వరదాయినికి జగన్‌ శాపం

ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారో మంత్రి... ‘పర్సంటా అరపర్సంటా..’ అంటూ ఊగిపోయారు ఇంకో మంత్రి... 2021 జూన్‌ నాటికే అందుబాటులోకి తెస్తామన్నారు ముఖ్యమంత్రి... మార్చి పోతే సెప్టెంబరు తరహాలో.. ఆరు నెలలు, ఏడాది కాదు.. ఐదేళ్లు గడిచినా... పోలవరాన్ని పూర్తి చేయకపోగా నష్టం చేకూర్చారు!

Published : 05 May 2024 07:47 IST

జగన్‌ పాలనలో పోలవరం ప్రాజెక్టుపై తీవ్ర నిర్లక్ష్యం
ఘడియకో మాటతో జలాశయాన్ని గతి తప్పించిన నేత
2019 వరకే కొలిక్కి వచ్చిన పనులన్నీ నిలిపివేత
కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా వినలేదు
సీఎం రివర్స్‌ నిర్ణయాలతో నిర్మాణంలో అనూహ్య జాప్యం
ఈ కారణంగానే డయాఫ్రం వాల్‌, గైడ్‌బండ్‌లు ధ్వంసం
2021లోనే పూర్తి చేస్తామన్న పనులు 2025 వరకు పొడిగింపు
ఆయన మళ్లీ వస్తే ఇక అంతే సంగతులు!

ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారో మంత్రి...  
‘పర్సంటా అరపర్సంటా..’ అంటూ ఊగిపోయారు ఇంకో మంత్రి...
2021 జూన్‌ నాటికే అందుబాటులోకి తెస్తామన్నారు ముఖ్యమంత్రి...
మార్చి పోతే సెప్టెంబరు తరహాలో.. ఆరు నెలలు, ఏడాది కాదు.. ఐదేళ్లు గడిచినా... పోలవరాన్ని పూర్తి చేయకపోగా నష్టం చేకూర్చారు!
‘రివర్స్‌’ పేరిట కావాల్సిన వారికే కాంట్రాక్టు కట్టబెట్టారు...
కొద్దిపాటి పనులనూ కొలిక్కి తేలేక... ఆంధ్రులకు పోల‘వరాన్ని’ దక్కకుండా చేశారు జగన్‌!


పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌ స్వరూపమే మారిపోతుంది. ఈ బహుళార్థసాధక జలాశయం రాష్ట్రం మొత్తానికి అండగా నిలుస్తుంది. ఇందులో 194.6 టీఎంసీల నీటి నిల్వకు అవకాశం ఉంటుంది. ఏడాది మొత్తం మీద 322 టీఎంసీలు వినియోగించుకోవచ్చు. ఆయకట్టులో 23.5 లక్షల ఎకరాల స్థిరీకరణ సాధ్యమవుతుంది. కొత్తగా 7.2 లక్షల ఎకరాల ఆయకట్టును సాగులోకి తేవచ్చు. పైగా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణాకు మళ్లించవచ్చు. ఆ నీటిని రాయలసీమ జిల్లాల్లోని కరవు ప్రాంతాల అవసరాలకు తిరిగి మళ్లించుకునే అవకాశముంది. పోలవరం వద్ద 960 మెగావాట్ల జలవిద్యుత్తు ఉత్పత్తి సాధ్యమవుతుంది. విశాఖ స్టీల్‌ ప్లాంటుకు నీళ్లందిస్తుంది. విశాఖ నగర తాగునీటి అవసరాలను తీరుస్తుంది. పోలవరం కాలువలు ప్రవహించే మార్గంలో 540 గ్రామాల్లోని 28.5 లక్షల మంది ప్రజలకు తాగునీరూ అందుతుంది. ఎడమ కాలువ ద్వారా గోదావరి వరద నీటిని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా అక్కడి అన్ని జిల్లాలకు అందించవచ్చు.


2021 జూన్‌ అన్నారు.. మరి ఏమైంది జగన్‌ ?

ముఖ్యమంత్రి హోదాలో 2019 జూన్‌ 20న జగన్‌ పోలవరం ప్రాజెక్టును తొలిసారి సందర్శించారు. అక్కడే ఉన్నతాధికారుల సమక్షంలో నిర్మాణ పురోగతిపై సమీక్షించారు. ‘‘మీరు... మీ అంచనా కన్నా మరో రెండు నెలల ఎక్కువ సమయం కలిపి చెప్పండి. పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తి చేయగలం’’ అని ఇంజినీరింగ్‌ అధికారులందరినీ అడిగారు. అంతేకాదు ‘‘మీరు అన్నీ మాట్లాడుకుని చెప్పండి, మళ్లీ తేడా రాకూడదు’’ అనీ హెచ్చరించారు. అధికారులంతా కలిసి 2020 డిసెంబరు నాటికి పూర్తి చేస్తామన్నారు. ఆ మాట విని అందుకు మరికొంత సమయం కలిపి 2021 జూన్‌ నాటికి పోలవరం నీళ్లు అందిస్తామని సీఎం జగన్‌ స్వయంగా ప్రకటించారు. అంటే 2019 జూన్‌ 20 నాటికి పోలవరం పనులు సింహభాగం పూర్తయ్యాయని ఇంజినీరింగ్‌ అధికారులు అంగీకరించినట్లే కదా. సాక్షాత్తూ జగన్‌ సైతం ప్రాజెక్టు పనుల తీరును చూసి వారు చెప్పింది నమ్మినట్లే కదా. పనులు సాగుతున్న తీరుపై ఆయనకు ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవన్నట్లే కదా. మరి... ఐదేళ్లలో ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదు...? ప్రాజెక్టును గందరగోళంలోకి ఎందుకు నెట్టేశారు...? ఎందుకంటే ఆయన హయాంలో చేసిన ఘనకార్యాల కారణంగా... డయాఫ్రం వాల్‌, గైడ్‌బండ్‌ ధ్వంసమయ్యాయి. ఎగువ కాఫర్‌ డ్యాం సీపేజీలతో కునారిల్లింది. ప్రధానడ్యాం నిర్మించాల్సిన చోట భారీ అగాధాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించాలా? ఎలా నిర్మించాలన్న సందేహాలు వేధిస్తున్నాయి. అంతర్జాతీయ నిపుణులు వస్తే తప్ప తామేమీ చేయలేమంటూ కేంద్ర జలసంఘం నిపుణులు, రాష్ట్ర అధికారులు తేల్చేశారు. అంతర్జాతీయ నిపుణుల కోసం టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు ఒక అనిశ్చితిలోకి వెళ్లిపోయింది. కొత్త పాలకులకు ఇదొక పెద్ద సవాల్‌గా నిలవబోతోంది.


మళ్లీ మళ్లీ.. మాట తప్పి...

పోలవరం, వెలిగొండ సహా జలయజ్ఞం ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం.

2019 మ్యానిఫెస్టోలో వైకాపా హామీ

2021 జూన్‌ నాటికి ఏ పనీ పెండింగులో లేకుండా పూర్తి చేసి, పోలవరాన్ని జాతికి అంకితం చేద్దాం.

2019 జూన్‌లో సీఎం జగన్‌ తొలిసారి పోలవరం వెళ్లినప్పుడు సెలవిచ్చిన మాట  

2021 డిసెంబరు నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. 2022 ఖరీఫ్‌ నాటికి పొలాలకు నీళ్లు ఇచ్చేస్తాం.

2020లో మాట మార్చిన జగన్‌  

2023 ఖరీఫ్‌ సీజన్‌కు పోలవరం ప్రాజెక్టు నీళ్లు ఇస్తాం. అవరోధాలన్నీ దాటుకుని ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం.

2022 మార్చిలో శాసనసభలో జరిగిన చర్చలో రెండోసారి నాలుక మడత

అన్ని అవాంతరాలు అధిగమించాం. 2025 ఖరీఫ్‌కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి, నీళ్లు నిలబెడతాం.

2023 ఆగస్టు 7న ముచ్చటగా మూడోసారి మాటతప్పిన జగన్‌


చంద్రబాబు ఐదేళ్లలో..

ప్రగతి పరుగో.. పరుగు
పూర్తయింది 70%

చంద్రబాబు ప్రభుత్వం 2014లో ఏర్పడే నాటికి పోలవరం ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట ఎలాంటి అలికిడి లేదు. ప్రతి సోమవారం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై సమీక్షించేవారు. పనులన్నీ విడగొట్టి అనేక సంస్థలకు అప్పజెప్పారు. డయాఫ్రం వాల్‌ పనులను జర్మనీ కంపెనీ బావర్‌తో కలిసి ఎల్‌అండ్‌టీకి, మట్టి తవ్వకం పనులను త్రివేణి సంస్థకు, మిగిలిన వాటిని ట్రాన్స్‌ట్రాయ్‌కి ఇచ్చారు. ఒకేసారి సమాంతరంగా అన్ని పనులు చేసేలా ప్రణాళిక రూపొందించారు. వారం వారం లక్ష్యాలు ఏర్పాటు చేసి మళ్లీ వాటిని పర్యవేక్షించేవారు. తరచూ దిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో మాట్లాడేవారు. టెండర్ల సమస్య పరిష్కారానికి నాగ్‌పుర్‌ వెళ్లి అప్పటి జల్‌శక్తి మంత్రి గడ్కరీని కలిశారు.

కొండలు, మట్టి తవ్వకం:

అప్పట్లో ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో అన్నీ కొండలే. వాటి మధ్య రామయ్యపేట, పైడిపాక, చేగొండిపల్లి వంటి గ్రామాలు, వాటిలో ప్రజలు ఉన్నారు. మొదట ఊళ్లను ఖాళీ చేయించారు. భారీ కొండల తొలగింపు బాధ్యతను త్రివేణి కంపెనీకి అప్పగించారు. మొత్తం 11.69 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వాల్సి ఉండగా 10 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వేశారు.

ఆకృతుల ఆమోదం:

కేంద్ర జలసంఘం ప్రాజెక్టు నిర్మాణం కోసమే డ్యాం డిజైన్‌ రివ్యూ కమిటీని ఏర్పాటు చేసింది. చంద్రబాబు చొరవతో... వారు అనేకసార్లు డ్యాం వద్దకు వచ్చి క్షేత్రస్థాయిలోనూ పరిశీలించి, సమావేశాలు నిర్వహించి వీలైనంత వేగంగా ఆకృతులను ఆమోదిస్తూ వచ్చారు.

డయాఫ్రం వాల్‌

2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు హయాంలో కీలకమైన డయాఫ్రం వాల్‌ నిర్మించారు. 1,399 మీటర్ల మేర 60 అడుగుల లోతు నుంచి గోదావరి గర్భంలో నిర్మించుకుంటూ వచ్చారు.

స్పిల్‌ వే నిర్మాణం

కీలక కట్టడమైన స్పిల్‌వేలో మొత్తం 53 బ్లాకులు, 48 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. దీన్ని 57.90 మీటర్ల ఎత్తున నిర్మించాలి. దాదాపు 25.72 మీటర్ల ఎత్తుకు మించి చంద్రబాబు హయాంలోనే నిర్మించారు. గ్యాలరీ స్థాయి దాటింది. పియర్ల నిర్మాణం ప్రారంభమైంది.

కాఫర్‌ డ్యాంలు:

ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణం దాదాపు 35%, దిగువ కాఫర్‌డ్యాం 10% మేర పూర్తయ్యాయి.

స్పిల్‌ ఛానల్‌:

స్పిల్‌వే దాటి వచ్చిన నీరు స్పిల్‌ ఛానల్‌ మార్గంలో ప్రయాణించి తిరిగి గోదావరిలో కలుస్తుంది. ఈ ఛానల్‌ పొడవునా కాంక్రీటు చేయాలి. స్పిల్‌వే, స్పిల్‌ ఛానళ్లకు కలిపి 38 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనికి... 26 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పోశారు.

గేట్ల ఏర్పాటు

స్పిల్‌వేతో పాటే గేట్ల నిర్మాణమూ ప్రారంభించారు. 52 గేట్ల ఫ్యాబ్రికేషన్‌ మూడొంతులకు పైగా పూర్తయింది. హైడ్రాలిక్‌ సిలిండర్లు ఖరారు చేసి ఆర్డర్‌ ఇచ్చే పని పూర్తయింది.

రెండో డీపీఆర్‌

పోలవరం ప్రాజెక్టు రెండో డీపీఆర్‌కు (సవరించిన అంచనాలు) రూ.57,725 కోట్లతో కేంద్ర సాంకేతిక సలహా కమిటీ ఆమోదం సాధించారు.


తెదేపా హయాంలో అవినీతి లేదు

తెదేపా హయాంలో కొనసాగిన పోలవరం ప్రాజెక్టు పనుల్లో... ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగలేదని కేంద్రమే సుస్పష్టంగా ప్రకటించింది. ఈ విషయాన్ని జగన్‌ ప్రభుత్వమే తమకు తెలియజేసిందని రాజ్యసభలో కేంద్ర మంత్రి ప్రకటించడం గమనార్హం.

కేంద్రం నుంచి నిధులూ సాధించలేదు

పోలవరానికి అవసరమైన నిధులనూ జగన్‌ సాధించలేదు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని రూ.55,656.87 కోట్లకు సవరించిన అంచనాలను సాంకేతిక సలహా కమిటీ ఎప్పుడో ఆమోదించింది. అనంతరం రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ కూడా రూ.47,725 కోట్లకు సిఫార్సు చేసింది. తన ఐదేళ్ల కాలంలో ఈ మేరకు ఆమోదింపజేసుకోవడం ముఖ్యమంత్రికి చేతకాలేదు. పైగా ఇదే విషయాన్ని పక్కనపెట్టి తొలిదశకు నిధులు తెస్తామంటూ కొత్త పల్లవి అందుకున్నారు. దానికి సమావేశాలు, చర్చలు జరపడం, ప్రతిపాదనలు పంపడం, సందేహాలను నివృత్తి చేయడంతో పుణ్యకాలం పూర్తయింది. తొలిదశలో భాగంగా మొత్తం రూ.36,449.83 కోట్లు అవసరమని రాష్ట్రం ప్రతిపాదించింది. కేంద్ర జలసంఘం రూ.31,625.38 కోట్లకు సిఫార్సు చేసింది. ఆ మొత్తం రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ పరిశీలనకు వెళ్లింది. అక్కడా కొలిక్కి వచ్చిందన్నారు. అంతేతప్ప... తొలిదశకు కావాల్సిన నిధులకు సైతం కేంద్రం నుంచి తేలేకపోయారు.

చేతులెత్తేసిన వైకాపా సర్కారు

యుద్ధప్రాతిపదికన పోలవరం పూర్తి చేస్తామని మాటిచ్చిన జగన్‌ ఆ విషయంలో పూర్తిగా విఫలమయ్యారు. నిర్మించకపోగా పెను విధ్వంసం సృష్టించారు. జగన్‌ హయాంలో చేసిన పని తక్కువ. విధ్వంసమే ఎక్కువ. మళ్లీ ఈ ప్రాజెక్టును గాడిన పెట్టడం ఒక పెద్ద సవాల్‌గా చెప్పాలి. 2014 నుంచి 2019 మే నాటికి పోలవరంలో ఎంత పని జరిగింది? 2019 మే నుంచి 2023 డిసెంబరు నాటికి ఎంత పని జరిగిందో పరిశీలిస్తే వైకాపా సర్కారు ప్రతిభ ఏమిటో కళ్లకు కట్టినట్లు ఉంటుంది.

  • రెండు దశల్లో కలిపి లక్షకు పైగా కుటుంబాలను తరలించాల్సి ఉంది.
  • 2014కు ముందు ప్రాజెక్టుపై రూ.4,730.71 కోట్లు ఖర్చు చేశారు. 2014-19 మధ్య తెదేపా హయాంలో రూ.10,649.40 కోట్లు వెచ్చించారు. జగన్‌ ఐదేళ్లలో రూ.5,877 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. ఇవి వైకాపా ప్రభుత్వం చెప్పిన లెక్కలే.
  • ప్రధాన డ్యాం పనులు పాత నివేదికల్లో 78% వరకు అయ్యాయని పేర్కొన్న సర్కారు తాజాగా కేంద్రానికి ఇచ్చిన నివేదికలో 69.79 శాతంగా పేర్కొంది.


జగన్‌ ఐదేళ్లలో..

పనులు తక్కువ.. విధ్వంసం ఎక్కువ
చేసింది 5%

పోలవరం నిర్మాణంపై సీఎంగా జగన్‌ తీసుకున్న నిర్ణయాలన్నీ బెడిసికొట్టాయి. అధికారంలోకి వచ్చాక... పనుల వేగాన్ని తగ్గించకుండా పూర్తి చేసుంటే ఈ రోజు ఫలితం వేరేలా ఉండేది. అలాంటిది ప్రాజెక్టు పనులను వెంటనే ఆపేశారు. అంతకుముందు ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని తేలుస్తామని శాసనసభలో జగన్‌ ప్రతిన బూనారు.

మేఘా ఒక్కటే..

పోలవరం ప్రాజెక్టు పనులను కొత్త సంస్థకు అప్పగించాలని నిర్ణయించారు. ఆయన అనుయాయి సంస్థ మేఘాకు అప్పజెప్పాలని ముందే ఒక అభిప్రాయానికి వచ్చి టెండర్లు పిలిచారు. పైగా ఆ ఒక్క సంస్థ తప్ప ఎవరూ టెండర్లు వేయలేదు. రివర్స్‌ టెండర్ల పేరిట మేఘాకు పనులను అప్పగించారు. అయితే, ఆ సంస్థకు భారీ నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించిన అనుభవం లేకపోవడం గమనార్హం. పనులు కీలక దశలో ఉన్నప్పుడు గుత్తేదారును మారిస్తే ప్రాజెక్టు భవితవ్యం దెబ్బతింటుందని కేంద్రమూ హెచ్చరించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరినా జగన్‌ పట్టించుకోలేదు.

నిర్లక్ష్యం వరదైంది

2021 జూన్‌ నాటికి పోలవరం పూర్తి చేసేస్తానని జగన్‌ ప్రజలకు మాటిచ్చారు. ఆమేరకు పనులు జరగకున్నా మాట్లాడలేదు... పట్టించుకోలేదు. 2019 నవంబరులో మేఘాతో సర్కారు ఒప్పందం కుదుర్చుకుంటే, 2021 జనవరి వరకు ఆ సంస్థ చేసిన పని స్వల్పమే. ఆ ఉదాసీనతే ప్రాజెక్టు కొంప ముంచింది. ఎగువ కాఫర్‌డ్యాం గ్యాప్‌లనైనా పూడ్చలేదు. దాన్ని పూర్తిచేసి స్పిల్‌వే మీదుగా నీళ్లను మళ్లించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. అలా చేయకపోవడంతో 2020లో వచ్చిన భారీ వరదలకు పోలవరంలో డయాఫ్రం వాల్‌ దెబ్బతింది. ప్రధానడ్యాం నిర్మించాల్సిన చోట పెద్దపెద్ద అగాధాలు ఏర్పడ్డాయి. దిగువ కాఫర్‌డ్యాం కూడా కొంతమేర నష్టపోయింది.

గర్భ శోకం ఎందుకంటే..

డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్న వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. ‘‘పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం నిర్మించాల్సిన ప్రాంతంలో భారీ గుంతలు ఏర్పడటానికి, నదీగర్భంలో కోత పడటానికి ప్రకృతి కారణం కాదు. ఇది మానవ వైఫల్యం. ఎగువ కాఫర్‌ డ్యాంలో గ్యాప్‌లను సకాలంలో పూడ్చలేని అసమర్థతే ఈ ఉత్పాతానికి కారణం’’ అని ఐఐటీ నిపుణులు తేల్చేశారు.

కేంద్ర కమిటీ ఆందోళన

పోలవరంలో స్పిల్‌వేకు ఎగువన రూ.వందల కోట్ల వ్యయంతో నిర్మించిన గైడ్‌బండ్‌ సైతం ధ్వంసమైంది. నాణ్యత లేని నిర్మాణం, నిర్వహణ లేమి ఇందుకు కారణమని కేంద్రం నియమించిన కమిటీ తేల్చి చెప్పింది. అదే తరహాలో చేపట్టిన గ్యాప్‌-1 ప్రధాన డ్యాం నిర్మాణ నాణ్యతపైనా అనుమానాలు వ్యక్తంచేసింది. జగన్‌ అధికారంలోకి వచ్చాకే ఈ రెండు నిర్మాణాలు చేపట్టడం గమనార్హం.

సీపేజీపై వినలేదు..

కాఫర్‌ డ్యాంల నుంచి పెద్ద ఎత్తున నీళ్లు సీపేజీ అవుతూ... ప్రధాన డ్యాం ప్రాంతాన్ని ముంచెత్తుతున్నాయి. దాంతో వాటిని నిర్మించినా ప్రయోజనం లేకుండా పోయిందని కేంద్ర జల సంఘం నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సీపేజీపై తాము ముందే హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం వినలేదని వారు చెబుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని