12 ఏళ్లలో రూ.70 లక్షలు..

రెండు నెలల్లో పన్ను ఆదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ నుంచి రూ.2లక్షల వరకూ వెనక్కి వస్తున్నాయి. వీటిని మళ్లీ పెట్టుబడి పెట్టేందుకు డెట్‌ పథకాలను ఎంచుకోవచ్చా? మంచి రాబడి కోసం ఏం చేయాలి?

Published : 26 Jan 2024 00:21 IST

  • రెండు నెలల్లో పన్ను ఆదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ నుంచి రూ.2లక్షల వరకూ వెనక్కి వస్తున్నాయి. వీటిని మళ్లీ పెట్టుబడి పెట్టేందుకు డెట్‌ పథకాలను ఎంచుకోవచ్చా? మంచి రాబడి కోసం ఏం చేయాలి?

శేఖర్‌

ప్రస్తుతం వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో డెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో రాబడి కాస్త అధికంగానే వస్తోంది. డెట్‌ మ్యూచువల్‌ ఫండ్ల పెట్టుబడిపై పన్ను మినహాయింపు లభించదు. పన్ను ఆదాతోపాటు, మంచి రాబడీ రావాలంటే ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల (ఈఎల్‌ఎస్‌ఎస్‌)ను పరిశీలించండి. వీటిలో పెట్టే పెట్టుబడులకు సెక్షన్‌ 80సీ పరిమితి రూ.1,50,000 వరకూ మినహాయింపు లభిస్తుంది. మూడేళ్ల వరకూ పెట్టుబడిని వెనక్కి తీసుకునే వీలుండదు. మొత్తం రూ.2లక్షలనూ ఇందులో పెట్టుబడి పెట్టండి. పన్ను మినహాయింపు రూ.1,50,000 వరకే లభిస్తుంది.


  • మా అమ్మాయి పేరుమీద సుకన్య సమృద్ధి యోజనలో రూ.3,000, నా పేరుమీద పీపీఎఫ్‌లో రూ.7,000 చొప్పున జమ చేస్తున్నాను. మరో రూ.10,000 కొత్తగా మదుపు చేయాలనుకుంటున్నాను. వీటిలోనే కొనసాగించాలా?

ఆనంద్‌

ఇప్పటికే సురక్షిత పథకాల్లో పొదుపు చేస్తున్నారు. కాబట్టి, కొత్తగా పెట్టుబడి పెట్టే రూ.10వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయండి. ముందుగా మీ అమ్మాయి భవిష్యత్‌ ఆర్థిక అవసరాలకు తగిన రక్షణ కల్పించండి. దీనికోసం మీ వార్షికాదాయానికి 10-12 రెట్ల వరకూ విలువైన జీవిత బీమా పాలసీని టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ద్వారా తీసుకోండి. నెలకు రూ.10వేల చొప్పున 15 ఏళ్లపాటు మదుపు చేస్తే.. 12 శాతం సగటు వార్షిక రాబడితో రూ.50,10,393 అయ్యేందుకు అవకాశం ఉంటుంది.


  • నా వయసు 48. మరో 12 ఏళ్లలో కనీసం రూ.70లక్షలు నా చేతిలో ఉండాలనేది ఆలోచన. దీనికోసం ఇప్పటి నుంచి ఎంత మొత్తం మదుపు చేయాలి?

శ్రీనివాస్‌

మీ దగ్గర 12 ఏళ్ల తర్వాత రూ.70 లక్షలు ఉండాలంటే.. నెలకు కనీసం రూ.23,500 మదుపు చేయాలి. దీనిపై 11 శాతం సగటు రాబడి వచ్చేలా చూసుకోవాలి. ఇందుకోసం పెట్టుబడి మొత్తంలో 70 శాతం డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి. మిగతా మొత్తాన్ని పీపీఎఫ్‌ లేదా వీపీఎఫ్‌లో జమ చేయండి.

తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని