తెలంగాణ హైకోర్టుకు మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ కేసు

డిపాజిట్ల స్వీకరణకు సంబంధించి మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థపై హైదరాబాద్‌ మొదటి అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ముందున్న కేసును కొట్టేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబరు 31న ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 20 Apr 2024 06:37 IST

అందరి వాదనలనూ విని నిర్ణయం వెలువరించండి
సుప్రీంకోర్టు ఆదేశం

ఈనాడు, దిల్లీ: డిపాజిట్ల స్వీకరణకు సంబంధించి మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థపై హైదరాబాద్‌ మొదటి అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ముందున్న కేసును కొట్టేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబరు 31న ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం సాంకేతిక కారణాలను దృష్టిలో ఉంచుకునే ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు పంపుతున్నట్లు పేర్కొంది. ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ నెల 9న విచారించి జారీ చేసిన ఉత్తర్వుల ప్రతి శుక్రవారం రాత్రి వెలువడింది.

‘డిపాజిటర్లకు చెల్లించాల్సిన రూ.2,596.98 కోట్లను 2007 ఏప్రిల్‌ 1 నుంచి 2018 ఆగస్టు 31 మధ్యకాలంలో చెల్లించడంతోపాటు, మిగిలిన రూ.5.33 కోట్ల బకాయిల చెల్లింపు కోసం ఎస్క్రో ఖాతాలో రూ.5.43 కోట్లను మార్గదర్శి సంస్థ జమ చేసిందన్న కారణంతో కేసును హైకోర్టు క్వాష్‌ చేసినట్లు ఉత్తర్వుల ద్వారా కనిపిస్తోంది. అలాగే మార్గదర్శి సంస్థకు వ్యతిరేకంగా ఒక్క డిపాజిటరూ ఫిర్యాదు చేయలేదు కాబట్టి దాని వెనుక దురుద్దేశం ఏమీ ఉండకపోవచ్చన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ను హైకోర్టు క్వాష్‌ చేసింది. ప్రస్తుతం తాము జారీ చేస్తున్న ఉత్తర్వుల్లో వ్యక్తం చేస్తున్న పరిశీలనలను ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ ఈ కేసు మెరిట్స్‌పై కోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయంగా భావించకూడదు. క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ను క్వాష్‌ చేసే ముందు హైకోర్టు ఈ కింద పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉండాల్సింది. ప్రతివాదులు ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించినట్లు ఆరోపణలున్నందున ఈ కేసులోని లోతుపాతులను అర్థం చేసుకోవడానికి ఆర్‌బీఐ వాదనలను సమగ్రంగా విని ఉండాల్సింది. ఒక్క డిపాజిటరు కూడా ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదని చెబుతున్నందున క్లెయిమ్‌లను ఆహ్వానిస్తూ హైకోర్టు బహిరంగ ప్రకటన జారీ చేసి ఉండాల్సింది.

క్లెయిమ్‌ల విషయంలో నిజమైన పెట్టుబడిదారులంతా సంతృప్తి చెందారని, వాస్తవానికి ఇందులో మార్గదర్శి సంస్థకు ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పడానికి ఈ చర్యలు తీసుకోవడం అవసరం. తదుపరి జరగుబోయే విచారణలో హైకోర్టుకు సహకారం అందించే స్వేచ్ఛను ఉండవల్లి అరుణ్‌ కుమార్‌కూ ఇస్తున్నాం. హైకోర్టు నిజమైన డిపాజిట్‌దారుల నుంచి క్లెయిమ్‌లు/అభ్యంతరాలను ఆహ్వానించొచ్చు. అలా వచ్చిన క్లెయిమ్‌ల నిర్ధారణ/పరిశీలన కోసం హైకోర్టు అవసరమనుకుంటే మాజీ హైకోర్టు న్యాయమూర్తి/సీనియర్‌ న్యాయాధికారిని నియమించి, ఇప్పటికే తిరిగి చెల్లించిన డిపాజిట్లకు మించి ఇంకా చెల్లించాల్సిన క్లెయిమ్‌లు ఏవైనా ఉంటే చెల్లించడానికి మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ సంస్థకు సహకరించవచ్చు. ఈ కేసును ఆరు నెలల్లోగా విచారించాలని హైకోర్టుకు సూచిస్తున్నాం. ఆ సమయంలో కంప్లైంట్‌ ప్రొసీడింగ్స్‌పై స్టే కొనసాగుతుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ కేసును తన ముందుగానీ, లేదంటే మరో సీనియర్‌ డివిజన్‌ బెంచ్‌ ముందుగానీ ఉంచాలని సూచిస్తున్నాం. ఇదే అంశంపైగానీ, దీంతో ముడిపడిన విషయాలపైగానీ మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థకు వ్యతిరేకంగా మళ్లీ కొత్త కేసులు నమోదు చేసే అధికారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి లేదు’ అని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని