ఎన్ని‘కుల’ జగన్నాటకం

ప్రజల కులం, ఆస్తులు, ఆర్థిక స్థితి తదితర వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి ఉంటే తప్ప.. ప్రభుత్వం దగ్గర మినహా మరెక్కడా ఉండటానికి వీల్లేదు.

Updated : 21 Mar 2024 15:35 IST

ప్రజల వ్యక్తిగత సమాచారం అధికార పార్టీ చేతికి!
36 రోజులు సర్వే చేసినా.. బయటపెట్టని సర్కారు
జగన్‌ ఎన్నికల ఎత్తుగడలో భాగమే కులగణన

ఈనాడు, అమరావతి: ప్రజల కులం, ఆస్తులు, ఆర్థిక స్థితి తదితర వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి ఉంటే తప్ప.. ప్రభుత్వం దగ్గర మినహా మరెక్కడా ఉండటానికి వీల్లేదు. అలా ఇతరచోట్లకు మళ్లించడం ప్రజల గోప్యత హక్కుకు భంగం కలిగించడమే. ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్‌ ఇదే పని చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కులగణన పేరుతో ఇటీవల ఇంటింటికీ వాలంటీర్లను పంపి సేకరించిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం ప్రకటించకుండానే, వైకాపా చేతికి చేరినట్టు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. వాటి ఆధారంగానే ఈ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థుల ఎంపిక మొదలు.. ఏ సామాజికవర్గం ఏ ప్రాంతంలో ఎక్కువ ఉంది..? వారిని ఆకట్టుకునేందుకు ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయాలన్న లెెక్కలు వేసుకుని చక్కబెట్టుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే కులగణన వివరాలు బహిర్గతం చేయలేదన్న చర్చ నడుస్తోంది. సంబంధిత శాఖల అధికారులు మాత్రం సర్వే పూర్తి కాలేదని, ఇంకా 10 శాతం కుటుంబాల వివరాలు సేకరించాల్సి ఉందని చెబుతున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన కారణంగా సర్వేను నిలిపివేసినట్లు పేర్కొంటున్నారు.

ఇన్ని రోజుల సమయమా?

దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో కులగణన చేపడుతున్నామని, దాని ఆధారంగా ఆయా సామాజికవర్గాల తలరాతల్ని మార్చేస్తామంటూ జగన్‌ మొదలు, ఆయన వందిమాగధులు డబ్బా కొట్టారు. మొదట గతేడాది నవంబరులో సర్వే చేయాలని నిర్ణయించారు. అప్పుడు చేస్తే తాము అనుకున్న లాభం ఉండదనుకున్నారేమో గానీ వాయిదా వేశారు. తిరిగి ఎన్నికలు సమీపిస్తున్నాయనగా, జనవరి 19న ప్రారంభించారు. కులాలను లెక్కిస్తామని చెప్పి.. ప్రజల ఆస్తులు, విద్యార్హతలు తదితర 20 అంశాలతో కుటుంబాల సమస్త సమచారాన్ని సేకరించారు. తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను కేవలం ఒక్క రోజులోనే పూర్తి చేసింది. రాష్ట్రంలో మాత్రం 36 రోజుల సుదీర్ఘ సమయం తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి రెండు వేల కుటుంబాలకు ఒక గ్రామ, వార్డు సచివాలయం ఉంది. 50 కుటుంబాలకు ఒకరు చొప్పున వాలంటీర్లు ఉన్నారు. ప్రభుత్వం అడిగిన వివరాలు సేకరించడం వారికి అంత కష్టం కాదు. వైకాపా ప్రభుత్వం మొదట కులగణన పూర్తికి ఇచ్చిన గడువు వారం రోజులే. కానీ ప్రభుత్వం జనవరి 19 నుంచి ఫిబ్రవరి 26 వరకు కొనసాగించింది. ఇంకా 10 శాతం మేర పూర్తి కాలేదని చెప్పడమంటే బుకాయించడమే. మొదట్లో కులగణనపై హడావుడి చేసిన సర్కారు ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చే తేదీ దగ్గర పడుతున్నా సర్వే వివరాలు ప్రకటించలేదంటే దాని వెనుక వైకాపా పెద్దలు రచించిన వ్యూహం ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు.

అత్యధిక జనాభా ఉన్న నియోజకవర్గం భీమిలి

ప్రభుత్వం చేపట్టిన సర్వే ప్రకారం.. 22.76 లక్షల మందితో రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న జిల్లాగా కర్నూలు నిలిచింది. అధిక జనాభా కలిగిన అర్బన్‌ లోకల్‌ బాడీగా విశాఖపట్నం(16.27 లక్షలు), నియోజకవర్గ పరంగా భీమిలి(3.82 లక్షలు), మండలాల్లో రాజమహేంద్రవరం(1.66 లక్షలు) మొదటి స్థానాల్లో ఉన్నాయి. 13,225 మంది జనాభాతో కృష్ణా జిల్లాలోని కానూరు-5 సచివాలయం మొదటి స్థానంలో ఉంది. ఈ వివరాలేవీ బహిర్గతం చేయకుండా గోప్యంగా ఉంచారు.

సొంతవారికి సీట్లు తగ్గించాల్సి వస్తుందనే!

కాపా తరఫున ఎమ్మెల్యే అభ్యర్థుల కేటాయింపులో ఎన్నడూ లేనివిధంగా సామాజిక న్యాయాన్ని పాటించినట్లు జగన్‌ చెబుతున్నారు. నిజంగా ఆయా సామాజికవర్గాలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలన్న చిత్తశుద్ధి ఉంటే కులగణన సర్వే వివరాలను బయటపెట్టేవారే. కానీ కులాలను అడ్డుపెట్టుకుని ఆయన చేసేదంతా నటనే. సర్వే వివరాలు బహిర్గతం చేస్తే నియోజకవర్గాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అసలు లెక్క తేలుతుంది. అప్పుడు ఆయన పప్పులు ఉడికే అవకాశం ఉండదు. చాలా నియోజకవర్గాల్లో తన సామాజికవర్గం వారికి సీట్లు దక్కే పరిస్థితి ఉండదు. ఇది జగన్‌కు ఇష్టముండదు కదా.. అందుకే సర్వేను బయటపెట్టలేదని రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని