కడప కోర్టు ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా

వివేకా హత్య అంశంపై కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని వివేకా కుమార్తె సునీత స్పష్టం చేశారు.

Updated : 20 Apr 2024 06:22 IST

వివేకానందరెడ్డి కుమార్తె సునీత

ఈనాడు, కడప, న్యూస్‌టుడే, పులివెందుల: వివేకా హత్య అంశంపై కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని వివేకా కుమార్తె సునీత స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో న్యాయం గెలవాలంటే వైఎస్‌ షర్మిలను గెలిపించాల్సిన బాధ్యత కడప ప్రజలందరిపై ఉందన్నారు. షర్మిలను గెలిపించాలని కోరుతూ పులివెందులలో శుక్రవారం ఆమె ఇంటింటి ప్రచారం చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా వైకాపా నాయకులు కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రతివాదులుగా పేర్కొంటున్న వారి వాదనలు వినకుండానే కడప జిల్లా కోర్టు గ్యాగ్‌ ఆర్డర్‌ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్లి న్యాయపోరాటం చేస్తానని పునరుద్ఘాటించారు.

వైకాపా నాయకులు కూడా వివేకా అంశంపై చాలా సందర్భాల్లో మాట్లాడినా కోర్టు ఉత్తర్వుల్లో అలాంటి ప్రస్తావన లేకపోవడం విస్మయం కలిగించిందన్నారు. వివేకాను వ్యక్తిత్వ హననం చేస్తూ.. చంద్రబాబును ఉద్దేశించి నారాసుర రక్త చరిత్ర అంటూ రాశారని, ఇలాంటి వాటిపై ప్రస్తావన లేకపోవడం బాధాకరమని అన్నారు. సీబీఐ విచారణ చేపట్టి న్యాయస్థానంలో ఛార్జిషీట్‌ దాఖలు చేసిందని, ఇది పబ్లిక్‌ డొమైన్‌లో ఉందని వివరించారు. ఛార్జిషీట్‌లో నిందితుల వ్యవహారం బహిర్గతమైనప్పుడు తప్పుపట్టడం ఎందుకని ప్రశ్నించారు. తాను ప్రచారంలో ఛార్జిషీట్‌లోని అంశాలనే ప్రస్తావిస్తున్నట్లు తెలిపారు. హత్య కేసుపై తెలంగాణ సీబీఐ కోర్టులో విచారణ జరుగుతుండగా.. కడప కోర్టులో ఉత్తర్వులు రావడం సమంజసం కాదన్నారు. పిటిషన్‌ వేసేందుకు వైకాపా నేత సురేష్‌బాబుకు అర్హత, అతనికి కలిగే భంగం లేదని, తనపై పరువు నష్టం దావా కూడా వేశారని వివరించారు.

అయిదేళ్లలో తాను అయిదుసార్లు మాత్రమే బయటకు వచ్చి మీడియాతో మాట్లాడానని, గత రెండు నెలలుగానే మాట్లాడుతున్నానని వివరించారు. అయిదేళ్లుగా ఎవరు ఎంత మాట్లాడారో, వివేకాను ఎంత అవమానించారో అందరికీ తెలుసన్నారు. అయిదేళ్లుగా తనకు నరకం చూపించారని, అంతకు ముందు తండ్రిని హింసించి చంపి అడ్డులేకుండా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎన్నికలకు మూడు వారాల సమయం మాత్రమే ఉంది. నేను మళ్లీ ఉన్నత న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి వస్తే మీ అందరినీ కలవలేకపోవచ్చు. నిందితులకు ఓటు వేయకుండా బుద్ధి చెప్పాలి’ అని పిలుపునిచ్చారు. గురువారం మురారిచింతల గ్రామంలో వైకాపాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారంటూ ఇద్దరిని కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే తనపై, షర్మిలపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని