వైకాపా ఎన్నికల ప్రచారం చేసిన ఆర్టీసీ వైఎస్‌ఆర్‌ యూనియన్‌ నేత!

ఆర్టీసీలోని వైఎస్‌ఆర్‌ ఉద్యోగుల సంఘం నేత ఒకరు తన పుట్టినరోజు వేడుక పేరిట కార్యక్రమం నిర్వహించి వైకాపాకు ఓటేయాలని ప్రచారం చేసినట్లు తెలుస్తోంది.

Published : 19 Apr 2024 03:23 IST

పుట్టినరోజు వేడుక పేరిట కార్యక్రమం

ఈనాడు-అమరావతి: ఆర్టీసీలోని వైఎస్‌ఆర్‌ ఉద్యోగుల సంఘం నేత ఒకరు తన పుట్టినరోజు వేడుక పేరిట కార్యక్రమం నిర్వహించి వైకాపాకు ఓటేయాలని ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. గత నెల 30న ఇదంతా జరిగితే తాజాగా ఆర్టీసీ ఉద్యోగుల వాట్సప్‌ గ్రూపుల్లో ఈ విషయం చక్కర్లు కొడుతోంది. గుంటూరు-1 డిపోలో ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఎం.సుధాకర్‌బాబు జన్మదిన వేడుకలను గతనెల 30న గుంటూరు శివారులోని బుడంపాడు సమీపంలో నిర్వహించారు. ఈయన ప్రజా రవాణాశాఖ (పీటీడీ) వైఎస్‌ఆర్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నేతగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైకాపా మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్‌ ప్రభుత్వానికి జాతీయ మీడియా, అంతర్‌రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా వ్యవహరిస్తున్న దేవులపల్లి అమర్‌ వైకాపాకు అనుకూలంగా రాసిన ‘మూడు దారులు’ అనే పుస్తకాన్ని సుధాకర్‌బాబు అక్కడికి వచ్చినవారందరికీ పంచారు. వైకాపాకు ఓటేసి మరోసారి ఈ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఆయన కోరినట్లు.. ఆర్టీసీ ఉద్యోగుల వాట్సప్‌ గ్రూప్‌లో చక్కర్లు కొడుతోంది. పీటీడీ వైఎస్‌ఆర్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య సహా పలువురు గతనెల 31న వైయస్‌ఆర్‌ జిల్లాలోని పలు ఆర్టీసీ డిపోల్లో ప్రచారం చేయడం వెలుగులోకి రావడంతో చంద్రయ్య సహా 9 మందిపై ఆర్టీసీ అధికారులు సస్పెన్షన్‌ వేటువేశారు. ఈ నేపథ్యంలో సుధాకర్‌బాబుపై కూడా చర్యలు ఉండవా అంటూ ఉద్యోగుల వాట్సప్‌ గ్రూపుల్లో చర్చ జరుగుతోంది.

వైకాపా ప్రచారంలో ఆర్టీసీ డైరెక్టర్‌ రాజారెడ్డి

ఆర్టీసీ బోర్డు డైరెక్టర్‌గా ఉన్న చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన ఎ.రాజారెడ్డి.. ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి, వైకాపాను గెలిపించాలంటూ కరపత్రాలు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. కరపత్రంపై మంత్రి పెద్దిరెడ్డి, పలువురు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల చిత్రాలను కూడా ముద్రించారు. కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పదవిలో కొనసాగుతూ ఇలా కరపత్రాన్ని తన పేరిట ముద్రించి, ఉద్యోగులకు పంచుతుండటం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలనే వాదన వినిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని