నెలకు రూ.30వేలతో

౯ మా అబ్బాయి పేరుమీద నెలకు రూ.30 వేల వరకూ మదుపు చేయాలని ఆలోచన. 10 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టేందుకు అనువైన మదుపు పథకాలేమున్నాయి?

Updated : 09 Feb 2024 00:40 IST

మా అబ్బాయి పేరుమీద నెలకు రూ.30 వేల వరకూ మదుపు చేయాలని ఆలోచన. 10 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టేందుకు అనువైన మదుపు పథకాలేమున్నాయి? ఎంత మొత్తం జమయ్యే అవకాశం ఉంది?

చంద్రశేఖర్‌

 ముందుగా మీ అబ్బాయి భవిష్యత్‌ అవసరాలకు తగిన ఆర్థిక రక్షణ కల్పించండి. ఇందుకోసం మీ వార్షికాదాయానికి 10 నుంచి 12 రెట్ల వరకూ జీవిత బీమా పాలసీని తీసుకోండి. మీకు పదేళ్ల సమయం ఉంది కాబట్టి, మంచి రాబడి కోసం ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను పరిశీలించండి. నెలకు రూ.30వేల చొప్పున పదేళ్ల పాటు క్రమం తప్పకుండా మదుపు చేస్తే.. 12 శాతం సగటు వార్షిక రాబడి అంచనాతో రూ.63,17,544 అయ్యేందుకు వీలుంది. క్రమం తప్పకుండా మీ పెట్టుబడులను సమీక్షించుకోవడం మర్చిపోవద్దు.

 యూనిట్‌ ఆధారిత బీమా పాలసీకి నెలకు రూ.15 వేలు చెల్లిస్తున్నాను. ఇప్పటికి నాలుగేళ్లయ్యింది. దీనిని ఇప్పుడు రద్దు చేసుకోవచ్చా? ఎందులో పెట్టుబడి పెడితే రాబడి అధికంగా వస్తుంది.

 శరత్‌

సాధారణంగా యూనిట్‌ ఆధారిత బీమా పాలసీలను కనీసం అయిదేళ్లపాటు కొనసాగించాలి. ఈ లోపు మీరు ప్రీమియం చెల్లించకపోయినా, పాలసీని రద్దు చేసుకున్నా.. ఆ మొత్తం డిస్కంట్యూన్డ్‌ పాలసీ ఖాతాలోకి వెళ్తుంది. లాకిన్‌ వ్యవధి పూర్తయ్యాక నామమాత్రపు వడ్డీతో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. సాధ్యమైనంత వరకూ అయిదేళ్ల వ్యవధి తీరేంత వరకూ ప్రీమియాన్ని చెల్లించండి. ఆ తర్వాత వీలును బట్టి, పాలసీని రద్దు చేసుకోండి. మంచి రాబడి కోసం ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో దీర్ఘకాలంపాటు మదుపు చేయొచ్చు.

నేను కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తున్నాను. మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని విన్నాను. నెలకు రూ.10వేల వరకూ ఇందులో మదుపు చేయొచ్చా?    

 ప్రవీణ్‌

మీకు కనీసం అయిదేళ్లపాటు పెట్టుబడి పెట్టేందుకు వ్యవధి ఉంటే.. మ్యూచువల్‌ ఫండ్లను పరిశీలించవచ్చు. నెలకు రూ.10వేల చొప్పున క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా హైబ్రీడ్‌ ఈక్విటీ, బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లలో మదుపు చేయండి. 15 ఏళ్లపాటు ఇలా క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే.. 11 శాతం రాబడి అంచనాతో రూ.41,28,643 అయ్యేందుకు అవకాశం ఉంది.

 నాకు 29 ఏళ్లు. నెలకు రూ.35 వేలు వస్తున్నాయి. ఇందులో నుంచి రూ.8వేలను ఏదైనా పెట్టుబడికి కేటాయించాలని అనుకుంటున్నాను. నా ఆర్థిక ప్రణాళిక ఎలా ఉంటే గుంటుంది?

 మాధవ్‌

మీపై ఆధారపడిన వారుంటే.. ముందుగా తగిన మొత్తానికి జీవిత బీమా పాలసీ తీసుకోండి. దీంతోపాటు ఆరోగ్య బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలూ తీసుకోండి. ఆరు నెలల ఖర్చులకు సరిపోయే అత్యవసర నిధినీ ఏర్పాటు చేసుకోండి. మీరు మదుపు చేయాలనుకుంటున్న మొత్తంలో రూ.3వేలను పీపీఎఫ్‌లో జమ చేయండి. మిగతా రూ.5వేలను ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి.

 తుమ్మ బాల్‌ రాజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని