Flax Seeds: అవిశ గింజలతో మధుమేహానికి చెక్‌

నేటి సమాజంలో మధుమేహం బారిన పడేవారి సంఖ్య రోజురోజుకూ అధికమవుతోందన్న విషయం తెలిసిందే.

Updated : 27 Aug 2023 18:59 IST

పద్మావతి మహిళా వర్సిటీ అధ్యాపకురాలు శిరీష అధ్యయనం

తిరుపతి (మహిళా వర్సిటీ), న్యూస్‌టుడే: నేటి సమాజంలో మధుమేహం బారిన పడేవారి సంఖ్య రోజురోజుకూ అధికమవుతోందన్న విషయం తెలిసిందే. షుగర్‌ బారిన పడకుండా, ఒక వేళ ఇప్పటికే వచ్చినా సురక్షిత స్థాయుల్లో దాన్ని కట్టడి చేయాలంటే అనుసరించాల్సిన జీవనశైలిపై తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ గృహ విజ్ఞానశాస్త్ర విభాగం ఆచార్యులు, ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ టెక్నాలజీ కోర్సు కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ జి.శిరీష అధ్యయనం చేశారు. అవిశ గింజలు, పెరుగుతో మధుమేహాన్ని నియంత్రిస్తాయా   అనే కోణంలో తమ పరిశోధన సాగిందని ఆమె ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. ‘ఎఫెక్ట్‌ ఆఫ్‌ ఎ ప్రొబయోటిక్‌ అండ్‌ ప్రీబయోటిక్‌   బేస్డ్‌ ఫుడ్స్‌’ అనే పేరుతో చేసిన ఈ అధ్యయనానికి ‘మోడల్‌ రూరల్‌ హెల్త్‌ రీసెర్చ్‌ యూనిట్‌, ఐసీఎంఆర్‌, డీహెచ్‌ఆర్‌’   చంద్రగిరి యూనిట్‌ ఆర్థిక సహకారం అందించాయని వివరించారు. ఎన్‌.రజిని, పి.ఉమామహేశ్వరిదేవి, కె.అశోక్‌కుమార్‌రెడ్డి, ఆర్‌.ఉష, వెంకటప్రసాద్‌ ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నారు.

100 మందిపై అధ్యయనం

మహిళా, ఎస్వీ యూనివర్సిటీలలో ఉన్న 100 మంది టైప్‌2 డయాబెటిక్‌ పేషెంట్లను 25 మంది చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించాం. మొదటి గ్రూపులో ఉన్నవారికి మూడు నెలల పాటు 100ml పెరుగునే ఇచ్చాం. రెండో గ్రూపునకు 25 గ్రాముల అవిశగింజలను అందించాం. మూడో గ్రూపునకు 100ml పెరుగు, 25 గ్రాముల అవిశగింజలను ఇచ్చాం. నాలుగో గ్రూపునకు 100ml పెరుగు, అవిశగింజలు, ఒక గ్రాము స్పొరొలాక్‌ అందించాం. 3 నెలలపాటు ఈ ఆహారాన్ని ఇచ్చి తర్వాత అందరికీ షుగర్‌ పరీక్ష చేశాం. కేవలం పెరుగు తీసుకున్న మొదటి 25 మందిలో  మధుమేహ స్థాయి తగ్గలేదు. 25 గ్రాముల అవిశగింజలు తీసుకున్న రెండో గ్రూపు సభ్యుల్లో షుగర్‌ లెవెల్స్‌ తగ్గాయి. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్‌తోపాటు బరువు కూడా తగ్గారు. పెరుగు, అవిశగింజలు, స్పొరొలాక్‌ తీసుకున్నవారిలో కూడా ఇదే ఫలితం వచ్చింది. ‘అవిశ గింజలను నేరుగా కాకుండా వేయించి ఉప్పునీళ్లు చల్లుకుని తింటే రుచిగా ఉంటాయి. వీటిలో ఉండే ఫైబర్‌ మన శరీరంలో ఉన్న కొవ్వును తగ్గిస్తుంది. నేరుగా తినలేనివారు పొడిలా చేసుకుని అన్నంలో కలుపుకొని తినొచ్చు. వీటిని ప్రతిరోజూ తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది’ అని శిరీష వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని