Aadhaar Card: జూన్ 14 తర్వాత ఆ ఆధార్‌ కార్డులు పనిచేయవా? ఉడాయ్‌ వివరణ..

Aadhaar Card: జూన్‌ 14లోపు ఆధార్‌ కార్డు వివరాలను అప్‌డేట్‌ చేసుకోకపోతే అవి పనిచేయబోవంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఉడాయ్‌ వివరణ ఇచ్చింది.

Updated : 26 May 2024 16:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆధార్‌కు (Aadhaar Card) సంబంధించి సోషల్‌ మీడియా సహా బయట ఈ మధ్య తెగ చర్చ జరుగుతోంది. జూన్‌ 14 లోపు వ్యక్తిగత వివరాలు అప్‌డేట్‌ చేయకపోతే కార్డు పని చేయదంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వదంతులను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (UIDAI) కొట్టిపారేసింది.

ఆధార్‌లో (Aadhaar Card) కేవలం ఉచితంగా వివరాలు సవరించుకోవడానికి మాత్రమే జూన్‌ 14 గడువని తెలిపింది. మార్చుకోకపోయినా ఆధార్‌ పనిచేస్తుందని స్పష్టం చేసింది. తర్వాత కూడా వివరాలు మార్చుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఆధార్‌ కేంద్రాలకు వెళ్లి నిర్దేశిత రుసుము చెల్లిస్తే సరిపోతుందని వివరించింది. వివరాల మార్పునకు విధించిన జూన్‌ 14 గడువు సమీపిస్తుండటంతో అనేక వదంతులు వ్యాపిస్తున్నాయి.

ఉచితంగా ఆన్‌లైన్‌లో ఆధార్‌ (Aadhaar) వివరాలు అప్‌డేట్‌ చేసుకునేందుకు ఉడాయ్‌ తొలుత 2023 డిసెంబర్‌ 14 వరకు అవకాశం ఇచ్చింది. తర్వాత దాన్ని రెండు దఫాల్లో జూన్‌ 14 వరకు పొడిగించింది. ఆలోపు ఆన్‌లైన్‌లో తగిన పత్రాలు సమర్పించి ఉచితంగా వివరాలు అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ఆధార్‌ కార్డు కోసం పేరు నమోదు చేసుకున్న నాటి నుంచి పదేళ్లు పూర్తయిన వారు వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని ఉడాయ్‌ గతంలో సూచించింది.

5 నిమిషాల ముందూ ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు.. ఈ ఆప్షన్‌ గురించి తెలుసా?

కనీసం పదేళ్లకోసారి గుర్తింపుకార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు సమర్పించి కేంద్ర గుర్తింపు సమాచార నిధి (సెంట్రల్‌ ఐడెంటిటీస్‌ డేటా రిపాజిటరీ- CIDR)లోని వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని ఉడాయ్‌ (UIDAI) పేర్కొంది. ఈ ప్రక్రియ వల్ల పౌరుల సమాచారం సీఐడీఆర్‌ వద్ద ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ ఉంటుందని వివరించింది. తద్వారా కచ్చితమైన సమాచారం నిక్షిప్తమవడానికి దోహదం చేస్తుందని తెలిపింది.

వివరాలు అప్‌డేట్‌ చేసుకోవడానికి ఉడాయ్‌ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయ్యి తాజా గుర్తింపు కార్డు, అడ్రస్‌ వివరాలను సబ్మిట్‌ చేయాలి. రేషన్‌ కార్డు, ఓటర్‌ ఐడీ, కిసాన్‌ పాస్‌బుక్‌, పాస్‌పోర్ట్‌ వంటివి గుర్తింపు, చిరునామా రెండింటికీ ధ్రువీకరణ పత్రాలుగా వినియోగించుకోవచ్చు. టీసీ, మార్క్‌షీట్‌, పాన్‌/ఇ-పాన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటివి గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా.. విద్యుత్‌, నీటి, గ్యాస్‌, టెలిఫోన్‌ బిల్లులను (మూడు నెలలకు మించని) చిరునామా ధ్రువీకరణ పత్రంగా ఉపయోగించుకోవచ్చని ఉడాయ్‌ పేర్కొంది. ధ్రువీకరణ పత్రాలను స్కాన్‌ చేసి ‘మై ఆధార్‌’ వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని