Indian Rupee: రూపాయి.. పడిపోయింది

వరుసగా నాలుగో రోజూ రూపాయి క్షీణించింది. అంతే కాదు.. జీవన కాల కనిష్ఠానికి చేరింది. గురువారం ట్రేడింగ్‌లో డాలరుతో పోలిస్తే 10 పైసలు కోల్పోయి 83.23 వద్ద ముగిసింది.

Updated : 08 Sep 2023 07:40 IST

ఆల్‌టైం కనిష్ఠానికి మన కరెన్సీ  
డాలరు, చమురు ప్రభావంతోనే

రుసగా నాలుగో రోజూ రూపాయి క్షీణించింది. అంతే కాదు.. జీవన కాల కనిష్ఠానికి చేరింది. గురువారం ట్రేడింగ్‌లో డాలరుతో పోలిస్తే 10 పైసలు కోల్పోయి 83.23 వద్ద ముగిసింది. దేశం నుంచి విదేశీ మూలధన పెట్టుబడులు బయటకు వెళ్లడం, అంతర్జాతీయంగా అమెరికన్‌ కరెన్సీ బలోపేతం కావడం ఇందుకు కారణాలుగా నిలిచాయి. అన్నిటికంటే మించి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం సెంటిమెంటును దెబ్బతీసిందని ఫారెక్స్‌ ట్రేడర్లు చెబుతున్నారు.  

దేశీయ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల ధోరణి కనిపించడంతో రూపాయికి కొంత మేరైనా బలం దక్కిందని ఫారెక్స్‌ ట్రేడర్లు అంటున్నారు. చైనా నుంచి నిరుత్సాహకర వాణిజ్య గణాంకాలు వెలువడడం వల్ల కూడా రూపాయి ఒత్తిడికి లోనైంది. గతేడాది కనిష్ఠ స్థాయికి పడ్డ చైనీస్‌ యువాన్‌లో తాజా బలహీనతలు మన రూపాయి బలహీనపడేలా చేశాయి. మరో వైపు, స్టాక్‌మార్కెట్లలో విదేశీ సంస్థాగత మదుపర్లు    (ఎఫ్‌ఐఐలు) గురువారం నికర విక్రేతలుగా మారి రూ.758.55 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. చమురు తయారీ దేశాలు (ఒపెక్‌ ప్లస్‌ దేశాలు) డిసెంబరు వరకూ సరఫరా కోతను కొనసాగించాలని నిర్ణయించిన నేపథ్యంలో చమురు ధర పీపాకు 90 డాలర్లను అధిగమించిన సంగతి తెలిసిందే. వీటి ప్రభావంతో గురువారం ఇంటర్‌బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌లో మన దేశీయ కరెన్సీ డాలరుతో పోలిస్తే 83.15 వద్ద ప్రారంభమైంది. 83.12-83.23 మధ్య ఊగిసలాడింది. చివరకు ఆల్‌టైం కనిష్ఠమైన 83.23 వద్ద ముగిసింది. అంతక్రితం రోజు రూపాయి 9 పైసలు కోల్పోయి 83.13 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 21న సైతం ఇదే స్థాయి వద్ద భారతీయ కరెన్సీ ముగిసిన విషయం విదితమే.

ప్రతికూల ధోరణి కొనసాగొచ్చు

సోమవారం నుంచి గురువారం వరకు దేశీయ యూనిట్‌ 61 పైసలు కోల్పోయింది. ఈ నాలుగు రోజుల్లో వరుసగా 9, 33, 9, 10 పైసల చొప్పున క్షీణించింది. ఐరోపా గణాంకాలు డాలరుకు మరింత మద్దతును పలకవచ్చని విశ్లేషకులు అంటున్నారు. దీనికి తోడు అమెరికా ట్రెజరీ ప్రతిఫలాలు, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు కూడా రూపాయిపై ఒత్తిడి పెంచొచ్చు. ఈ నేపథ్యంలో రూపాయి ప్రతికూల ధోరణిలోనే కొనసాగొచ్చని అంచనా వేస్తున్నారు.

ప్రభావం ఇలా..

రూపాయి బలహీనతల వల్ల దేశ దిగుమతి బిల్లులు (ముఖ్యంగా చమురుకు) పెరుగుతాయి. దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగేందుకూ కారణంగా నిలవవచ్చు. ఆర్‌బీఐ వద్ద భారీ స్థాయిలో డాలరు నిల్వలుండడం ఊటరనిచ్చే అంశం. ఎక్స్ఛేంజీ మార్కెట్లో అమెరికా కరెన్సీని విక్రయించి రూపాయికి మద్దతును పలకవచ్చు. అయితే ఈ జోక్యం వల్ల ఊగిసలాటలు తగ్గుతాయి అంతే తప్ప విలువను నిర్ణయించలేరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని