గోల్డ్‌ ఈటీఎఫ్‌లు మంచివేనా?

నెలకు రూ.8,000 చొప్పున మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయాలనేది ఆలోచన. కనీసం 10 ఏళ్లపాటు పెట్టుబడి కొనసాగిస్తాను

Published : 07 Jun 2024 00:33 IST

నెలకు రూ.8,000 చొప్పున మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయాలనేది ఆలోచన. కనీసం 10 ఏళ్లపాటు పెట్టుబడి కొనసాగిస్తాను. అధిక రాబడి వచ్చేలా ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి?

- ప్రశాంత్‌ 
మీరు పదేళ్ల పాటు మదుపు చేయాలనుకుంటున్నారు కాబట్టి, మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు మంచి రాబడిని ఇచ్చే అవకాశం ఉంది. అధిక రాబడి రావాలంటే, కాస్త అధికంగా నష్టభయం ఉన్న పథకాలనే ఎంచుకోవాల్సి ఉంటుంది. మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఫండ్లలో నష్టభయం అధికంగా ఉంటుంది. అదే విధంగా రాబడీ ఎక్కువగానే లభిస్తుంది. పెట్టుబడిని దీర్ఘకాలం కొనసాగించినప్పుడు మంచి ఫలితాలు ఆశించవచ్చు. రూ.8వేలలో రూ.5వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లకు కేటాయించండి. మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఫండ్లలో రూ.1,500 చొప్పున మదుపు చేయండి. ఇలా నెలకు రూ.8వేలను 10 ఏళ్లపాటు క్రమం తప్పకుండా మదుపు చేస్తే 13 శాతం రాబడి అంచనాతో రూ.17,68,295 అయ్యేందుకు అవకాశం ఉంది.

మా అమ్మాయి వయసు 14. తన పేరుమీద కనీసం 6-7 ఏళ్లపాటు మదుపు చేయాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం నెలకు రూ.30 వేల వరకూ పెట్టుబడి పెడతాం. వీలును బట్టి, పెంచుకుంటూ వెళ్తాం. మంచి మొత్తం జమ కావాలంటే ఏం చేయాలి? 
- సంధ్య
అమ్మాయి భవిష్యత్‌ అవసరాలకు తగిన రక్షణ కల్పించేందుకు కుటుంబ పెద్ద పేరుమీద టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని తీసుకోండి. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న రూ.30వేలను డైవర్సిఫైడ్‌ బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్, హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్లలో ఎస్‌ఐపీ ద్వారా మదుపు చేయండి. మీరు నెలకు రూ.30వేలను ఏడేళ్లపాటు మదుపు చేస్తే 11 శాతం రాబడితో రూ.35,21,978 అయ్యేందుకు వీలుంది. 

ఆదాయపు పన్ను ఆదా కోసం ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) ఎంచుకోవచ్చా? లేకపోతే పన్ను ఆదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో జమ చేయాలా?

- వేణు
పన్ను ఆదా కోసం తక్కువ లాకిన్‌ వ్యవధి ఉన్నది ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల (ఈఎల్‌ఎస్‌ఎస్‌)ను ఎంచుకోవడం మంచి ఆలోచనే. ఇందులో మూడేళ్ల లాకిన్‌ మాత్రమే ఉంటుంది. ట్యాక్స్‌ సేవింగ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను అయిదేళ్లు కొనసాగించాలి. కాస్త నష్టభయం భరించగలిగితే ఈఎల్‌ఎస్‌ఎస్‌లను ఎంచుకోవచ్చు. మూడేళ్లు కొనసాగిన తర్వాత ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకొని, తిరిగి మదుపు చేయొచ్చు. అప్పుడు అదనపు పెట్టుబడి అవసరం లేకుండానే పన్ను ఆదా పొందడానికి వీలవుతుంది. పాత పన్ను విధానం ఎంచుకున్న వారు మాత్రమే పన్ను ఆదా పథకాల్లో మదుపు చేయాల్సి ఉంటుంది. 
 తుమ్మ బాల్‌రాజ్‌

ప్రస్తుతం బంగారం ధర పెరుగుతోంది కదా! ఇప్పుడు పసిడిలో మదుపు చేయొచ్చా? గోల్డ్‌ ఈటీఎఫ్‌లు బాగుంటాయా?

నారాయణ

  • మూడు నెలలుగా బంగారం ధర పెరుగుతున్న మాట వాస్తవమే. సంవత్సరం అంతా చూసినా పసిడి మంచి రాబడినే అందించింది. భవిష్యత్తులోనూ ఇది కొనసాగే అవకాశాలు లేకపోలేదు. కానీ, పెట్టుబడి అంతా బంగారంలోనే పెట్టడం సరికాదు. మీరు మదుపు చేయాలనుకుంటున్న మొత్తంలో నుంచి 10-15 శాతం వరకూ మాత్రమే బంగారానికి కేటాయించాలి. దీనికోసం గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్లను (గోల్డ్‌ ఈటీఎఫ్‌) ఎంచుకోవచ్చు. దీనికోసం డీమ్యాట్‌ ఖాతా అవసరం. గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్లనూ పరిశీలించవచ్చు.  
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని