ఏ తప్పూ చేయకున్నా పెద్ద శిక్షే వేశారు

నైపుణ్యాభివృద్ధి సంస్థ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో సీఐడీ నమోదు చేసిన కేసులో తెదేపా అధినేత చంద్రబాబు జ్యుడిషియల్‌ రిమాండును ఈ నెల 24 (ఆదివారం) వరకూ పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

Updated : 23 Sep 2023 11:11 IST

బందిపోటు మాదిరిగా అరెస్టు చేశారు
జైల్లో ఉంచి మానసిక క్షోభకు గురిచేస్తున్నారు
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏసీబీ కోర్టు న్యాయాధికారితో ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు
శిక్షగా భావించకూడదన్న న్యాయస్థానం
జ్యుడిషియల్‌ రిమాండు 24 వరకు పొడిగింపు

ఈనాడు, అమరావతి: నైపుణ్యాభివృద్ధి సంస్థ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో సీఐడీ నమోదు చేసిన కేసులో తెదేపా అధినేత చంద్రబాబు జ్యుడిషియల్‌ రిమాండును ఈ నెల 24 (ఆదివారం) వరకూ పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. మరోవైపు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో చంద్రబాబుకు అదనపు భద్రత కల్పించాలని, ఔషధాలు, ఇంటి నుంచి భోజన వసతులకు అనుమతించాలంటూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలు విషయంలో నివేదిక ఇవ్వాలని కారాగార అధికారులను ఆదేశించింది. ఏసీబీ కోర్టు న్యాయాధికారి హిమబిందు శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.
ఈ నెల 9న చంద్రబాబును అదుపులోకి తీసుకున్న సీఐడీ..10వ తేదీన ఏసీబీ కోర్టులో హాజరుపరచగా.. ఈ నెల 22 వరకు న్యాయస్థానం జ్యుడిషియల్‌ రిమాండు విధించిన విషయం తెలిసిందే. రిమాండు కాలం ముగియనుండటంతో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా చంద్రబాబును జైలు అధికారులు ఏసీబీ కోర్టు న్యాయాధికారి ముందు  హాజరుపరిచారు.

దోమలు, అపరిశుభ్రత ఉన్నాయన్న చంద్రబాబు

చంద్రబాబుతో న్యాయాధికారి హిమబిందు నేరుగా మాట్లాడారు. కారాగారంలో ఏమైనా ఇబ్బంది ఉందా? అని అడిగారు. కోర్టు ఆదేశాల మేరకు సౌకర్యాలు కల్పించారా అని ప్రశ్నించారు. దోమలు ఉన్నాయని, పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని ఆయన బదులిచ్చారు. ‘మీ నుంచి కొన్ని విషయాలు సేకరించాలని, మిగిలిన నిందితులతో మీకున్న సంబంధం ఏమిటనేది తేల్చేందుకు అయిదు రోజుల పోలీసు కస్టడీ కావాలని సీఐడీ పిటిషన్‌ వేసింది, దానిపై చెప్పేది ఏమైనా ఉందా?’ అని న్యాయాధికారి ప్రశ్నించారు.

ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు

చంద్రబాబు బదులిస్తూ ‘నైపుణ్యాభివృద్ధి సంస్థ విషయంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు సీఐడీ కనీస ప్రయత్నం చేయలేదు. వివరణ ఇచ్చేందుకూ అవకాశం ఇవ్వలేదు. నోటీసు ఇవ్వలేదు. అవకాశం ఇస్తే వివరాలు చెప్పేవాడిని. నా తప్పేమైనా ఉంటే విచారణ చేసి అరెస్టు చేయాల్సింది. ఏకపక్షంగా అరెస్టు చేశారు. సీఐడీ కార్యాలయలో విచారించి, సమాచారం సేకరించారు. ఫైళ్లన్నీ వారి వద్దే ఉన్నాయి. పోలీసు కస్టడీలో విచారించాల్సినది ఏముంటుంది’ అని పేర్కొన్నారు.

సీఐడీది కక్షసాధింపు చర్య

‘45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం నాది. దేశ, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషిచేశా. తప్పు చేయకపోయినా ఈ వయసులో నాకు పెద్ద శిక్ష వేశారు. అన్యాయంగా కేసులో ఇరికించి అరెస్టుచేశారు. జైల్లో ఉంచి మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. ఇదే నా బాధ, ఆవేదన. సీఐడీది కక్షసాధింపు చర్య. నోటీసు ఇచ్చి వివరణ తీసుకునే కనీస ప్రయత్నం చేయకుండా నన్ను ఓ బందిపోటులా అరెస్టు చేశారు’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

బాధపడాల్సిన అవసరంలేదన్న న్యాయాధికారి  

న్యాయాధికారి స్పందిస్తూ.. ‘మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు, చట్టాలపై అవగాహన ఉంటుందని అనుకుంటున్నా. ప్రస్తుతం మీపైన వచ్చింది ఆరోపణ మాత్రమే. ఆ ఆరోపణ నిజమా.. కాదా అనేది దర్యాప్తు సంస్థ చూసుకుంటుంది. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలోనే ఉంది. సామాన్యుడైనా, మాజీ సీఎం విషయంలోనైనా చట్టప్రకారం నడుచుకోవాల్సిందే. మీరు పెద్దవారు. దీన్ని శిక్షగా భావించకూడదు. కోర్టు ప్రొసీడింగ్స్‌ను మీరు హుందాగా గౌరవించాలి. ప్రస్తుతం మీరు కోర్టు కస్టడీలో ఉన్నారు తప్ప పోలీసు కస్టడీలో కాదు. మానసికంగా బాధపడాల్సిన అవసరం లేదు. కోర్టుపై విశ్వాసం ఉంచండి’ అని న్యాయాధికారి పేర్కొన్నారు. జ్యుడిషియల్‌ రిమాండును ఈ నెల 24 వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేశారు.

  • కొద్దిసేపు విరామం తర్వాత 11.15 గంటల సమయంలో పోలీసు కస్టడీకి ఇచ్చే వ్యవహారంపై న్యాయాధికారి ఇరువైపుల న్యాయవాదులతో చర్చించారు. చంద్రబాబు తరఫు సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ స్పందిస్తూ.. మధ్యాహ్నం 1.30 గంటలకు చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు నిర్ణయం వెల్లడించనున్నట్లు తనకు సమాచారం అందిందని న్యాయాధికారికి తెలిపారు. దీంతో హైకోర్టులో నిర్ణయం అనంతరం పోలీసు కస్టడీపై విచారణ చేస్తామని ఏసీబీ కోర్టు న్యాయాధికారి పేర్కొన్నారు. అక్కడి నుంచి న్యాయవాదులు హైకోర్టుకు చేరుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని