పద్మవిభూషణ్‌ అందుకున్న చిరంజీవి, వైజయంతిమాల

ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి, సీనియర్‌ నటి, ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి వైజయంతిమాల బాలిలకు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పద్మవిభూషణ్‌ అవార్డులు ప్రదానం చేశారు.

Updated : 10 May 2024 07:16 IST

9 మందికి పద్మభూషణ్‌, 55 మందికి పద్మశ్రీ పురస్కారాలు
ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము

ఈనాడు, దిల్లీ: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి, సీనియర్‌ నటి, ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి వైజయంతిమాల బాలిలకు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పద్మవిభూషణ్‌ అవార్డులు ప్రదానం చేశారు. మరో 9 మందికి పద్మభూషణ్‌, 55 మందికి పద్మశ్రీ పురస్కారాలను అందజేశారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధరంగాల ప్రముఖులకు ప్రకటించిన పద్మ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవం గురువారం ఇక్కడి రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది.

ఉపరాష్ట్రపతి జగదీప్‌ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షాలతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పద్మశ్రీ అవార్డులు అందుకున్న వారిలో తెలంగాణకు చెందిన ఆలయాల రూపశిల్పి వేలు ఆనందాచారి, తెలుగు, సంస్కృత భాషల్లో తొలి హరికథ కళాకారిణిగా పేరొందిన దాలిపర్తి ఉమామహేశ్వరి, ప్రముఖ కవి, రచయిత కూరెళ్ల విఠలాచార్య ఉన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఐదుగురికి పద్మవిభూషణ్‌, 17 మందికి పద్మభూషణ్‌, 110 మందికి పద్మశ్రీ కలిపి మొత్తం 132 మందికి ఈ పౌరపురస్కారాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 22న జరిగిన తొలివిడత కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము.. 66 మందికి అవార్డులు అందించారు. మిగిలిన 66 మందికి గురువారం ప్రదానం చేశారు. కార్యక్రమంలో చిరంజీవి సతీమణి సురేఖ, కుమారుడు రామ్‌చరణ్‌, కోడలు ఉపాసన పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని