అన్నొచ్చాడు.. అన్యాయం చేశాడు

రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు జగన్‌ హయాం ఒక శాపంగా మారిపోయింది. కేంద్రం నుంచి నిధులూ తీసుకురాలేకపోయారు.

Updated : 02 Feb 2024 07:09 IST

నిధులు ఖర్చు చేయలేం.. కేంద్రం నుంచీ తెచ్చుకోలేం
పోలవరానికి జగన్‌ హయాం.. ఓ తీరని శాపం
మరో ఏడాది గడిచినా రెండో డీపీఆర్‌ లేదు
తొలిదశ నిధుల ఆమోదానికీ దిక్కులేదు
ఎంతమంది ఎంపీలను గెలిపిస్తే ఏం లాభం?
అయిదేళ్లలో చేతులెత్తేశారు

ఈనాడు, అమరావతి: రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు జగన్‌ హయాం ఒక శాపంగా మారిపోయింది. కేంద్రం నుంచి నిధులూ తీసుకురాలేకపోయారు. పోలవరం ప్రాజెక్టుపై ఖర్చూ చేయలేకపోయారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టు కోసం జగన్‌ సాధించింది ఏమీ లేదు. ఆయన గద్దెనెక్కిన తర్వాత ఈ అయిదేళ్లలో పోలవరం అన్యాయమైపోయింది. కేంద్ర ఆర్థికమంత్రి 2024-25 తాత్కాలిక బడ్జెట్‌ను గురువారం లోక్‌సభకు సమర్పించారు. అందులో పోలవరం అథారిటీకి సమావేశాల నిర్వహణ పేరుతో రూ.లక్ష మాత్రమే బడ్జెట్‌ కేటాయింపులు చూపారు. ఈ ప్రాజెక్టుకు నాబార్డు నుంచి రుణం తీసుకుని బడ్జెటేతర వనరుల ద్వారా నిధులిస్తామని కేంద్రం ఎప్పుడో ప్రకటించింది.

తాజా బడ్జెట్‌లో ఆ విభాగం కింద అన్ని ప్రాజెక్టులకూ కలిపి రూ. 2,500 కోట్ల కేటాయింపులే చూపారు. పోలవరానికి రావాల్సిన నిధులూ తెచ్చుకోలేకపోయాం. రెండో డీపీఆర్‌ను కేంద్రం ఆమోదిస్తే తప్ప కొత్తగా నిధులొచ్చే అవకాశం లేదని ఎప్పుడో తేలిపోయింది. ఇంతలో తొలిదశ నిధులంటూ కొత్త ప్రహసనం మొదలైంది. వాటికి కేంద్రం ఇంతవరకు పెట్టుబడి అనుమతులూ ఇవ్వలేదు. ఎన్నికల ముందు ఆయన మాటలు నమ్మి 22 మంది లోక్‌సభ ఎంపీలను గెలిపించాం. రాజ్యసభలోనూ తగినంత బలం ఇచ్చాం. ఆ బలాన్ని తన రాజకీయ ప్రయోజనాలకు తప్ప రాష్ట్రం బాగుకోసం వినియోగించకపోవడంతో.. పోలవరం ప్రాజెక్టుకు ఈ అయిదేళ్లలో కేంద్రం నుంచి జగన్‌ అదనంగా ఏమీ సాధించలేకపోయారు. రూ.47,725 కోట్లతో పోలవరం ప్రాజెక్టుకు రెండో డీపీఆర్‌ను 2019లోనే రివైజ్డ్‌ కాస్ట్‌కమిటీ ఆమోదించింది. ఆ మొత్తానికి ఇంతవరకూ పెట్టుబడి అనుమతులు సాధించలేదు.

ఈ ఏడాది ఖర్చు రూ.534.80 కోట్లే

2023-24 రాష్ట్ర బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.5,042 కోట్ల కేటాయింపులు చూపారు. కానీ డిసెంబరు నెలాఖరు వరకు చేసిన ఖర్చు రూ.534.80 కోట్లే! ఇంతవరకు మొత్తం పోలవరంపై చేసిన ఖర్చులో రూ.1,554 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. ఆ నిధులు రావాలంటే రెండో డీపీఆర్‌ లేదా తొలిదశ నిధులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేయాలి. ఆ ప్రక్రియ పూర్తయితే తప్ప కేంద్రం నుంచి నిధులొచ్చే ఆస్కారం లేదు. జగన్‌ పాలనలో కేంద్రం నుంచి పోలవరం రెండో డీపీఆర్‌కు ఆమోదం పొందడంలో ఇంతవరకు సఫలం కాలేదు.

తొలిదశ మాటేంటి?

పోలవరంలో ప్రస్తుతం 2013-14 ధరల ప్రకారం రూ.16,010 కోట్లకే కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టుకు పెట్టుబడి అనుమతులు ఉన్నాయి. ఇప్పటికే రూ.16,624 కోట్లు ఖర్చయింది. కొన్ని కాంపొనెంట్లలో ఆమోదానికి మించి ఖర్చు చేసినందున ఆ నిధులను కేంద్రం ఇవ్వదు. ఇప్పుడు రెండో డీపీఆర్‌ ఆమోదం పొందితే తప్ప నిధులు రావు. తొలిదశ పేరుతో మొత్తం రూ.36,449.83 కోట్లకు రాష్ట్రం ప్రతిపాదనలు పంపింది. 41.15 మీటర్ల స్థాయి వరకు నీళ్లు నిలబెట్టేందుకు ఈ కొత్త ప్రతిపాదన వచ్చింది. అది పరిశీలించి కేంద్ర జలసంఘం రూ.31,625.38 కోట్లకే సిఫార్సుచేసింది. ఆ తర్వాత కేంద్రం రివైజ్డ్‌ కాస్ట్‌కమిటీకి ఈ విషయం అప్పజెప్పింది. వారు పరిశీలించి సుమారు రూ.30,400 కోట్లకు సిఫార్సు చేశారని తెలిసింది. పెట్టుబడి అనుమతి ఇచ్చాక కేంద్ర మంత్రివర్గం ఆమోదిస్తేనే నిధులొస్తాయి. ఈ ప్రక్రియ కొలిక్కి రావడానికి రెండేళ్లు పట్టింది. ఆమోదం ఎప్పుడొస్తుందో చూడాలి. ఆ తర్వాత ఇంతవరకు కేంద్రం ఇచ్చిన నిధులు పోను మిగిలిన నిధులు రాష్ట్రం ఖర్చు చేసిన మేరకు ఇస్తూ వెళ్తుంది.

ఇలాగే ఖర్చుచేస్తే పోలవరం అయ్యేసరికి  50 ఏళ్ల పైమాటే!

రాష్ట్రంలో ఇవే పరిస్థితులు కొనసాగితే పోలవరం పూర్తయ్యేసరికి మరో 50 ఏళ్లు పట్టవచ్చు. పోలవరం పూర్తిచేయాలంటే ఇంకా రూ.35వేల కోట్ల వరకు అవసరమవుతాయి. అవి ప్రస్తుత లెక్కల ప్రకారం. అదే ఏటా కేవలం రూ.500 కోట్లో, వెయ్యి కోట్లో ఖర్చు చేసుకుంటూ వెళ్తే భారం మరింత పెరిగిపోతుంది. పునరావాసానికి అదే స్థాయి చెల్లింపులకూ నిర్వాసితులు అంగీకరించే పరిస్థితులూ ఉండవు. పెరిగిపోయే అంచనా వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటే పోలవరం ఇప్పట్లో సాకారమయ్యే పరిస్థితులు ఉండబోవు.

డ్రిప్‌ నిధులూ తెచ్చుకోలేకపోతున్నాం

కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టుల్లో డ్యాం భద్రతా అంశాల కింద పనులు చేపట్టేందుకు డ్రిప్‌ (డ్యాం రీహేబిటేషన్‌ అండ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రాం) కింద రాష్ట్రాలకు నిధులు ఇస్తోంది. ఇప్పటికే డ్రిప్‌ 1 కింద కేటాయింపులు పూర్తయ్యాయి. డ్రిప్‌ 2 కింద ఎప్పటి నుంచో ప్రతిపాదనలు, మంజూరు ప్రక్రియ సాగుతున్నా జగన్‌ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో ఆ నిధులు తెచ్చుకోలేకపోయింది. ఒకవైపు శ్రీశైలం డ్యాం భద్రతపై చర్చలు జరుగుతున్నాయి. ఆ ప్రాజెక్టు భద్రతా పనులు చేపట్టాలంటే రూ.వందల కోట్లు అవసరమని తేల్చారు. శ్రీశైలం, ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజిలకే నిధులిచ్చేందుకు ప్రతిపాదనలు కొలిక్కి వస్తున్నాయి. అవికూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొంత మేర నిధులు రావచ్చు.

కేంద్ర ప్రభుత్వం ప్రపంచబ్యాంకు రుణంతో ఈ ప్రాజెక్టును పట్టాలకు ఎక్కించింది. ఇందులో రాష్ట్రం వాటా నిధులూ భరించాలి. ప్రపంచబ్యాంకు రుణంతో పాటు కేంద్రం ఇచ్చే నిధుల రూపేణా రూ.126 కోట్లు బడ్జెట్‌లో చూపింది. అలాగే, నదుల అనుసంధానం ప్రాజెక్టుల కోసం కేంద్రం రూ.4,000 కోట్లు బడ్జెట్‌లో చూపింది. పోలవరం నుంచి నదుల అనుసంధానానికి కేంద్రాన్ని ఒప్పించి నిధులు తెచ్చుకోగలిగితే రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఎగువన ఇచ్చంపల్లి నుంచి కావేరికి అనుసంధానిస్తే రాష్ట్రం ఇబ్బంది పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద కేంద్రం రూ.661.20 కోట్ల కేటాయింపులు చూపింది. ఈ నిధులూ రాష్ట్రం తెచ్చుకోగలిగితే కొంత ప్రయోజనం కలుగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని