నేరుగా షేర్లలో మదుపు చేస్తే...

నెలకు రూ.7,000 చొప్పున షేర్లలో మదుపు చేయాలని ఆలోచిస్తున్నాను. కనీసం 5 ఏళ్లపాటు పెట్టుబడిని కొనసాగిస్తాను. మంచి రాబడి వచ్చేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

Published : 23 Feb 2024 00:37 IST

నెలకు రూ.7,000 చొప్పున షేర్లలో మదుపు చేయాలని ఆలోచిస్తున్నాను. కనీసం 5 ఏళ్లపాటు పెట్టుబడిని కొనసాగిస్తాను. మంచి రాబడి వచ్చేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

మహేందర్‌

మూడేళ్లుగా స్టాక్‌ మార్కెట్లు మంచి రాబడిని అందించాయి. దీంతో మార్కెట్‌లో మదుపు చేయాలని చాలామంది ముందుకు వస్తున్నారు. నేరుగా షేర్లలో పెట్టుబడి పెట్టాలంటే స్టాక్‌ మార్కెట్‌పై అవగాహన ఉండాలి. మంచి షేర్లను ఎంచుకోవాలి. వాటిని క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండాలి. సాధారణంగా ఇది చాలామందికి సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి, నేరుగా షేర్లలో కాకుండా, పరోక్షంగా మదుపు చేసేందుకు ప్రయత్నించండి. ఇందుకోసం డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకోండి. మీరు అయిదేళ్లపాటు నెలకు రూ.7,000 చొప్పున పెట్టుబడి పెడితే.. 12 శాతం రాబడితో రూ.5,33,639 అయ్యే అవకాశం ఉంది.


నేను 30 శాతం పన్ను శ్లాబులో ఉన్నాను. రూ.40వేలను మదుపు చేయాలని అనుకుంటున్నాను. రాబడికి హామీ ఉంటూ, వచ్చిన మొత్తంపై పన్ను పడకుండా ఉండాలంటే ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి?

మోహన్‌

మీకు పన్ను భారం లేకుండా, రాబడికి హామీ ఉండాలంటే.. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌)లో జమ చేయాలి. దీని వ్యవధి 15 ఏళ్లు. ప్రత్యామ్నాయంగా ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌)లో మదుపు చేయొచ్చు. ఇందులో మూడేళ్లపాటు పెట్టుబడిని కొనసాగించాలి. కాస్త నష్టభయం ఉంటుంది.


నాలుగేళ్ల క్రితం టర్మ్‌ పాలసీ తీసుకున్నాను. గత ఏడాది ప్రీమియం చెల్లించకపోవడంతో పాలసీ రద్దు చేశారు. ఇప్పుడు కొత్తగా పాలసీ తీసుకోవాలంటే ప్రీమియం అధికంగా పడుతోంది. ఏం చేయాలి? నా వయసు 49. నెలకు రూ.80వేలు వస్తున్నాయి. ఎంత మొత్తానికి పాలసీ తీసుకోవాలి?

మధు

మీరు రూ.కోటి వరకూ జీవిత బీమా పాలసీ తీసుకోండి. దీనికోసం టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని ఎంచుకోండి. దరఖాస్తు పత్రాన్ని పూర్తి చేసేటప్పుడు మీ ఆరోగ్య, ఆహార, ఆర్థిక వివరాలను పూర్తిగా తెలియజేయండి. అవసరమైతే ఆరోగ్య పరీక్షలనూ చేయించుకోండి. ఈ పరీక్షల ఫలితాల ఆధారంగా బీమా కంపెనీ పాలసీని అందిస్తుంది. మీకు 65 ఏళ్ల వయసు వచ్చే వరకూ బీమా పాలసీని కొనసాగించేలా చూసుకోండి.  

తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని