విద్యా ద్రవ్యోల్బణాన్ని మించి రాబడి...

నా వయసు 25. నెలకు రూ.30వేల వరకూ వేతనం వస్తోంది. ఇందులో నుంచి రూ.12వేల వరకూ కనీసం 15 ఏళ్లపాటు మదుపు చేయాలని ఆలోచన. నా ఆర్థిక ప్రణాళిక ఎలా ఉండాలి?

Updated : 22 Mar 2024 03:47 IST

నా వయసు 25. నెలకు రూ.30వేల వరకూ వేతనం వస్తోంది. ఇందులో నుంచి రూ.12వేల వరకూ కనీసం 15 ఏళ్లపాటు మదుపు చేయాలని ఆలోచన. నా ఆర్థిక ప్రణాళిక ఎలా ఉండాలి?

- భార్గవ్‌

ముందుగా మీరు తగిన మొత్తానికి జీవిత బీమా, ఆరోగ్య, వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలను తీసుకోండి. కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపోయే అత్యవసర నిధిని సిద్ధం చేసుకోండి. ఇవన్నీ పూర్తయ్యాక పెట్టుబడులు ప్రారంభించండి. మీరు మదుపు చేయాలనుకుంటున్న మొత్తంలో రూ.8వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలోకి మళ్లించండి. మిగతా రూ.4వేలను పీపీఎఫ్‌లో జమ చేయండి. ఇలా 15 ఏళ్లపాటు క్రమం తప్పకుండా నెలనెలా మదుపు చేస్తే సగటున 12 శాతం రాబడితో రూ.49,54,371 అయ్యేందుకు వీలుంది.


మా అబ్బాయి పేరుమీద నెలకు రూ.20వేల వరకూ పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఉంది. దీనికోసం ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి. మరో ఎనిమిదేళ్ల తర్వాత ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకుంటే ఎంత వస్తుంది?

- దేవేందర్‌

పెట్టుబడిపై వచ్చే రాబడి విద్యా ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా ఉండేలా చూసుకోవాలి. ముందుగా మీ అబ్బాయి భవిష్యత్‌ ఆర్థిక అవసరాలకు రక్షణ కల్పించేలా మీ పేరుపై ఒక టర్మ్‌ పాలసీ తీసుకోండి. పెట్టుబడి కోసం బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌, హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్లను ఎంచుకోండి. నెలకు రూ.20వేల చొప్పున కనీసం 8 ఏళ్లపాటు మదుపు చేస్తే 10.5శాతం సగటు రాబడి అంచనాతో రూ.27,94,946 అయ్యేందుకు అవకాశం ఉంది. మీకు డబ్బు అవసరమైన రెండుమూడేళ్ల ముందు నుంచే ఈ మొత్తాన్ని సురక్షిత పథకాల్లోకి మార్చుకోవాలి.


నా వయసు 62. ఒక బ్యాలెన్స్‌డ్‌ ఫండ్‌లో రూ.5 లక్షలు మదుపు చేశాను. ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకొని, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీంలో జమ చేయొచ్చా? రెండింటిలో ఏది లాభం?

- కృష్ణ
రాబోయే అయిదేళ్ల నుంచి పదేళ్లలో భారతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాగుండే అవకాశాలున్నాయి. స్టాక్‌ మార్కెట్ల పనితీరూ బాగుంటుందనే అంచనాలున్నాయి. మీరు ఐదేళ్లకు మించి వేచి చూడగలిగితే.. బ్యాలెన్స్‌డ్‌ ఫండ్‌లోనే పెట్టుబడిని కొనసాగించండి.
ఒకసారి మీ ఫండ్‌ పనితీరును సమీక్షించుకోండి. మ్యూచువల్‌ ఫండ్లలో కాస్త నష్టభయం ఉంటుందన్న సంగతి మర్చిపోవద్దు.


వచ్చే ఏడాది ఏప్రిల్‌లో పదవీ విరమణ చేయబోతున్నాను. ఇప్పటి వరకూ మా సంస్థ అందిస్తోన్న బృంద ఆరోగ్య బీమా పాలసీ ఉంది. ఇప్పుడు నేను సొంతంగా పాలసీ తీసుకుంటే మంచిదేనా? ఎంత మొత్తానికి తీసుకోవాలి?

- శ్రీనివాస్‌
అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరితే చికిత్సకు రూ.లక్షల్లోనే ఖర్చవుతుందన్న మాట కాదనలేనిది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్య బీమా పాలసీ ఒక తప్పనిసరి అవసరంగా మారింది. మీరు ఏడాదిలో పదవీ విరమణ చేయబోతున్నారు కాబట్టి, ఇప్పుడే సొంతంగా పాలసీని తీసుకోండి. కనీసం రూ.10లక్షల వరకూ పాలసీ ఉండేలా చూసుకోండి. దరఖాస్తు పత్రంలో మీ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వివరాలూ తెలియజేయండి. అవసరమైతే ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి. వీటి ఆధారంగానే బీమా కంపెనీ పాలసీ జారీ చేస్తుంది.  

- తుమ్మ బాల్‌రాజ్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని