ఇద్దరు ఎస్పీలపై వేటు ఖాయం!

ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన వెంటనే రాష్ట్రంలో రాజకీయ హత్యలు, హింస చెలరేగడాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది.

Updated : 27 Mar 2024 09:32 IST

పరమేశ్వరరెడ్డి, రవిశంకరరెడ్డిలపై త్వరలో చర్యలు
రాజకీయ హత్య, హింస చెలరేగడాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ
మరికొందరు ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు బదిలీలు! 
ఒకటి, రెండు రోజుల్లో ఆదేశాలు!

ఈనాడు, అమరావతి: ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన వెంటనే రాష్ట్రంలో రాజకీయ హత్యలు, హింస చెలరేగడాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. వీటికి బాధ్యులైన ప్రకాశం, పల్నాడు జిల్లాల ఎస్పీలు పరమేశ్వరరెడ్డి, రవిశంకరరెడ్డిలపై వేటు వేయనుంది. వీరితో పాటు అధికార పార్టీతో అంటకాగుతున్నారనే ఫిర్యాదులున్న మరికొంత మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులపైనా చర్యలు తీసుకోనుంది. ఈ జాబితాలో కొన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఉండే అవకాశముంది. ఒకటి, రెండు రోజుల్లో ఈ మేరకు ఆదేశాలు వెలువడనున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన మరుసటి రోజే... ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో తెదేపా నాయకుడు మునయ్యను చంపేశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తెదేపా సానుభూతిపరుడు ఇమాం హుస్సేన్‌ను అంతమొందించారు. పల్నాడు జిల్లా మాచర్లలో తెదేపా కార్యకర్త ఇర్ల సురేష్‌ కారును దహనం చేశారు.

ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రకాశం, పల్నాడు, నంద్యాల జిల్లాల ఎస్పీలు పరమేశ్వరరెడ్డి, రవిశంకరరెడ్డి, రఘువీరారెడ్డి.. ఇటీవల రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యారు. రాజకీయ హత్యలు, హింసాత్మక ఘటనలపై వివరణ ఇచ్చి, పూర్తిస్థాయి నివేదికలు సమర్పించారు. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న సీఈవో.... అక్కడ ఏం జరిగింది? ఎవరి బాధ్యతారాహిత్యం వల్ల ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి? అనే అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌(సీఈసీ)కు నివేదిక పంపారు. ఈ నేపథ్యంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటూ  ఒకటి, రెండు రోజుల్లో సీఈసీ ఆదేశాలిచ్చే అవకాశముంది. సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతో పాటు కొన్ని జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు అధికార వైకాపాకు అనుకూలంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదులందాయి. వాటిపైనా విచారణ జరిపిన ఎన్నికల సంఘం... కొందరు అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. వారందర్నీ ఒకటి, రెండు రోజుల్లో ఆయా స్థానాల నుంచి బదిలీ చేయనున్నట్లు సమాచారం.

మోదీ సభలో భద్రతా వైఫల్యంపై సీఈసీకి నివేదిక

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరైన ‘ప్రజాగళం’ సభలో భద్రతా వైఫల్యంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా కేంద్ర ఎన్నికల సంఘానికి మంగళవారం నివేదిక పంపించారు. ఆ రోజు సభలో భద్రత పరంగా ఏ లోపాలు చోటుచేసుకున్నాయి? వాటికి కారకులు ఎవరు? విధి నిర్వహణలో ఎవరెవరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు? తదితర అంశాలను ఆ నివేదికలో పొందుపరిచారు. ప్రధాని సభలో భద్రతా వైఫల్యాలకు డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి, నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, గుంటూరు ఐజీ పాలరాజు, పల్నాడు ఎస్పీ రవిశంకరరెడ్డిలే కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఈ నెల 18న భాజపా, తెదేపా, జనసేన నాయకులు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. విధులు సరిగ్గా నిర్వహించక పోవటం, సహాయ నిరాకరణ వల్లే ఇబ్బందులు తలెత్తాయని  ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధాని సభకు తగిన భద్రత కల్పించలేదని... రద్దీ నిర్వహణ, ట్రాఫిక్‌ నియంత్రణలను గాలి కొదిలేశారని పొందుపరిచారు. ఈ అంశాలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం... తక్షణమే సమగ్ర విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనాను ఇటీవల ఆదేశించింది. తదనుగుణంగా ఆయన విచారణ చేయించి నివేదిక పంపించారు. దాని ఆధారంగా కొంతమంది ఐపీఎస్‌ అధికారులపై చర్యలు తీసుకునే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని