అమెరికా ఫండ్లలోనూ మదుపు

నా వయసు 44. ఇప్పటి వరకూ ఎలాంటి పాలసీలూ లేవు. నెలకు రూ.10,000 వరకూ రికరింగ్‌ డిపాజిట్‌ చేస్తున్నాను. నా వార్షిక వేతనం రూ.8 లక్షల వరకూ ఉంది.

Published : 02 Feb 2024 00:10 IST

  • నా వయసు 44. ఇప్పటి వరకూ ఎలాంటి పాలసీలూ లేవు. నెలకు రూ.10,000 వరకూ రికరింగ్‌ డిపాజిట్‌ చేస్తున్నాను. నా వార్షిక వేతనం రూ.8 లక్షల వరకూ ఉంది. ఒక జీవిత బీమా పాలసీని ఎంత మొత్తానికి తీసుకోవాలి? పెట్టుబడి ప్రణాళిక ఎలా ఉండాలి.

హరి

  • మీ వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల వరకూ జీవిత బీమా పాలసీ ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని ఎంచుకోవచ్చు. మీరు రూ. కోటి వరకూ బీమా పాలసీ తీసుకునే ప్రయత్నం చేయండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా, మంచి క్లెయిం చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు బీమా సంస్థలను ఎంచుకొని, పాలసీలను తీసుకోండి. దీంతోపాటు వ్యక్తిగత ప్రమాద బీమా, ఆరోగ్య బీమా పాలసీలనూ తీసుకోండి. మీరు పెట్టుబడి పెడుతున్న రూ.10వేలను దీర్ఘకాలిక అవసరాల కోసం అనుకుంటే.. హైబ్రిడ్‌ ఈక్విటీ, బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లకు మళ్లించండి.

  • మా అబ్బాయి వయసు 16. ఉన్నత చదువుల కోసం తనను అమెరికాకు పంపించాలనేది ఆలోచన. ఇప్పటి నుంచి నెలకు రూ.60వేల వరకూ పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాం. దీనికోసం ఏం చేయాలి?

మాధురి

  • విద్యా ద్రవ్యోల్బణం ఎప్పటికప్పుడు పెరిగిపోతోంది. రానున్న రోజుల్లో ఇది మరింత అధికం కావచ్చు. కాబట్టి, మీరు పెట్టే పెట్టుబడి విద్యా ద్రవ్యోల్బణాన్ని మించి రాబడి ఇచ్చేలా చూసుకోవాలి. డాలరు-రూపాయి మారకం విలువనూ పరిగణనలోకి తీసుకోవాలి. మీరు మదుపు చేయాలనుకుంటున్న రూ.60వేలలో రూ.20వేలను అమెరికా ఆధారిత మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయండి. మిగతా రూ.40వేలను భారతీయ డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో ఎస్‌ఐపీ ద్వారా మదుపు చేయండి. మీకు డబ్బులు అవసరం ఉన్న రెండేళ్ల ముందు నుంచే వీటిలో ఉన్న మొత్తాన్ని సురక్షిత పథకాలకు మళ్లించాలి.

  • నాలుగేళ్ల క్రితం రూ.30 లక్షల గృహరుణం తీసుకున్నాను. ఇప్పుడు మరో రూ.10 లక్షల వరకూ టాపప్‌ ఇస్తామంటూ బ్యాంకు చెబుతోంది. తీసుకోవచ్చా? ఏ పథకాల్లో మదుపు చేస్తే మంచి రాబడి వస్తుంది.

శ్రీకాంత్‌

  • మీ దగ్గర ఉన్న మిగులు మొత్తాన్నే ఎప్పుడూ పెట్టుబడులకు కేటాయించాలి. అప్పు తీసుకొని మదుపు చేయడం ఎప్పుడూ మంచిది కాదు. రూ.10లక్షలకు టాపప్‌ తీసుకుంటే.. వడ్డీ 9.5 శాతం నుంచి 10 శాతం వరకూ ఉంటుంది. మీ పెట్టుబడిపై దీనికి మించి రాబడి రావాలంటే, అన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు. రాబడి తక్కువగా వస్తే నష్టపోతారు. టాపప్‌ తీసుకుంటే దానికి నెలవారీ వాయిదాలు చెల్లించాలి. ఆ మొత్తాన్నే నెలనెలా పెట్టుబడి కోసం మళ్లించండి. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో కనీసం పదేళ్ల వ్యవధికి మదుపు చేయండి.

తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని