‘నిప్పు రాజేస్తున్నా’ నిర్లిప్తతేనా?

అధికార పార్టీకి చెందిన రౌడీమూకలు తెదేపా కార్యాలయాలు, ఆ పార్టీ నాయకుల ఆస్తులను తగలబెట్టేస్తే ఒక్కటంటే ఒక్క ఘటనలోనూ నిందితుల్ని పట్టుకోలేదు.

Published : 30 Apr 2024 05:15 IST

పల్నాడు జిల్లాలో పేట్రేగిపోతున్న వైకాపా నాయకులు 
తెదేపా అభ్యర్థుల ప్రచారాన్ని అడ్డుకుంటున్న నాయకులు 
ప్రతిపక్ష పోలింగ్‌ ఏజెంట్‌గా ఉంటే నరికేస్తామని బెదిరింపు
దాడులకు పాల్పడుతున్నా పోలీసులు చోద్యం చూడడమేనా?
తెదేపా కార్యాలయాలకు నిప్పు పెట్టినా పట్టుకోలేరా?
ఈనాడు-అమరావతి

ధికార పార్టీకి చెందిన రౌడీమూకలు తెదేపా కార్యాలయాలు, ఆ పార్టీ నాయకుల ఆస్తులను తగలబెట్టేస్తే ఒక్కటంటే ఒక్క ఘటనలోనూ నిందితుల్ని పట్టుకోలేదు. పైగా ఎలాంటి ఆధారాలు దొరకలేదంటూ సాకులు చెబుతున్నారు. తెదేపా తరఫున పోలింగ్‌ ఏజెంట్‌గా ఉంటే నరికేస్తామని బెదిరిస్తే కూడా కేవలం బైండోవర్‌తో సరిపెట్టేశారు. ప్రతిపక్ష పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న వారిని వైకాపా శ్రేణులు పలుచోట్ల అడ్డుకుంటూ దాడులకు పాల్పడుతున్నా ఉదాసీనంగా ఉంటున్నారు. ఎన్నికల వేళ ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, నాయకులపై అధికార వైకాపా నేతలు దాడులు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, దమనకాండకు తెగబడుతుంటే.. వాటిని ఉక్కుపాదంతో అణచివేయాల్సింది పోయి చేతులు కట్టుకుని చూస్తున్నారు. ఫలితంగా ఈ హింసాత్మక ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అధికార వైకాపాతో అంటకాగుతున్నారనే ఫిర్యాదుల పైనే ఎస్పీ రవిశంకర్‌రెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఆ స్థానంలో బిందుమాధవ్‌ గరికపాటి బాధ్యతలు చేపట్టారు. ఎస్పీ మారినా.. పల్నాడువ్యాప్తంగా ప్రతిపక్షాలపై అధికార పార్టీ నాయకుల దాష్టీకాలు మాత్రం అదే తరహాలో కొనసాగుతున్నాయి. వైకాపా నాయకులు, శ్రేణులు ఏకంగా తెదేపా కార్యాలయాల పైకి దూసుకెళ్తూ కవ్వింపు చర్యలకు తెగబడుతుంటే కనీసం వాళ్లను నియంత్రించట్లేదు. గత అయిదేళ్లుగా తెదేపా శ్రేణులపై కొనసాగిన దమనకాండ ఈ ఎన్నికల వేళ మరింత ఉద్ధృతమైంది.

కార్యాలయాలు తగలబెట్టినా పట్టదా?

పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో చంద్రబాబు ప్రజాగళం సభ జరిగిన మర్నాడే తెదేపా కార్యాలయాన్ని దుండగులు తగలబెట్టేశారు. వైకాపా నాయకులే ఈ దారుణానికి పాల్పడ్డారని వారి పేర్లతో తెదేపా ఫిర్యాదు చేసినా ఇప్పటివరకూ ఒక్కరినీ అరెస్టు చేయలేదు. పైగా ఆధారాలు దొరకలేదని ఎస్పీయే స్వయంగా ప్రకటించారు. బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెంలోని తెదేపా కార్యాలయం వద్ద పందిరికి నిప్పుపెట్టారు. ఈ ఘటనలోనూ ఎవర్నీ అరెస్టు చేయలేదు. మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం మిరియాల గ్రామంలో తెదేపా కార్యకర్త ట్రాక్టర్‌కు నిప్పు అంటించిన ఘటనలోనూ నిందితుల్ని పట్టుకోలేదు. ఇవన్నీ రాజకీయ హింసాత్మక ఘటనలే. అయినా సరే నిందితుల్ని అరెస్టు చేయడంలో పోలీసులు చొరవ చూపించట్లేదు. అధికార పార్టీ నాయకులకు ఇదే అవకాశంగా మారి మరింతగా పేట్రేగిపోతున్నారు. పదేపదే ఇదే తరహా ఘటనలకు పాల్పడుతున్నారు.

ప్రతిపక్షాలు ప్రచారం చేసుకోవద్దా?

పల్నాడు జిల్లాలో ప్రతిపక్ష పార్టీల తరఫున ప్రచారం చేయడాన్ని నిషేధించారా? ప్రజాస్వామ్యయుతంగా ప్రచారం చేసుకుంటున్న వారిపై వైకాపా శ్రేణులు దాడులకు పాల్పడుతుంటే పోలీసులు ఎందుకు వాటిని అడ్డుకోవట్లేదు? పదేపదే ఈ ఘటనలు జరుగుతుంటే కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయులు తరఫున ఆయన సోదరి రుద్రమదేవి బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెంలో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లగా వైకాపా శ్రేణులు ఆమెను అడ్డగించాయి. తెదేపా శ్రేణులపై దాడులకు పాల్పడ్డాయి. ఈ ఘటనలోనూ నిందితులెవర్నీ పోలీసులు గుర్తించలేదు.

పెదకూరపాడు తెదేపా అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌కు మద్దతుగా కళాజాత బృందం ప్రచారం చేస్తుండగా.. 75 తాళ్లూరు ప్రధాన రహదారిపై వైకాపా నాయకులు అడ్డుకున్నారు. మైక్‌ను ఆపేయించారు. ఫ్లెక్సీలు చించేశారు. కళాకారులను దుర్భాషలాడి వారిపై దాడికి యత్నించారు. ఈ ఘటనలో కేసు నమోదైనా ఎవరిపైనా చర్యలు లేవు.


తెదేపా అభ్యర్థుల నామినేషన్లకు హాజరైనా దాడులే..

  •  సత్తెనపల్లిలో తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ నామినేషన్‌కు హాజరైన పెదమక్కెన గ్రామానికి చెందిన 20 మంది దళిత యువకులపై వైకాపా శ్రేణులు రాళ్లు, జెండా కర్రలతో దాడికి పాల్పడ్డాయి. తెదేపా సానుభూతిపరులైన ముగ్గురు దళిత యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేవలం నిందితులను బైండోవర్‌తో సరిపెట్టేశారు.
  • వినుకొండ తెదేపా అభ్యర్థి జీవీ ఆంజనేయులు నామినేషన్‌ సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి హాజరైనందుకు ఈపూరు మండలం ఇనుమెళ్లలో తెదేపా కార్యకర్తలపై వైకాపా మూకలు కత్తులు, కర్రలతో విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డాయి.
  • మాచర్ల నియోజకవర్గంలో తెదేపా నాయకుడు మాగంటి అంకారావుపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. తెదేపా తరఫున పోలింగ్‌ ఏజెంటుగా కూర్చొంటే నరికేస్తామని బెదిరించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేవలం బైండోవర్‌తో సరిపెట్టేశారు.

వారం రోజుల్లో జరిగిన ఘటనల్లో కొన్ని..

  • వైకాపా నాయకులు తమపై దాడులకు పాల్పడుతూ మహిళలను అసభ్యంగా దూషిస్తున్నారంటూ నాదెండ్ల మండలం కనపర్రు గ్రామస్థులు రెండు రోజుల కిందట ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
  • నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి అనిల్‌కుమార్‌ యాదవ్‌, శాసనసభ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిల నామినేషన్‌ సందర్భంగా ర్యాలీ చేపట్టగా.. వైకాపా శ్రేణులు తెదేపా కార్యాలయం ఎదుట కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి.
  • కంభంపాడులో వైకాపా శ్రేణులు.. తెదేపా కార్యాలయం ఎదుట బాణసంచా కాలుస్తూ, ఆ నిప్పురవ్వలు ఆ భవనంపై పడేలా చేసి రెచ్చగొట్టాయి.
  • మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో వైకాపా నాయకులు.. తెదేపా కార్యాలయానికి వెళ్లి అక్కడున్న వారిపై దుర్భాషలాడారు.
  • గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్‌పై పోలీసుస్టేషన్‌ ఆవరణలోనే దాడి చేశారు. ‘మా చేతుల్లోనే అధికారం ఉంది. ఎవరొస్తారో రండి’ అంటూ రెచ్చగొట్టారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు.
  •  నియోజకవర్గ తెదేపా అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు ప్రచార వాహనాన్ని ధ్వంసం చేశారు. ‘ఇది మా అడ్డా.. ఇక్కడికి ఎవడు పంపించాడ్రా నిన్ను’ అంటూ ఆ వాహన డ్రైవర్‌ను హింసించారు.

డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలను బాధ్యుల్ని చేస్తేనే..

పల్నాడు జిల్లావ్యాప్తంగా ఎక్కువచోట్ల వైకాపాతో అంటకాగుతూ, అరాచకాలకు కొమ్ము కాసేవారినే ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలుగా నియమించుకున్నారు. వారే ఇప్పుడు వైకాపా అరాచకాలకు వంతపాడుతున్నారు. అధికార పార్టీ నాయకుల దాడులపై తేలికపాటి సెక్షన్ల కింద కేసులు పెట్టి మమ అనిపించేస్తూ.. నిందితుల్ని అరెస్టు చేయకుండా వదిలేస్తున్నారు. రాజకీయ హింసకు తావులేకుండా ఈ ఎన్నికలు నిర్వహిస్తామని.. ఎక్కడైనా హింస జరిగితే సంబంధిత జిల్లాల ఎస్పీలనే బాధ్యుల్ని చేస్తామని సీఈఓ ముకేశ్‌కుమార్‌ మీనా పదేపదే చెబుతున్నారు. కానీ పల్నాడులో పరిస్థితి దిగజారుతూనే ఉంది. అసలు ఎన్నికల ప్రచారమే చేసుకోనివ్వకుండా అధికార పార్టీ నాయకులు ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. అయినా పోలీసులు నియంత్రించట్లేదు. నిందితులపై చర్యలు తీసుకోవట్లేదు. ఇలాంటి ఘటనలకు క్షేత్రస్థాయిలో డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలను బాధ్యుల్ని చేసి కఠినచర్యలు తీసుకోవాలి. లేకపోతే అధికార వైకాపా దాడులు, దౌర్జన్యాలతో పల్నాడు రావణకాష్ఠం అయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు