అభ్యర్థులు కోర్టుకొచ్చే పరిస్థితులు ఎందుకు కల్పిస్తున్నారు

ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులపై నమోదైన కేసుల వివరాలను సకాలంలో ఇవ్వకుండా వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించే పరిస్థితులు ఎందుకు కల్పిస్తున్నారని డీజీపీ, పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది.

Published : 20 Apr 2024 04:53 IST

రాష్ట్ర డీజీపీ, పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు

ఈనాడు, అమరావతి: ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులపై నమోదైన కేసుల వివరాలను సకాలంలో ఇవ్వకుండా వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించే పరిస్థితులు ఎందుకు కల్పిస్తున్నారని డీజీపీ, పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. జనసేన పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌పై నమోదైన కేసుల వివరాలు అందజేయాలని పోలీసులకు సూచించింది. హోంశాఖ జీపీ మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. శనివారం కేసుల సమాచారాన్ని పిటిషనర్‌కు అందజేస్తామన్నారు. విచారణను ఈనెల 22కు వాయిదా వేయాలని కోరారు. అందుకు అంగీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. తనపై నమోదైన కేసుల సమాచారాన్ని ఇచ్చేలా డీజీపీని ఆదేశించాలని కోరుతూ నాదెండ్ల మనోహర్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ వాదనలు వినిపించారు.

30న హైకోర్టు న్యాయవాదుల సంఘం ఎన్నికలు

ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘానికి ఈనెల 30న ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఓట్ల లెక్కింపు ఉంటుంది. అధ్యక్ష పదవికి సీనియర్‌ న్యాయవాదులు ఉప్పుటూరి వేణుగోపాలరావు, కలిగినీడి చిదంబరం, చిత్తరవు రఘు.. ఉపాధ్యక్ష పదవికి కేఎం కృష్ణారెడ్డి, పీటా రామన్‌, ఎన్‌ రంగారెడ్డి పోటీ పడుతున్నారు. ప్రధాన కార్యదర్శి పోస్టుకు జేవీఎస్‌హెచ్‌ శాస్త్రి, వంకాయలపాటి ప్రవీణ్‌, సింగయ్యగౌడ్‌, నన్నపనేని శ్రీహరి బరిలో ఉన్నారు. సంయుక్త కార్యదర్శి పోస్టుకు ఎన్‌.నిర్మలకుమార్‌, ఓరుగంటి ఉదయ్‌కుమార్‌, చేజర్ల వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని