ప్రజారోగ్య కార్యదర్శులపై మోయలేని భారం

వార్డు ప్రజారోగ్య (శానిటరీ), పర్యావరణ కార్యదర్శులకు పారిశుద్ధ్య కార్మికులపై పర్యవేక్షణ బాధ్యతలనూ అప్పగించారు.

Updated : 05 Jun 2023 05:49 IST

ఈనాడు, అమరావతి: వార్డు ప్రజారోగ్య (శానిటరీ), పర్యావరణ కార్యదర్శులకు పారిశుద్ధ్య కార్మికులపై పర్యవేక్షణ బాధ్యతలనూ అప్పగించారు. ఇది వారికి అదనపు భారమైంది. జనన, మరణ, వివాహ ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాల్సిన కార్యదర్శులను చెత్త పన్ను (వినియోగ రుసుములు) వసూలు చేయమంటున్నారు. సచివాలయంలోని మిగతా ఉద్యోగులు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5వరకు పని చేస్తున్నా.. ప్రజారోగ్య కార్యదర్శులు మాత్రం ఉదయం 5.30కు విధులకు హాజరు కావాల్సిందేనని పుర కమిషనర్లు హుకుం జారీ చేస్తున్నారు. వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న దాదాపు 3,500 మంది ప్రజారోగ్య కార్యదర్శులపై ఇప్పుడు మోయలేని భారం పడింది. మిగతా కార్యదర్శులతోపాటు వీరూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని ప్రభుత్వం మొదట నిర్దేశించింది. సవరించిన ఉత్తర్వుల్లో 8 గంటల పని దినాల్లో 3 గంటలు విధిగా క్షేత్రస్థాయిలో పని చేయాలని సూచించింది. ఈ క్రమంలో పుర, నగరపాలక కమిషనర్లు వీరికి చెత్త పన్ను వసూళ్ల లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు.

లక్ష్యాలను చేరుకోని కార్యదర్శులకు నోటీసులివ్వడంతోపాటు జీతాలు నిలిపేస్తామని బెదిరిస్తున్నారు. కొన్ని పురపాలక సంఘాల్లో తాజాగా ఉదయం 5.30కు విధులకు హాజరై పారిశుద్ధ్య కార్మికుల హాజరు, పనుల పర్యవేక్షణ బాధ్యతలనూ చూడాలని ఆదేశించారు. దీనిపై కార్యదర్శులు రాష్ట్రవ్యాప్తంగా కొద్ది రోజులుగా నిరసనకు దిగుతున్నారు. అయినప్పటికీ కమిషనర్లు బెట్టు వీడకుండా హాజరవ్వని కార్యదర్శులపై చర్యలకు సిద్ధమవుతున్నారు. కమిషనర్ల చర్యలను పురపాలక ప్రాంతీయ సంచాలకులూ సమర్థించడంపై కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. జగ్గయ్యపేట పురపాలక సంఘంలో ఉదయం 5.30కు విధులు హాజరుకాలేదన్న కారణంతో కొందరు కార్యదర్శులపై చర్యల కోసం కమిషనర్‌.. ప్రాంతీయ సంచాలకుల అనుమతికి ఇటీవల నివేదించారు. దీనిపై ఆయనా కమిషనర్‌కు అనుకూలంగానే స్పందిస్తూ ఆదేశాలనిచ్చారు. ఆ తరువాత కమిషనర్‌ కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. కార్యదర్శుల స్వీయ హాజరుకు సంబంధించిన లాగిన్‌లు మార్చాలని, జీతాల బిల్లులనూ పెట్టొద్దని ఆదేశించడంతో కలకలం చెలరేగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని