రారాజు రిలయన్స్‌

దేశంలో అత్యంత విలువైన 500 ప్రైవేటు కంపెనీల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) అగ్ర స్థానంలో నిలిచింది. 2023 అక్టోబరు నాటికి ఆయా సంస్థల మార్కెట్‌ విలువ ఆధారంగా యాక్సిస్‌ బ్యాంక్‌కు వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ విభాగమైన బర్గండీ ప్రైవేట్‌, హురూన్‌ ఇండియా సంయుక్తంగా ఈ నివేదిక రూపొందించాయి.

Updated : 13 Feb 2024 07:01 IST

దేశంలో అత్యంత విలువైన 500 ప్రైవేటు కంపెనీల్లో అగ్రస్థానం
ఈ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.231 లక్షల కోట్లు
70 లక్షల మందికి ఉపాధి చూపుతున్నాయ్‌
బర్గండీ ప్రైవేట్‌-హురున్‌ ఇండియా నివేదిక

ముంబయి: దేశంలో అత్యంత విలువైన 500 ప్రైవేటు కంపెనీల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) అగ్ర స్థానంలో నిలిచింది. 2023 అక్టోబరు నాటికి ఆయా సంస్థల మార్కెట్‌ విలువ ఆధారంగా యాక్సిస్‌ బ్యాంక్‌కు వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ విభాగమైన బర్గండీ ప్రైవేట్‌, హురూన్‌ ఇండియా సంయుక్తంగా ఈ నివేదిక రూపొందించాయి. ఈ నివేదిక రూపొందించిన సమయంలో ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ విలువ రూ.15.6 లక్షల కోట్లు (ప్రస్తుత విలువ రూ.19.65 లక్షల కోట్లు). టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) రూ.12.4 లక్షల కోట్లతో (ప్రస్తుత విలువ రూ.14.90 లక్షల కోట్లు) రెండో స్థానం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రూ.11.3 లక్షల కోట్లతో (ప్రస్తుత విలువ రూ.10.55 లక్షల కోట్లు) మూడో స్థానంలో ఉన్నాయి. ఈ నివేదిక ప్రకారం..

  • ప్రైవేటు రంగంలోని టాప్‌-500 కంపెనీల (నమోదిత, నమోదు కాని) మార్కెట్‌ విలువ 2.8 ట్రిలియన్‌ డాలర్లు (సుమారు రూ.231 లక్షల కోట్లు)గా ఉంది. సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్‌, సింగపూర్‌ల సంయుక్త జీడీపీ కంటే ఈ మొత్తం అధికం.
  • ఏడాది వ్యవధిలో ఈ కంపెనీలు 13% వృద్ధితో 952 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.79 లక్షల కోట్ల) విక్రయాలను నమోదు చేశాయి. ఒక త్రైమాసికంలో దేశ జీడీపీ కంటే ఇవి ఎక్కువ.
  • దేశంలోని 70 లక్షల మందికి (మొత్తం ఉద్యోగుల్లో 1.3 శాతం) ఈ కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పించాయి. ఒక్కో కంపెనీ సగటున 15,211 మందికి ఉపాధి కల్పించగా, ఇందులో 437 మంది మహిళలు ఉన్నారు. 179 మంది సీఈఓ స్థాయిలో ఉన్నారు.
  • 52 కంపెనీలు దశాబ్దం కంటే తక్కువ చరిత్ర ఉన్నవి కాగా, 235 ఏళ్ల చరిత్ర కలిగిన ఈఐడీ-ప్యారీ కూడా ఈ జాబితాలో ఉంది.
  • రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌నకు చెందిన జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ జాబితాలో 28వ స్థానం సాధించింది.
  • హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లు 2023 ఎడిషన్‌లో మరోసారి టాప్‌-10 జాబితాలోకి వచ్చి చేరాయి.
  • 2022లో 310 కంపెనీలు విలువ పరంగా వృద్ధి సాధించగా, 2023లో 342 సంస్థలు మార్కెట్‌ విలువ పెంచుకున్నాయి. ఇందులో 18 కంపెనీలు మార్కెట్‌ విలువను రెట్టింపు చేసుకున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, ఐటీసీ రూ.లక్ష కోట్ల మేర విలువను పెంచుకున్నాయి.
  • జాబితాలో సగానికి పైగా కంపెనీలు 2022తో పోలిస్తే రూ.1,000 కోట్లకు పైగా మార్కెట్‌ విలువను పెంచుకోగా, 75 కంపెనీలు రూ.10,000 కోట్లకు పైగా పెంచుకున్నాయి.
  • సుజ్లాన్‌ ఎనర్జీ విలువ 436% పెరిగింది. దీని తర్వాత స్థానంలో జిందాల్‌ స్టెయిన్‌లెస్‌, జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఉన్నాయి. వీటి విలువ 4 రెట్లు పెరిగిందని నివేదిక తెలిపింది. హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మేఘా ఇంజినీరింగ్‌ 150%, తయారీ సేవల అంకురం జెట్‌వర్క్‌ 100%, బెన్నెట్‌ కోల్‌మ్యాన్‌ 100% మేర మార్కెట్‌ విలువను పెంచుకున్నాయి.
  • సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ విలువ 13% తగ్గి రూ.1.9 లక్షల కోట్లకు పరిమితమైంది. దేశంలో నమోదు కాని (అన్‌లిస్టెడ్‌) కంపెనీల్లో అత్యంత విలువైనదిగా ఇది కొనసాగుతోంది.
  • ఐనాక్స్‌ విండ్‌, ఆర్‌ఆర్‌ కాబెల్‌, వెల్‌స్పన్‌ కార్ప్‌ (లిస్టెడ్‌ కంపెనీలు)లతో పాటు నమోదు కాని ఇన్‌క్రెడ్‌ ఫైనాన్స్‌, గేమ్స్‌క్రాఫ్ట్‌ వంటివీ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. వీటి సంయుక్త మార్కెట్‌ విలువ రూ.7.5 లక్షల కోట్లు.
  • దేశంలోని 44 నగరాల్లో ఈ 500 కంపెనీలు ఉండగా, ముంబయిలో అత్యధికంగా 156 సంస్థలు ఉన్నాయి. బెంగళూరులో 59, దిల్లీలో 39 సంస్థలున్నాయి.
  • ఈ జాబితాలో ఆర్థిక సేవల రంగం నుంచి 76, ఆరోగ్య సంరక్షణలో 58, వినియోగదారు వస్తువుల కంపెనీలు 38 ఉన్నాయి. సేవల రంగంలో అత్యధిక విలువను ఇన్ఫోఎడ్జ్‌ (88వ ర్యాంకు) సాధించింది. 2022తో పోలిస్తే 4.5 రెట్లు పెరిగింది. సేవల రంగంలోని కంపెనీల సంచిత విలువ 235.1% పెరిగింది.
  • బైజూస్‌, డీల్‌షేర్‌, ఫార్మ్‌ఈజీ తదితర సంస్థల వల్ల జాబితాలో ఉన్న మొత్తం అంకురాలు రూ.4 లక్షల కోట్ల మార్కెట్‌ విలువను కోల్పోయాయి.
  • రిటైల్‌ రంగం నుంచి 10 కంపెనీలు సంయుక్తంగా రూ.5,75,234 కోట్ల మార్కెట్‌ విలువను కోల్పోవడంతో జాబితా నుంచి బయటకొచ్చాయి.

తెలుగు రాష్ట్రాల నుంచి..

హైదరాబాద్‌ కేంద్రంగా 29 కంపెనీలు ఈ జాబితాలో చోటు సాధించగా, వీటి మార్కెట్‌ విలువ రూ.5,93,718 కోట్లని నివేదిక తెలిపింది. ఏడాది క్రితంతో పోలిస్తే, ఈ మొత్తం విలువ 22% పెరిగింది.

దేశంలో సొంతంగా అభివృద్ధి చెందిన సంస్థల్లో రెండో స్థానంలో నిలిచిన మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ రూ.67,500 కోట్ల విలువను కలిగి ఉంది. నమోదు కాని సంస్థల జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఈ సంస్థ విలువ ఏడాది క్రితంతో పోలిస్తే 22.1% పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని