాన్ని కలిసి ఉపాధ్యాయ బదిలీల్లో నెలకొన్న సమస్యలు వివరించి..పరిష్కారానికి వినతిపత్రం సమర్పించినట్లు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ఈ ప్రభుత్వానికి పదోన్నతులు, బదిలీలు నిర్వహించే ఉద్దేశం ఉందా? లేదా? అనే అనుమానం కలుగుతోంది. ఉపాధ్యాయులకు తాత్కాలిక ఆర్థిక ప్రయోజనాలు ఎరగా చూపి సర్వీసు నిబంధనలు బేఖాతరు చేసి ఎన్నడూ లేని విధంగా ఉత్తుత్తి పదోన్నతులు కల్పించడం విచారకరం. బదిలీలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే మాదిరిగా లేకుండా..జిల్లాకో విధానం అమలు చేయడం తగదు’’ అని వారు పేర్కొన్నారు.


ప్రారంభమైన గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలు

ఈనాడు, అమరావతి: గ్రూప్‌-1 ఉద్యోగ నియామక ప్రధాన రాత పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 11 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయి. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించారు. కేంద్రాల్లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంతో అనుసంధానం చేశారు. వీటి ద్వారా కమిషన్‌ అధికారులు కూడా పరీక్షల నిర్వహణ తీరును వీక్షించారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు సామగ్రి పెట్టుకునేందుకు కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాటు లేనందున అవస్థలు పడ్డారు.


ఏపీ పీజీ సెట్‌-23 షెడ్యూల్‌ విడుదల

విశాఖపట్నం(ఏయూ ప్రాంగణం), న్యూస్‌టుడే: ఏపీ పీజీ సెట్‌-2023 షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 6 నుంచి 10 వరకు రోజుకు మూడు సెషన్స్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు సెట్‌ కన్వీనర్‌ ఆచార్య సి.హెచ్‌. వి.వి.ఎస్‌.భాస్కరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 36 కేంద్రాలు, హైదరాబాద్‌లో ఒక కేంద్రంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు హాల్‌ టికెట్ల వివరాలు తెలుసుకొనేందుకు https:/cets.apsche.ap.gov.in/ APPGCET2023 ని సందర్శించాలని కోరారు.


బదిలీల ఆన్‌లైన్‌ దరఖాస్తుకు సాంకేతిక సమస్యలు
ఆందోళనలో జూనియర్‌ కళాశాలల అధ్యాపకులు

ఈనాడు, అమరావతి: ఇంటర్‌ విద్యాశాఖలో పనిచేసే అధ్యాపకులు బదిలీల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. సర్వర్‌లో నెలకొన్న సమస్యలవల్ల  దరఖాస్తుల స్వీకరణ జరగడంలేదు. ఈ నెల 2 నుంచి 4 మధ్య దరఖాస్తులు స్వీకరిస్తామని ఇంటర్‌ విద్యాశాఖ ప్రకటించింది. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో పంపే సౌకర్యం లేకపోవడంతో అధ్యాపకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రిన్సిపాళ్లు ‘కేడర్‌ స్ట్రెంత్‌’ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదుచేయలేదని తెలిసింది. ఇప్పటికే ప్రకటించిన ప్రకారం...ఈ నెల 10, 11 తేదీల్లో బదిలీల కోసం అర్హత సాధించిన వారి జాబితా ప్రకటించి, పోస్టింగుల కోసం ఆప్షన్స్‌ నమోదుచేసుకొనే అవకాశాన్ని కల్పించాలి. ఈ నెల 14న వారికి పోస్టింగులు ఇవ్వాలి.  ప్రత్యక్ష పద్ధతిలో కౌన్సెలింగ్‌ జరుగుతుందా? లేదా? అన్న దానిపై ఇంటర్‌ విద్యా శాఖ స్పష్టత ఇవ్వాలని అధ్యాపకులు కోరుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని