సూపర్‌ టాపప్‌ తీసుకోవచ్చా?

నా వయసు 57. నాకు బృంద ఆరోగ్య బీమా ఉంది. దీనికి అదనంగా వ్యక్తిగతంగా మరో పాలసీ తీసుకుంటే బాగుంటుందా? లేదా సూపర్‌ టాపప్‌ను ఎంచుకోవాలా?

Published : 17 May 2024 00:52 IST

నా వయసు 57. నాకు బృంద ఆరోగ్య బీమా ఉంది. దీనికి అదనంగా వ్యక్తిగతంగా మరో పాలసీ తీసుకుంటే బాగుంటుందా? లేదా సూపర్‌ టాపప్‌ను ఎంచుకోవాలా?

కృష్ణ

  • బృంద ఆరోగ్య బీమా పాలసీలను ప్రాథమిక పాలసీలుగా పరిగణించడం సరికాదు. ఇది యాజమాన్యాలు తమ ఉద్యోగులకు అందించే ఒక ప్రయోజనం మాత్రమే. వ్యక్తిగతంగా ఆరోగ్య బీమా పాలసీ ఉండటం ఎప్పుడూ అవసరం. కనీసం రూ.5లక్షల వరకూ వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ తీసుకొని, ఆ తర్వాతే సూపర్‌ టాపప్‌ పాలసీని ఎంచుకోండి.

మా అబ్బాయి కోసం నెలకు రూ.15 వేల చొప్పున మరో ఎనిమిదేళ్ల పాటు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. పిల్లల కోసం ప్రత్యేకంగా బీమా పాలసీలు ఉన్నాయి కదా. వీటిని ఎంచుకోవచ్చా?

హరిప్రసాద్‌

  • ముందుగా మీ అబ్బాయి భవిష్యత్‌ ఆర్థిక అవసరాలకు తగిన రక్షణ కల్పించండి. దీనికోసం మీ వార్షికాదాయానికి 12 రెట్ల వరకూ జీవిత బీమా పాలసీని టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ద్వారా తీసుకోండి. పెట్టుబడులు ఎప్పుడూ పిల్లల పేరుమీద ఉండకూడదు. వీలైనంత వరకూ తల్లిదండ్రుల పేరుమీదే పెట్టుబడులు ఉండటం మంచిది. మీ దగ్గర ఎనిమిదేళ్ల వ్యవధి ఉంది కాబట్టి, డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయండి. నెలకు రూ.15వేల చొప్పున 8 ఏళ్లపాటు మదుపు చేస్తే 12 శాతం సగటు రాబడి అంచనాతో రూ.22,13,904 అయ్యేందుకు అవకాశం ఉంది.


నా వయసు 34. వార్షిక వేతనం రూ.11 లక్షలు. రూ.40 లక్షల ఆన్‌లైన్‌ టర్మ్‌ పాలసీ ఉంది. మరో రూ.50 లక్షల వరకూ పాలసీ తీసుకోవచ్చా? మరో 13 ఏళ్ల వరకూ నెలకు రూ.15వేలు మదుపు చేయాలంటే ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి?

మహేందర్‌

  • టర్మ్‌ బీమా పాలసీ తీసుకునేటప్పుడు బీమా సంస్థ కొన్ని విషయాలను పరిశీలిస్తుంది. వాటి ఆధారంగానే పాలసీ నిబంధనలను రూపొందిస్తుంది. మీ వయసు, వార్షికాదాయాన్ని బట్టి ఎంత మేరకు బీమా ఇవ్వాలనేది బీమా సంస్థలు నిర్ణయిస్తాయి. కొన్నిసార్లు వార్షిక వేతనానికి 20 రెట్ల వరకూ బీమా ఇచ్చే అవకాశాలున్నాయి. మీ వార్షిక వేతనం రూ.11 లక్షల వరకూ ఉంది కాబట్టి, ఎలాంటి ఇబ్బందీ లేకుండా అదనంగా రూ.50 లక్షల టర్మ్‌ పాలసీ తీసుకోవచ్చు. మదుపు చేయాలనుకుంటున్న రూ.15 వేలలో రూ.10వేలు డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లకు కేటాయించండి. మిగతా రూ.5వేలను మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి. ఏడాదికోసారి పెట్టుబడులను సమీక్షించుకోవడం మర్చిపోవద్దు.

నా వయసు 60. పదవీ విరమణ చేశాను. వచ్చిన ప్రయోజనాలను నెలనెలా పింఛను వచ్చేలా మదుపు చేయాలని ఆలోచన. ఇందుకోసం మంచి వడ్డీ ఇచ్చే పథకాలు ఏమున్నాయి. మ్యూచువల్‌ ఫండ్‌ డెట్ పథకాలు మంచివేనా?

ప్రతాప్‌

  • ప్రస్తుతం వడ్డీ రేట్లు అధికంగానే ఉన్నాయి. సీనియర్‌ సిటిజన్లకు పలు బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 7.5 శాతం వరకూ వడ్డీని ఇస్తున్నాయి. డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లలో ప్రస్తుతం 7 శాతం వరకూ రాబడిని ఆశించవచ్చు. స్వల్పంగా నష్టభయం ఉండే అవకాశం ఉంది. పోస్టాఫీసులో సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీంను పరిశీలించండి. ఇందులో 8.2 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. మూడు నెలలకోసారి వడ్డీ అందుతుంది.

తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని