‘WFH అనుమతిస్తున్న కంపెనీల ఆదాయాలే వేగంగా పెరుగుతున్నాయ్‌’

WFH: ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్‌ వర్కింగ్‌ సౌకర్యాన్ని ఇస్తున్న కంపెనీల ఆదాయాల్లో మెరుగైన వృద్ధి నమోదవుతున్నట్లు ఓ ప్రముఖ సర్వే తేల్చింది.

Updated : 15 Nov 2023 13:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా కష్టకాలంలో ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (WFH)’ విధానాన్ని అమలు చేసిన కంపెనీలు క్రమంగా దాన్ని ఉపసంహరించుకుంటున్నాయి. ఉద్యోగులంతా తిరిగి ఆఫీసులకు రావాలని ఆదేశిస్తున్నాయి. సుదీర్ఘకాలం ఇంటి నుంచి పని చేస్తుండడం వల్ల ఉత్పాదకత దెబ్బతింటోందని.. ఫలితంగా అది కంపెనీ ఆర్థిక ఫలితాలపై ప్రభావం చూపుతోందనేది సంస్థల వాదన. ఈ తరుణంలో ఓ ప్రముఖ సర్వే ఆసక్తికర విషయాన్ని బహిర్గతం చేసింది. రిమోట్‌ వర్కింగ్‌ (Remote Working)కు అనుమతి ఇచ్చిన కంపెనీల ఆదాయాల్లోనే గణనీయ వృద్ధి నమోదవుతోందనేది సర్వే సారాంశం.

ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ‘బోస్టన్ కన్సల్టింగ్‌ గ్రూప్‌’, ఫ్లెక్స్‌ వర్క్‌ అడ్వైజర్‌ ‘స్కూప్‌ టెక్నాలజీస్‌’ కలిసి ఈ సర్వేను నిర్వహించాయి. టెక్నాలజీ నుంచి బీమా వరకు దాదాపు 20 రంగాల్లో విస్తరించి ఉన్న కంపెనీలను సర్వేలో భాగం చేశాయి. దాదాపు 554 కంపెనీలు దీంట్లో పాల్గొన్నాయి. ఇవి సుమారు 2.67 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఇవన్నీ పూర్తిస్థాయి ఫ్లెక్సిబుల్‌ వర్కింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అంటే పూర్తిగా ఇంటి నుంచి పనిచేయడం (WFH) లేదా ఉద్యోగులకు వీలైనప్పుడు ఆఫీసుకు రావడం అనే విధానాన్ని అవలంబిస్తున్నాయి. ఇలాంటి కంపెనీల విక్రయాలు 2020 నుంచి 2022 మధ్య 21 శాతం పెరిగినట్లు సర్వేలో తేలింది. అదే హైబ్రిడ్‌ లేదా పూర్తిస్థాయి ఆన్‌సైట్‌ విధానాన్ని అమలు చేస్తున్న సంస్థల్లో మాత్రం ఈ వృద్ధి 5 శాతంగానే నమోదైనట్లు వెల్లడైంది.

మరోవైపు పూర్తిగా ఆఫీసు నుంచే పనిచేయాలని ఉద్యోగులను ఆదేశించిన కంపెనీలతో పోలిస్తే కొన్ని రోజులైనా ఆఫీసుకు వచ్చే హైబ్రిడ్‌ విధానాన్ని (Hybrid Working) అమలు చేస్తున్న కంపెనీలు తమ ఆదాయాల్లో దాదాపు రెట్టింపు వృద్ధిని నమోదు చేసినట్లు సర్వే తెలిపింది. పూర్తిస్థాయి ఫ్లెక్సిబుల్‌ విధానాన్ని అమలు చేస్తున్న కంపెనీలు ఉద్యోగులను వేగంగా నియమించుకోగలుగుతున్నాయని పేర్కొంది. అలాగే సిబ్బంది అత్యధిక కాలం కంపెనీతోనే ఉంటున్నారని స్కూప్‌ సీఈఓ రాబ్‌ సాడో వెల్లడించారు. బహుశా ఈ కారణాల వల్లే ఆయా కంపెనీల ఆదాయం వేగంగా పెరుగుతోందని అభిప్రాయపడ్డారు.

వివిధ రకాల పని విధానాల ప్రభావాన్ని పోలుస్తూ ఈ మధ్య కాలంలో జరిగిన సర్వేల్లో ఇదే చాలా విస్తృతమైనది. గతంలో జరిగినప్పటికీ.. అవి కేవలం కొన్ని కంపెనీలకు లేదా కొన్ని రంగాలకే పరిమితమయ్యాయి. అమెరికాలో మెర్సర్‌ అనే సంస్థ నిర్వహించిన సర్వే కూడా ఇటీవల దాదాపు ఇలాంటి ఫలితాలనే వెల్లడించింది. వారంలో ఒకరోజు మాత్రమే ఆఫీసులో పనిచేస్తూ.. మిగిలిన రోజులు ఇంటి నుంచి వర్క్‌చేసే వారు అత్యంత స్ఫూర్తిమంతంగా ఉన్నారని పేర్కొంది. పైగా ఆ కంపెనీలతో ఉండడం వల్ల తమ కెరీర్‌ లక్ష్యాలను కూడా చేరుకుంటామని ఉద్యోగులు భావిస్తున్నట్లు తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని