జలవనరుల శాఖలో ఇంకా బది‘లీల’లే!

ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖ ఇంజినీరింగు అధికారుల బదిలీల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. మే నెలాఖరుకల్లా పూర్తిచేసి, ఎవరు ఎక్కడ చేరాలో జాబితా ఇవ్వాల్సి ఉన్నా జూన్‌ 3 రాత్రికి కూడా ఆ జాబితాలు సిద్ధం కాలేదు.

Updated : 04 Jun 2023 05:33 IST

గడువు దాటినా పూర్తికాని ప్రక్రియ

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖ ఇంజినీరింగు అధికారుల బదిలీల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. మే నెలాఖరుకల్లా పూర్తిచేసి, ఎవరు ఎక్కడ చేరాలో జాబితా ఇవ్వాల్సి ఉన్నా జూన్‌ 3 రాత్రికి కూడా ఆ జాబితాలు సిద్ధం కాలేదు. బదిలీలు చేసినట్లు ప్రొసీడింగు ఉత్తర్వులు ఇచ్చారు. ఎవరు ఎక్కడ చేరాలో ఇప్పటికీ జాబితా ఖరారు కాలేదు. బదిలీల నిర్ణయం తీసుకునే కీలక స్థానాల్లో ఉన్నవారిలో ఒకరిద్దరు, వారి సహాయకుల్లో ఒకరిద్దరు ఇప్పటికీ లీలలు కొనసాగిస్తున్నారని ఇంజినీరింగు వర్గాలు లబోదిబోమంటున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన బదిలీ మార్గదర్శకాలనూ వారు పట్టించుకోవట్లేదు. కొన్ని ఇంజినీరింగు శాఖల్లో పాలనా సౌలభ్యంతో ఇచ్చుకున్న వెసులుబాట్లను జలవనరుల శాఖలోనూ అమలుచేయాలని కోరినా ఇక్కడ ఉన్నతస్థాయిలో అందుకు సముఖంగా లేరు. అయిదేళ్లు పూర్తిచేసిన ప్రతి ఉద్యోగినీ బదిలీచేయాలని, పాలనా సౌలభ్యంలో భాగంగా వెసులుబాటు కల్పించుకోవచ్చని జీవోలో పేర్కొన్నారు. జలవనరుల శాఖలోని నాణ్యత నియంత్రణ విభాగంలో మూడేళ్లు దాటినవారినీ బదిలీ చేయాలని నిర్ణయించుకుని జాబితాలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో మూడేళ్ల నిబంధన లేదని ఆ విభాగం వారెవరూ దరఖాస్తు చేసుకోలేదు. బదిలీ కోసం ఎంచుకోవాల్సిన మూడు ప్రాంతాలను దరఖాస్తులో చూపాలి. తాము ఎటూ బదిలీల పరిధిలోకి రామనే ఉద్దేశంతో ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు. అలాంటిది ఇప్పుడు మూడేళ్లు దాటితే బదిలీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

కొన్ని ప్రాజెక్టుల్లో అవసరాల రీత్యా, ప్రతిభ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని కొందరిని బదిలీ చేయాలనే డిమాండు వచ్చినా, అసలు ప్రాజెక్టుల పనులే చేయట్లేదు కదా.. ఇక ఎవరు ఎక్కడుంటే ఏంటని ఉన్నత స్థాయిలోనే ప్రశ్నిస్తున్నారు! ప్రాజెక్టుల నిర్వహణ, సాగునీటి కాలువల నిర్వహణ, వరద నియంత్రణ తదితరాల్లో అనుభవం ఉన్నవారిని ఒకచోట నుంచి మరో చోటకు అదే అనుభవం ఉపయోగించుకునేలా బదిలీలు చేస్తే ఒక ఎత్తు. కీలకమైన నిర్వహణ ఉండాల్సిన చోట ఏ మాత్రం అనుభవం లేనివారిని బదిలీ చేయడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గతంలో ఇలాగే గోదావరి వరదల సమయంలో ఎక్కడో దూరంగా పని చేస్తున్న ఒక అధికారిని తిరిగి ఆయన అనుభవం కోసం ప్రత్యేకాధికారిగా నియమించుకోవాల్సి వచ్చింది. కేంద్ర ఆకృతుల సంస్థలో ఎన్నాళ్ల నుంచో డిజైన్లలో అనుభవం ఉన్నవారిని కొందరిని మార్చవద్దని ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు ఒకరిద్దరు విన్నవించినట్లు తెలిసింది. ఇప్పటికే ప్రాజెక్టుల్లో డిజైన్లకు మూడు, నాలుగు నెలల సమయం పడుతోందని, ఆ అనుభవం ఉన్నవారిని మారిస్తే తర్వాత డిజైన్లకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పినా ఆ మాట వినిపించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. బదిలీలు ఉద్యోగుల సౌలభ్యంతో పాటు పనికి ఇబ్బందులు రాని విధంగా చూసుకోవాలే తప్ప బదిలీ ప్రక్రియ నిర్వహిస్తున్న వారు తమ స్వలాభాన్నే చూసుకుంటే ఎలా అన్న విమర్శలు వస్తున్నాయి. కొన్ని బదిలీలకు సంబంధించి ఉన్నతస్థాయిలో ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాల వల్ల కూడా సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు