భక్తుల మనోభావాలపై జగన్‌ గొడ్డలివేటు

దేవతలపైకి దండెత్తిన దానవుల కథలెన్నో పురాణాల్లో కనపడతాయి. దేవాలయాలను కొల్లగొట్టిన కిరాతకుల దురాగతాలెన్నో చరిత్రలో నమోదయ్యాయి. ఆ రాక్షసుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జగన్‌మోహన్‌రెడ్డి - దేవాలయ వ్యవహారాల్లో తుచ్ఛ రాజకీయాలకు పాల్పడ్డారు.

Updated : 18 Apr 2024 16:15 IST

దేవతలపైకి దండెత్తిన దానవుల కథలెన్నో పురాణాల్లో కనపడతాయి. దేవాలయాలను కొల్లగొట్టిన కిరాతకుల దురాగతాలెన్నో చరిత్రలో నమోదయ్యాయి. ఆ రాక్షసుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జగన్‌మోహన్‌రెడ్డి - దేవాలయ వ్యవహారాల్లో తుచ్ఛ రాజకీయాలకు పాల్పడ్డారు. నేరచరితులను ధర్మకర్తల మండళ్లలో నియమించి పవిత్ర పుణ్యక్షేత్రాల ప్రతిష్ఠను దెబ్బతీశారు. మాట్లాడితే ‘‘దేవుడి దయ’’ అనే జగన్‌ - శ్రీరామచంద్రమూర్తి విగ్రహ విధ్వంసకులను వదిలేసి భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు.


సింహాచలం అప్పన్నతో ఆటలు!

‘‘పైన దేవుడు ఉన్నాడు... అన్నీ చూస్తాడు’’ అని విపక్షనేతగా జగన్‌ సుభాషితాలు వినిపించారు. అదే పెద్దమనిషి ముఖ్యమంత్రి కాగానే సింహాచలం అప్పన్న ఆలయ గౌరవాన్ని మసకబార్చే మహాపరాధానికి పాల్పడ్డారు. 12,716 ఎకరాల భూములు కలిగిన మాన్సాస్‌ ట్రస్ట్‌, సింహాచలం ఆలయాలకు అనువంశిక ధర్మకర్తగా ఉన్న అశోక్‌ గజపతిరాజును రాత్రికి రాత్రే తీసేసింది జగన్‌ ప్రభుత్వం. తెల్లారే సరికి ఆ రెండింటికి ఛైర్‌పర్సన్‌గా సంచయితా గజపతిరాజుతో ప్రమాణ స్వీకారం చేయించింది. సంచయితా ఎవరో ఏమిటో అప్పటివరకు రాష్ట్ర ప్రజలకు తెలియదు. దిల్లీలో ఉండే ఆమెను ఉన్నట్టుండి తెరపైకి తీసుకొచ్చిన జగన్‌- మాన్సాస్‌ ట్రస్టు, సింహాచలం పవిత్రధామాలపై లేని వివాదాన్ని సృష్టించారు. స్వార్థప్రయోజనాల కోసం సంప్రదాయాలూ కట్టుబాట్లనూ కాలరాశారు. ఆ క్రమంలోనే అశోక్‌ గజపతిరాజు తండ్రి, మాన్సాస్‌ ట్రస్ట్‌ స్థాపకులు పీవీజీ రాజు వీలునామాను జగన్‌ తుంగలో తొక్కారు. తాను అనుకున్నదే తడువుగా అశోక్‌ను సాగనంపేశారు. సంచయితా నియామకం చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పిన దరిమిలా జగన్‌ తేలుకుట్టిన దొంగయ్యారు. అప్పన్న చందనోత్సవాలకు సరైన ఏర్పాట్లు చేయడంలోనూ ఆయన సర్కారు ఘోరంగా విఫలమైంది. వైకాపా నేతల సేవకే అంకితమైన అధికార యంత్రాంగం, పోలీసుల పెత్తనంతో ఆ ఉత్సవాల్లో సామాన్య భక్తులు నరకం చవిచూశారు. దానిపై బాధితులు గొంతెత్తితే- జగన్‌ భక్త శిఖామణి, మంత్రి బొత్స సత్యనారాయణ చిందులు తొక్కారు.


తిరుమలలోనూ అరాచకమే!

స్వయంగా కారాగారవాసం చేసొచ్చిన జగన్‌కు నేరచరితులంటే వల్లమాలిన అభిమానం. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) బోర్డు సభ్యుడిగా లిక్కర్‌ కేసులో నిందితుడు శరత్‌చంద్రారెడ్డిని(ఎంపీ విజయసాయిరెడ్డి బంధువు) నియమించారు. అంతకు ముందు 2021లో తితిదే బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులుగా 52 మందిని కొలువుతీర్చారు జగన్‌. అది చట్టవిరుద్ధమంటూ సంబంధిత జీవోలను హైకోర్టు కొట్టేసింది. తిరుపతిలో పారిశుద్ధ్య కార్యక్రమాలకు తితిదే నిధులు రూ.100 కోట్లను కేటాయించడాన్నీ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. శ్రీవేంకటేశ్వరుడికి భక్తులిచ్చే సొమ్ములతో తమ రాజకీయ పలుకుబడిని పెంచుకునేందుకు జగన్‌ అనుచరులు సిద్ధమయ్యారు. వెంకన్న సొత్తుతో తిరుపతిలో పలు పనులు చేసి, వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేసుకోవాలని వారు ఎత్తులు వేశారు. దేవస్థానం ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి కనుసన్నల్లోనే అదంతా జరిగినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. నిధుల మళ్లింపు కుదరదంటూ హైకోర్టు ఆదేశాలివ్వడంతో అధికారపక్షం గొంతులో పచ్చివెలక్కాయ పడింది. జగన్‌ భక్తిగా మొక్కే
విశాఖ శారదాపీఠం- తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం చేపట్టింది. ఆ విశృంఖలత్వాన్ని ఆపడానికీ ఉన్నత న్యాయస్థానమే జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.


జగన్‌ దారుణాలకు దుర్గమ్మే సాక్షి!

మంచి వ్యక్తిత్వం కలిగిన వారిని, సమాజంలో గౌరవమర్యాదలను పొందేవారిని దేవాలయాల బోర్డు సభ్యులుగా నియమించాలి. దేవాదాయ చట్ట నిర్దేశం మాత్రమే కాదిది- భక్తుల అభీష్టం కూడా. దాన్ని ఏమాత్రం పట్టించుకోని జగన్‌- కాల్‌మనీ వ్యవహారాల్లో అనేకసార్లు పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కిన కర్నాటి రాంబాబును విజయవాడ దుర్గ గుడి ఛైర్మన్‌గా నియమించారు. ఒక హత్యకేసులో విచారణను సైతం ఎదుర్కొన్న రాంబాబుకు ఇంద్రకీలాద్రి బాధ్యతలు అప్పగించడం ద్వారా జగన్‌ చేసింది... అక్షరాలా ధర్మంపై దాడే! తెదేపా నేత పట్టాభితో పాటు ఓ మహిళపై దాష్టీకం ఘటనల్లో ప్రధాన పాత్రధారి బచ్చు మాధవీకృష్ణకూ పాలకవర్గంలో చోటిచ్చారు జగన్‌. నకిలీ కరెన్సీ కేసులో నలభై రోజులు జైలులో ఉండి వచ్చిన నంబూరి రవి అనే వ్యక్తికీ అలాగే పట్టం కట్టారు. వైకాపా నాయకుల అనుచరులు కావడమే ఈ నేరచరితుల ఏకైక అర్హత... అందుకే వాళ్లను దుర్గమ్మ దేవాలయ ధర్మకర్తలను చేశారు జగన్‌. ఇంద్రకీలాద్రిపై ఉత్సవమూర్తుల ఊరేగింపునకు ఉపయోగించే రథానికి ఉండే మూడు వెండి సింహాలు 2019-20 మధ్యకాలంలో అపహరణకు గురయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. దుర్గమ్మ భక్తుల మనసులను కకావికలం చేసింది. రూ.70 కోట్లు కేటాయించి ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులు చేపడతామని 2020లో జగన్‌ హామీ ఇచ్చారు. దుర్గమ్మ సాక్షిగా చెప్పిన మాటనూ పూర్తిస్థాయిలో నిలబెట్టుకున్న పాపాన పోలేదాయన. నకిలీ దర్శన టిక్కెట్లను ముద్రించి అమ్మవారి భక్తులకు విక్రయించి ఆలయ ఆదాయానికి గండికొట్టిన నికృష్ట చరిత్రనూ వైకాపా నేతలు మూటగట్టుకున్నారు.


ఆ పాపిష్టి చేతులెవరివి?

గన్‌ జమానాలో పుణ్యక్షేత్రాల్లో దర్శన, పూజల ధరలను విపరీతంగా పెంచేశారు. శ్రీశైలం, విజయవాడ, పెనుగంచిప్రోలు ఆలయాల్లో భక్తులపై ఇలాగే భారం మోపారు. కాణిపాకం గుడిలో అభిషేకం టిక్కెట్టు వెలను రూ.700 నుంచి ఏకంగా అయిదువేల రూపాయలకు పెంచబోయి అందరి తిట్లూ తిన్నారు. అన్నవరం సత్యదేవుడి సమక్షంలో పెళ్లిళ్లు చేసుకోవాలనుకునే వారికి చుక్కలు చూపిస్తున్నారు. ఎక్కడి…కక్కడ దేవాలయ వ్యవహారాలను ఏదో ఒకవిధంగా వివాదాస్పదం చేసి- భక్తజన విశ్వాసాలతో ఆడుకున్నారు. విజయనగరంలోని ప్రఖ్యాత రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహాన్ని 2021లో దుండగులు ఎవరో విరగ్గొట్టి కొలనులో పడేశారు. అంతర్వేదిలో రథాన్ని కాల్చేశారు. రామతీర్థం కేసు విచారణ బాధ్యతను సీఐడీకి అప్పగించింది జగన్‌ సర్కారు. సీఎంను విమర్శించేవారిపై ఒంటికాలిపై లేచే సీఐడీ- శ్రీరాముడి విగ్రహాన్ని పగలగొట్టిన వారెవరో ఇంతవరకు తేల్చనేలేదు. అంతర్వేది రథం దహనం కేసును సీబీఐకి సిఫార్సు చేస్తే- వారు దాన్ని తీసుకోలేదు. దేవాలయాల్లో దుశ్చర్యలకు పాల్పడిన దుష్టులు జగన్‌ దయతో ఎక్కడో హాయిగా విహరిస్తున్నారు.


‘స్వామిభక్తి’ ఉన్మాదులు

నిరుడు తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ జాతర రోజుల్లో గుడి ప్రధాన ద్వారం దగ్గర ఓ పెద్ద పూల తోరణాన్ని ఏర్పాటుచేశారు. దానిపై ‘జె’ అనే ఆంగ్ల అక్షరం రాసి, దాని పక్కనే ‘గన్‌’ బొమ్మ వేశారు. ‘జగన్‌’ అని స్ఫురించేలా తయారుచేసిన ఆ తోరణాన్ని దైవసన్నిధిలో ప్రదర్శించడం- ‘స్వామిభక్తి’ మత్తులో ఉచ్ఛనీచాలు ఎరగని వైకాపా మూకల ఉన్మాదానికి తార్కాణం. అలాగే, మొన్న డిసెంబరులో నాయుడుపేట శ్రీపోలేరమ్మ ఆలయం మీద డిజిటల్‌ బోర్డు ఒకటి తగిలించారు. ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అనే వెర్రిమొర్రి నినాదం, సీఎం ఫొటో, ఫ్యాన్‌ గుర్తు ఉన్న బోర్డు అది... దాన్ని ఏకంగా గుడి మీదే పెట్టేశారు. దానికి రెండు నెలల మునుపు నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి ఏలూరు వైకాపా ఎంపీ కె.శ్రీధర్‌ తన పుట్టినరోజు వేడుకలను ద్వారకా తిరుమలలో ఆడంబరంగా చేసుకున్నారు. ఆలయ సిబ్బందితోనే వంటలు వండించి, వారితోనే పార్టీ కార్యకర్తలకు వడ్డన చేయించారు. ఆలయాలను అపవిత్రం చేసి అఖిలాంధ్ర భక్తకోటికి గుండెకోతను మిగిల్చిన జగన్‌ను, ఆయన అసురగణాలను క్షమించేదెవరు? 


మల్లన్న కంటే జగనన్నే ఎక్కువా?

రాజ్యాధికారం కోసమని భావించే రాజశ్యామల మహాయజ్ఞాన్ని నిరుడు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించారు. జగన్‌ ఆరంభించిన ఆ యాగాన్ని రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల సొమ్ముతో దేవాదాయ శాఖే జరిపించింది. అదే శాఖ- శ్రీశైల మల్లన్న కోవెలలో జరగాల్సిన మహాకుంభాభిషేకాన్ని మాత్రం రెండుసార్లు వాయిదా వేసింది. జగన్‌ సన్నిహిత స్వామీజీ పర్యవేక్షణలో మహాకుంభాభిషేక నిర్వహణకు గతేడాది మే నెలలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ స్వామీజీకి పెద్దరికం కట్టబెడితే తాము రాలేమని కంచి వంటి ప్రధాన పీఠాధిపతులు ఖరాకండీగా చెప్పేశారు. దాంతో ఎండలు ఎక్కువగా ఉన్నాయంటూ మహాకుంభాభిషేకాన్ని వాయిదావేశారు. దానిపై హైకోర్టులో కేసు దాఖలైంది. మహాకుంభాభిషేకాన్ని కార్తిక మాసంలో (నవంబరు) నిర్వహిస్తామని దేవాదాయ శాఖాధికారులు కోర్టుకు మాటిచ్చారు. కానీ, చెప్పినట్లు చేయలేదు. కారణం- దక్షిణాయనంలో మహాకుంభాభిషేకం జరిగితే ప్రభుత్వాధినేతకు స్థానభ్రంశం కలుగుతుందని సర్కారీ పెద్దల చెవులను కీలక స్వామీజీ దొంగచాటుగా కొరికారు. ఎన్నికలకు ముందు ఇలా చేయడం మంచిది కాదంటూ పుణ్యక్రతువుకు అడ్డంపడ్డారు. అంటే, జగన్‌ పదవి పోతుందని చెప్పి భక్తుల కొంగుబంగారమైన శ్రీశైల మల్లికార్జునుడికి అపచారం తలపెట్టారన్న మాట. శివ శివా! అధికార దురహంకారానికి పరాకాష్ఠ ఇది! దానికితోడు శ్రీశైలం క్యూకాంప్లెక్స్‌, సాలు మండపాల నిర్మాణానికి నిరుడు పిలిచిన టెండర్లను సకల శాఖల మంత్రిగా పేరొందిన జగన్‌ ప్రభుత్వ సలహాదారు రద్దు చేయించారు. రూ.110 కోట్ల విలువైన ఆ పనులు తనకు సన్నిహితులైన గుత్తేదారులకు దక్కే అవకాశం లేదన్న దుగ్ధతోనే ఆయన అందుకు తెగబడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని