Home Loan: ఇప్పుడు ఇల్లు కొనొచ్చా?

నేను ఇల్లు కొనాలనే ఆలోచనతో ఉన్నాను. ప్రస్తుతం గృహరుణ వడ్డీ రేట్లు 8.75 శాతం వరకూ ఉన్నాయి కదా! ఇల్లు కొనేందుకు ఇది సరైన సమయమేనా?

Published : 24 May 2024 00:43 IST

  •  నేను ఇల్లు కొనాలనే ఆలోచనతో ఉన్నాను. ప్రస్తుతం గృహరుణ వడ్డీ రేట్లు 8.75 శాతం వరకూ ఉన్నాయి కదా! ఇల్లు కొనేందుకు ఇది సరైన సమయమేనా?

 రాజేశ్‌

సొంతంగా నివాసం ఉండేందుకు ఇల్లు కొనాలనుకున్నప్పుడు ఎప్పుడూ మంచి సమయమే. ఇల్లు తీసుకునే ముందు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. నికర ఆదాయంలో నుంచి వాయిదా మొత్తం 35-40 శాతానికి మించకూడదు. గృహరుణానికి అనుబంధంగా లోన్‌ కవర్‌ టర్మ్‌ పాలసీ తీసుకోవాలి. ఒకటి రెండు బ్యాంకులను సంప్రదించి, ఎక్కడ వడ్డీ కాస్త తక్కువ ఉందో చూసుకొని, రుణం తీసుకోవచ్చు.


  • ఆదాయపు పన్ను ఆదా కోసం గత ఏడాది యూనిట్‌ ఆధారిత బీమా పాలసీని తీసుకున్నాను. కానీ, ఈసారి కొత్త పన్ను విధానంలోకి మారాలని అనుకుంటున్నాను. ఆ పాలసీని రద్దు చేసుకోవచ్చా? 

కిశోర్‌

యూనిట్‌ ఆధారిత బీమా పాలసీ(యులిప్‌)లో అయిదేళ్ల లాకిన్‌ వ్యవధి ఉంటుంది. ఈలోపు పాలసీని స్వాధీనం చేసినా, ప్రీమియం చెల్లించకపోయినా పాలసీ రద్దవుతుంది. చెల్లించిన ప్రీమియంలో నుంచి కొన్ని రుసుములను మినహాయించుకొని, మిగతా మొత్తాన్ని డిస్కంట్యూన్డ్‌ పాలసీ ఖాతాలోకి మళ్లిస్తారు. ఇక్కడ నామమాత్రపు రాబడిని అందిస్తారు. అయిదేళ్లు పూర్తయిన తర్వాత మీ డబ్బును వెనక్కి తీసుకునే వీలుంటుంది.


  • మా అబ్బాయి చదువులకు ఉపయోగపడేలా నెలకు రూ.20వేల వరకూ షేర్లలో మదుపు చేయాలని అనుకుంటున్నాను. కనీసం 15-16 శాతం రాబడి వస్తే బాగుంటుందని ఆలోచన. ఏం చేయాలి?

 బీవీకే

నేరుగా షేర్లలో మదుపు చేయడం కాస్త నష్టభయంతో కూడుకున్నదే. మీకు స్టాక్‌ మార్కెట్‌పై మంచి అవగాహన ఉండాలి. మంచి షేర్లను ఎంపిక చేసుకునే నైపుణ్యం ఉండాలి. క్రమం తప్పకుండా వాటిని పరిశీలిస్తూ ఉండాలి. ఇది అందరికీ సాధ్యం కాదు. మీరు షేర్లకు బదులు డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను పరిశీలించవచ్చు. ఇందులో 12-13 శాతం వరకూ రాబడిని ఆశించవచ్చు. కనీసం అయిదేళ్లకు మించి మదుపు చేయాలి.


  • నా వయసు 45. టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాను. రిటైర్మెంట్‌ ప్రయోజనాల కోసం మనీ బ్యాక్‌ పాలసీ తీసుకోవాలని నా స్నేహితుడు చెబుతున్నారు. ఇది మంచిదేనా?

 సందీప్‌

ముందుగా మీ కుటుంబానికి తగిన రక్షణ కల్పించండి. మీ వార్షికాదాయానికి కనీసం 10 రెట్ల వరకూ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోండి. మంచి క్లెయిం చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు కంపెనీల నుంచి సమాన మొత్తాలకు ఈ పాలసీలను ఎంచుకోండి. మనీ బ్యాక్‌లాంటి పాలసీలు 3-5 శాతం వరకే రాబడినిస్తాయి. కాబట్టి, ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడం కష్టం. మీరు మదుపు చేయాలనుకుంటున్న మొత్తాన్ని క్రమానుగత పెట్టుబడి విధానంలో డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయండి.

 తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని