ఎక్కడా లేని చట్టం ఇక్కడే ఎందుకు?

దేశంలోని ఏ రాష్ట్రం ఇంతవరకూ ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని అమలు చేయలేదు. చాలా రాష్ట్రాలు ఈ తరహా చట్టాన్ని చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా, పౌరుల స్థిరాస్తి హక్కులకు భంగం కలుగుతుందన్న అనుమానంతో విరమించాయి.

Published : 05 May 2024 06:56 IST

దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంకా అమలు చేయట్లేదు
భాజపా పాలిత రాష్ట్రాలదీ ఈ విషయంలో వెనకడుగే
ఏ దురుద్దేశం లేకపోతే ఎందుకంత తొందర జగన్‌?
ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే

ఈనాడు, అమరావతి: దేశంలోని ఏ రాష్ట్రం ఇంతవరకూ ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని అమలు చేయలేదు. చాలా రాష్ట్రాలు ఈ తరహా చట్టాన్ని చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా, పౌరుల స్థిరాస్తి హక్కులకు భంగం కలుగుతుందన్న అనుమానంతో విరమించాయి. చివరకు భాజపా పాలిత రాష్ట్రాలు సైతం ఈ చట్టంతో మంచికన్నా చెడే ఎక్కువని భావించినట్లున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్‌ టైటిలింగ్‌ బిల్లు ముసాయిదాను తయారుచేసింది. నీతి ఆయోగ్‌ ఆ నమూనానే ఇతర రాష్ట్రాలకూ పంపింది. తర్వాత.. స్థిరాస్తుల విషయంలో అనవసరమైన వివాదాలు తలెత్తుతాయని భావించి మహారాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయకుండా వదిలేసింది. రాజస్థాన్‌లో పట్టణప్రాంత భూములు, ఆస్తులకు టైటిల్‌ ఇచ్చేందుకు ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చినా అమలు చేయలేకపోయారు. దాని కాలపరిమితి దాటిపోయింది. ఇలా దేశంలో ఏ రాష్ట్రమూ దీనివైపు కన్నెత్తి చూడని తరుణంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఎందుకు హడావుడిగా ‘ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని’ తెచ్చారు? దాని అమలు కోసం ఎందుకు చకచకా పావులు కదిపారు? దీని వెనుకున్న మతలబేంటో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం జగన్‌ ప్రభుత్వంపైనే ఉంది. ఏ దురుద్దేశం లేకపోతే చట్టం అమలుకు ఎందుకంత తొందరపడ్డారు? ప్రజల స్థిరాస్తులను చట్టం ముసుగులో కబ్జా చేయడానికా? లేదా ఇప్పటికే ఆక్రమించిన వాటిని చట్టబద్ధం చేసుకోవడానికా? ప్రజలకు వివరణ ఇవ్వాల్సింది వైకాపా పెద్దలే. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను దేశంలో మొట్టమొదట అమలు చేస్తున్నది ఏపీలోనే అని వైకాపా నేతలు గొప్పలకు పోతున్నారు. కానీ దానివల్ల కలిగే నష్టాలేంటో చూడట్లేదు.

పౌరుల స్థిరాస్తుల వ్యవహారానికి సంబంధించి ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం తెచ్చే ముందు వైకాపా ప్రభుత్వం భాగస్వాములను సంప్రదించలేదు. లాభనష్టాలను ప్రజలకు వివరించలేదు. ప్రజల ఆస్తులతో ముడిపడి ఉన్న ఈ చట్టం గురించి వారికి తెలియనీయకుండా రహస్యంగా ఉంచింది. సివిల్‌ కోర్టులను భూవివాదాల పరిష్కార పరిధి నుంచి పూర్తిగా పక్కన పెట్టేటప్పుడు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సమ్మతి ఎందుకు తీసుకోలేదు? గుట్టుగా పని కానిచ్చేద్దాం అని భావించారా? స్థిరాస్తులపై ప్రజల్లో ఇప్పటికే ఆందోళన మొదలైంది. వైకాపా కుట్రపూరిత చర్యల గురించి ప్రజలకు తెలియడంతో ఆ పార్టీ నేతలు రోజుకొకలా పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారు. చట్టం ఇంకా అమల్లోకి రాలేదంటారొకరు, ఇది కేంద్రప్రభుత్వ చట్టమని.. తమ పాత్రేమీ లేదని అంటారు మరొకరు. చట్టాన్ని అమలు చేసి తీరతాం అంటారు ఇంకొకరు. ఏపీ భూ యాజమాన్య చట్టం విషయంలో వైకాపా వ్యూహం బెడిసికొట్టింది. రాష్ట్ర ప్రజలు అప్రమత్తమయ్యారు. దీంతో వైకాపా ప్రభుత్వం ఎన్నికల వేళ గోడమీద పిల్లి వాటం అనుసరిస్తోంది.


వీటికి సమాధానం చెప్పండి

  • ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం 2023 అక్టోబరు 31 నుంచి రాష్ట్రంలో అమల్లోకి వచ్చిందని 2023 నవంబరు 1న జీవో 512 జారీచేసింది మీ హయాంలోని రెవెన్యూశాఖ కాదా? జీవోను వెబ్‌సైట్‌ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచకుండా గోప్యత పాటించలేదా?
  • ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ చట్టబద్ధతను సవాలు చేస్తూ హైకోర్టులో గంపగుత్తగా వ్యాజ్యాలు దాఖలైతే భుజాలు తడుముకుంది మీ ప్రభుత్వం కాదా?
  • టైటిలింగ్‌ చట్టంలోని సెక్షన్‌ 4 ప్రకారం ఆయా ప్రాంతాల్లోని స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ కోసం వ్యవస్థను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఇంకా నోటిఫికేషన్‌ ఇవ్వలేదని, అందుకు సమయం పడుతుందని, చట్టం అమలుకు నిబంధనలను రూపొందించాల్సి ఉందని, టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు (టీఆర్‌వో), ల్యాండ్‌ టైటిలింగ్‌ అప్పిలేట్‌ అధికారులను (ఎల్‌టీఏవో) ఇంకా నియమించలేదని హైకోర్టు సాక్షిగా ఏజీ శ్రీరామ్‌ చెప్పిన మాట వాస్తవం కాదా?
  • కక్షిదారులు దాఖలు చేస్తున్న స్థిరాస్తి వివాదాల దావాలను తిరస్కరించొద్దని, విచారణలను కొనసాగించాలని రాష్ట్రంలోని అన్ని సివిల్‌ కోర్టులను హైకోర్టు ఆదేశించిన మాట నిజం కాదా?  
  • చట్టం అమలుకు చర్యలు తీసుకోవట్లేదని ఓవైపు వైకాపా ప్రభుత్వ పెద్దలు ప్రజల్ని మభ్యపెట్టే యత్నం చేస్తూనే.. ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంలోని సెక్షన్‌ 3 ప్రకారం.. 2023 డిసెంబరు 29న ఏపీ ల్యాండ్‌ అథారిటీని ఏర్పాటుచేయలేదా?
  • ఆ అథారిటీకి ఛైర్‌పర్సన్‌, కమిషనర్‌, సభ్యులుగా కొందరు అధికారులను నియమించింది నిజం కాదా? అందుకోసం రెవెన్యూశాఖ ప్రత్యేక సీఎస్‌ జి.సాయిప్రసాద్‌ జీవో 630 జారీచేయడం వాస్తవం కాదా?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని